Share News

రక్షిత దీపావళి కోసం జాగ్రత్తలు తీసుకోవాలి

ABN , Publish Date - Oct 19 , 2025 | 11:15 PM

దీపావళి పండుగను సురక్షితంగా, ప్రశాంతంగా, ప్రమాదరహితంగా జరుపుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ఆలం ప్రజలకు సూచించారు. పండగ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం ఆయన ఓ ప్రకటన జారీ చేశారు.

రక్షిత దీపావళి కోసం జాగ్రత్తలు తీసుకోవాలి

కరీంనగర్‌ క్రైం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): దీపావళి పండుగను సురక్షితంగా, ప్రశాంతంగా, ప్రమాదరహితంగా జరుపుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ఆలం ప్రజలకు సూచించారు. పండగ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం ఆయన ఓ ప్రకటన జారీ చేశారు. అగ్ని ప్రమాదాలు, గాయాలు, శబ్ద కాలుష్యాన్ని నివారించేలా పండగ జరుపుకోవాలన్నారు. బాణసంచా వాడకం, దీపాలు వెలిగించడం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రజలు ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లైసెన్స్‌ పొందిన విక్రేతల నుంచే టపాసులను కొనుగోలు చేయాలని సూచించారు. బహిరంగ స్థలంలో మాత్రమే కాల్చాలని, నివాస ప్రాంతాలు, భవనాలు, మండే పదార్థాలకు దూరంగా, బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే టపాసులు పేల్చాలన్నారు. క్రాకర్లు పేల్చేటప్పుడు మందపాటి కాటన్‌ దుస్తులు ధరించాలన్నారు. పెద్దల పర్యవేక్షణ లేకుండా పిల్లలు టపాసులు కాల్చవద్దని సూచించారు. బకెట్‌ నీరు, ఇసుక లేదా అగ్నిమాపక యంత్రాన్ని అత్యవసర పరిస్థితుల కోసం సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పొడవైన కొవ్వొత్తి, అగర్‌బత్తీ ఉపయోగించి క్రాకర్లను వెలిగించి, సురక్షితమైన ప్రాంతానికి వెళ్లాలన్నారు. మండని క్రాకర్‌ను తిరిగి వెలిగించడానికి ప్రయత్నించవద్దని, పారవేయడానికి ముందు నీటిలో నానబెట్టాలన్నారు. ఇళ్ల లోపల, టెర్రస్‌లపై లేదా మూసిఉన్న ప్రాంతాల్లో బాణసంచా కాల్చవద్దన్నారు. వెలిగించిన క్రాకర్లను ప్రజలు, జంతువులు లేదా నిర్మాణాల వైపు గురిపెట్టడం లేదా విసిరేయడం చేయవద్దని సూచించారు. టపాసులను కర్టెన్లు, కాగితపు అలంకరణలు, విద్యుత్‌ వైర్లకు దూరంగా ఉంచాలన్నారు. నాణ్యత ఉన్న లైట్లను మాత్రమే ఉపయోగించాలని, సాకెట్లను ఓవర్‌లోడ్‌ చేయకుండా ఉంచాలన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి, అగ్నిప్రమాదం సంభవించినప్పుడు, ప్రజలు తక్షణ సహాయం కోసం వెంటనే పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ 100, ఫైర్‌ కంట్రోల్‌ రూమ్‌ 101, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సపోర్ట్‌ సిస్టమ్‌112ను సంప్రదించాలన్నారు.

Updated Date - Oct 19 , 2025 | 11:15 PM