ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
ABN , Publish Date - Aug 29 , 2025 | 01:11 AM
రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ప్రాణం ఆస్తి నష్టం సంభవించకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు.
బోయినపల్లి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో ప్రాణం ఆస్తి నష్టం సంభవించకుండా ముందస్తుగా అన్ని చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. బోయినపల్లి మండలంలోని మధ్య మానేరు రిజర్వాయర్ వద్ద మానేరు జలాలకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వద్దకు చేరుకొని ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లోపై తీశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం ఎంత ఉందో నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులోకి సిరిసిల్ల మానేరువాగు, వేములవాడ మూలవాగు నుంచి, ఎస్సారెస్పీ వరద కాలువ నుంచి వరద ప్రవాహం వస్తుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 27.5 టీఎంసీలు కాగా 21.5 టీఎంసీలు నీరు ఉందని, 75 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుందని, ఔట్‌ఫ్లో 57 వేల క్యూసెక్కులు ఉందని అధికారులు కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడారు. నీటిమట్టాన్ని పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేసిన చేస్తున్న సమయంలో ప్రజలను రైతులను అప్రమత్తంగా ఉండేలా ఎప్పటికప్పుడు సూచనలు చేయాలని ఆదేశించారు. ఎగువమానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకుపోయిన రైతులను సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ ద్వారా క్షేమంగా గమ్యం చేర్చారని వివరించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బిగితే దగ్గరుండి ముమ్మర చర్యలు చేపట్టారని పేర్కొన్నారు ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఈ ఈ కిషోర్, డీఈలు శ్రీనివాస్, అంజయ్య, ఇంచార్జ్ తహసిల్దార్ భూపేష్ ఎంపీడీవో జయశిలా, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.