పరిశోధనల వారధి ‘ప్రయాస్’
ABN , Publish Date - Aug 08 , 2025 | 01:14 AM
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించి, పరిశోధన వైపు మళ్లించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించి, పరిశోధన వైపు మళ్లించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ప్రమోషన్ రీసెర్చ్ అటిట్యూడ్ ఇన్ యంగ్ అండ్ ఆస్పిరింగ్ స్టూడెంట్(ప్రయాస్) అనే పథకాన్ని తెచ్చింది. ఢిల్లీలోని సైన్స్, మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ విభాగం(డీఈఎస్‌ఎం) ద్వారా ప్రయాస్ పథకం అమలుచేస్తారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది.
జిల్లాలో 19,071 మంది విద్యార్థులు
కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టి ప్రయాస్ పథకంలో 9వ తరగతి నుంచి 11వ తరగతి విద్యార్థుల వరకు అవకాశం ఉంటుంది. జిల్లాలో 9 నుంచి 11వ తరగతి చదువుతున్న 19071 మంది విద్యార్థులు అర్హులుగా ఉన్నారు. పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాలో 9వ తరగతి విద్యార్థులు 7720 మంది, పదో తరగతి విద్యార్థులు 7465 మంది, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 3886మంది ఉన్నారు. ఒక విద్యార్థి లేదా ఇద్దరు విద్యార్థుల బృందం పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు లేఖ విద్యా సంస్థ నుంచి ఒక నిపుణుడుతో కలిసి ప్రాజెక్టు సమర్పించేందుకు అవకాశం ఉంటుంది.
పథకం ఉద్దేశాలు...
కేంద్ర ప్రభుత్వం ప్రయాస్ పథకం ద్వారా విద్యార్థుల్లో పాఠశాల స్థాయిలో ఇతర సబ్జెక్టులతో పాటు శాస్త్రీయ పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుంది. విద్యార్థుల్లో తార్కిక ఆలోచనలు పెంపొందించడానికి, సామాజిక, పర్యావరణ సవాళ్లను వినూత్నంగా పరిష్కరించే ఆలోచనలు కలిగించే దిశగా అవకాశం కలుగుతుంది. ప్రయాస్ ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ మ్యాథమెటిక్స్‌ను ఏకీకృతం చేయడానికి దోహదపడుతుంది.
ప్రాజెక్టు కాలపరిమితి ఏడాది
ప్రయాస్ పథకంలో ఎంపికైన విద్యార్థులు పాఠశాలలో ప్రాజెక్టు ప్రారంభమైన తేదీ నుంచి పూర్తయ్యే వరకు కాలపరిమితి ఏడాది మాత్రమే ఉంటుంది. అక్టోబరు 16, 2025 నుంచి అక్టోబరు 16.2026 ఈ పథకం ఉంటుంది. ఉపాధ్యాయుడు విద్యార్థులకు పరిశోధనలు మార్గనిర్ధేశం చేస్తారు. ఉన్నత విద్యాసంస్థల నుంచి వచ్చిన నిపుణుడు విద్యార్థులకు సాంకేతిక, ప్రయోగాత్మక మార్గనిర్ధేశం అందిస్తారు.
దరఖాస్తు విధానం ఇదీ..
ప్రయాస్ పథకంలో విద్యార్థుల స్వయంగా దరఖాస్తులు చేసుకునే వీలులేదు. పాఠశాల ప్రధానోపాధ్యయుడి ద్వారా ప్రయాస్ యోజన వెబ్‌సైట్‌లో అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఒక పాఠశాల నుంచి ఒక ప్రాజెక్టుకు మాత్రమే ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్థులకు సైన్స్ ఉపాధ్యాయుడు మార్గదర్శకత్వం వహిస్తారు. ఉన్నత విద్యాసంస్థల సైన్స్ నిపుణులు, టెక్నికల్ గెడ్స్ సహకారాన్ని తీసుకునేందుకు అర్హులైన విద్యార్థులు ఆగస్టు 17లోగా ఆన్‌లైన్ ద్వారా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్‌సిఆర్‌టి డాట్ ఎన్‌ఐసి డాట్ ఇన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. సెప్టెంబరు 15 నుంచి దరఖాస్తులను పరిశీలించి 30వ తేదిలోపు విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థికి రూ.50 వేలు పరిశోధన, సామగ్రి, ప్రయాణ ఖర్చులకు, ప్రాజెక్టు రూపకల్పన అందజేస్తారు.
పరిశోధనలకు ఎంతో ఉపయోగం..
- పాముల దేవయ్య, జిల్లా సైన్స్ అధికారి
కేంద్ర ప్రభుత్వం నూతనంగా అందిస్తున్న ప్రయాస్ పథకం ద్వారా విద్యార్థుల్లో పరిశోధనాత్మక ఆలోచనలు పెంపొందిస్తాయి. సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానం విద్యార్థుల్లో పెంపొందించే దిశగా ప్రయాస్ పథకం ప్రోత్సాహకరంగా, పరిశోధనలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. జిల్లాలో ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తాం.
పరిశోధన వైపు ఆకర్షితులవుతారు..
- పాకాల శంకర్‌గౌడ్, ఫిజికల్ సైన్స్ టీచర్
పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులను పరిశోధన వైపు మళ్లించడానికి ప్రయాస్ పథకం ఎంతగానో దోహదపడుతుంది సైన్స్‌పై ఆసక్తిగల విద్యార్థులను గుర్తించి ఈ పథకానికి దరఖాస్తు చేసే విధంగా ప్రోత్సహించాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ధేశిత లక్ష్యం, భారతదేశం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలు సాధించడానికి ప్రయాస్ పథకం ఉపయోగపడుతుంది.