Share News

భూ వివాదం చుట్టూ రాజకీయం

ABN , Publish Date - Nov 14 , 2025 | 01:01 AM

జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండు సమీపంలో గల పెట్రోలు బంకు స్థల వివాదం చుట్టూ రాజకీయం జోరుగా సాగుతోంది.

భూ వివాదం చుట్టూ రాజకీయం

జగిత్యాల, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండు సమీపంలో గల పెట్రోలు బంకు స్థల వివాదం చుట్టూ రాజకీయం జోరుగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష నేతలు సంబంధిత స్థల వివాదంపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌కు లేఖ రాయడం, జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలంటూ అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ స్పందన తదితర అధికార బృందంతో కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. పెట్రోల్‌ బంకు స్థలం విలువ సుమారు రూ.వంద కోట్లు ఉంటుందని, స్థలాన్ని ఆక్రమించారంటూ పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు.

ఫస్థల వివాదానికి దారి తీసిందిలా...

జిల్లా కేంద్రంలోని 138 సర్వే నంబరులో గల సుమారు 20 గుంటల స్థలాన్ని ప్రజా అవసరాల కోసం 1952 సంవత్సరంలో అప్పటి మున్సిపల్‌ పాలకవర్గం పెట్రోలు, డీజిల్‌ బంక్‌తో పాటు కిరోసిన్‌ అవుట్‌ లెట్‌ నిర్వహణ కోసం ఓ ప్రైవేటు వ్యక్తికి లీజుకు ఇచ్చారు. ఆ సమయంలో సంబంధిత స్థలంలో సదరు వ్యాపారి కిరోసిన్‌, పెట్రోలు విక్రయాలు జరిపారు. తదుపరి సదరు వ్యాపారికి చెందిన పలువురు వారసులు మున్సిపల్‌ నుంచి కొనుగోలు చేశామని వాదిస్తున్నారు. ప్రస్తుతం సంబంధిత స్థలం సదరు వ్యాపారి వారసుల స్వాధీనంలో ఉంది. ఈ వ్యవహారంపై కోర్టులోనూ విచారణ జరిగిందని చెబుతున్నారు.

ఫస్థలంపై మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఆరోపణలు

పట్టణ నడిబొడ్డున గల సుమారు రూ.వంద కోట్ల స్థలాన్ని ఎటువంటి యాజమాన్య హక్కులు లేకుండా సదరు వ్యాపారి వారసులు స్వాధీనంలో ఉంచుకున్నారని ఆరోపిస్తూ, ఇందుకు సంబంధించిన పలు పత్రాలను చూపిస్తూ మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఇటీవల ఆరోపణలు చేశారు. దీంతో సదరు స్థలం మున్సిపాలిటీకి చెందినదా లేక పెట్రోలు బంకు నిర్వాహకులు యాజమాన్య హక్కులు పొందారా అన్న విషయం వివాదాస్పదంగా మారింది. కాగా 1952 సంవత్సరంలో మున్సిపల్‌ అధికారులు అప్పటి సమయంలో ఓ వ్యాపారికి లీజుకు ఇచ్చిన స్థలంపై గతంలో పలు సందర్భాల్లో సైతం వివాదాలు తలెత్తినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

ఫప్రతిపక్ష బీజేపీ, బీఆర్‌ఎస్‌లు సైతం..

వివాదాస్పద స్థల వ్యవహారంపై ఇటీవల ప్రతిపక్ష పార్టీలయిన బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు చెందిన నేతలు సైతం స్పందించారు. వివాదాస్పద స్థలంపై పారదర్శకంగా విచారణ జరిపించాలని కోరుతూ ఇటీవల ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లతను బీఆర్‌ఎస్‌కు చెందిన జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంతతో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు కలిసి వినతిపత్రం అందించారు. ఆక్రమణ జరిగితే తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. సదరు స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఇటీవల పలువురు బీజేపీ నేతలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్జి, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి సైతం స్పందించి పెట్రోల్‌ బంకు స్థల కబ్జా వ్యవహారమే తన రాజీనామాకు కారణమని వెల్లడించారు. ఈ వ్యవహారం వెనుక ఎమ్మెల్యే మాకునూరి సంజయ్‌ కుమార్‌ మద్దతు ఉందని ఆమె ఆరోపించారు. మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌ అనుమల్ల జయశ్రీ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖను రాసి వివాదస్పద స్థలం స్వాధీనం చేసుకోవాలని కోరారు.

ఫకలెక్టర్‌కు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ లేఖ

జిల్లా కేంద్రానికి చెందిన పలువురు రాజకీయ నేతల విమర్శలపై ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌ స్పందించారు. స్థల వివాదంపై తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. వివాదాస్పద స్థలంపై సమగ్ర విచారణ జరపాలంటూ కలెక్టర్‌ సత్యప్రసాద్‌కు లేఖ రాశారు. పలువురు రాజకీయ దురుద్దేశంతో ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేశారు. అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి, బీజేపీకి చెందిన మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి, బీఆర్‌ఎస్‌కు చెందిన జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత తదితరులు వివాదాస్పద స్థలంపై స్పందించడం, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయడంతో జిల్లాకేంద్రంలో రాజకీయం వేడెక్కింది.

ఫకొనసాగుతున్న విచారణ

పెట్రోలు బంకు స్థల వివాదంపై కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆదేశాల మేరకు ఇటీవల అధికారులు విచారణ చేపట్టారు. మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి శ్రీనివాస్‌తో పాటు సర్వే విభాగం అధికారులు, ఉద్యోగులు పలు విధాలుగా విచారణ, పరిశీలన చేస్తున్నారు. పెట్రోలు బంకుకు చెందిన స్థలం 20 గుంటలు ఉందా..హెచ్చుతగ్గులున్నాయా..స్థలం హద్దులేమిటి అని తేల్చేందుకు కొలతలు నిర్వహించారు. అధికారులు విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించి, దాని ఆదారంగా తదుపరి చర్యలు చేపడితే గాని వివాదం సమసిపోయేలా కనిపించడం లేదు. స్థల వివాదం వ్యవహారం జిల్లా కేంద్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది.

స్థల వివాదం నా దృష్టికి వచ్చింది

-అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, మంత్రి

జిల్లా కేంద్రంలో పెట్రోలు బంకు స్థల వివాదం నా దృష్టికి వచ్చింది. స్థల వివాదంపై అవసరమైన పత్రాలను పరిశీలిస్తాను. కలెక్టర్‌ సత్య ప్రసాద్‌తో చర్చించి, డాక్యుమెంట్‌ వివరాలు పరిశీలించి స్పందిస్తాను. వివాదాస్పద స్థలంపై స్పందనను ప్రజలకు తెలపాల్సిన బాధ్యత నాపై ఉంది.

Updated Date - Nov 14 , 2025 | 01:01 AM