Share News

సహకార సంఘాల్లో రాజకీయాలు

ABN , Publish Date - Mar 11 , 2025 | 01:15 AM

రైతులకు సేవలందించడానికి ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

సహకార సంఘాల్లో రాజకీయాలు

- కొన్ని సంఘాలకే పదవీ కాలం పెంపు

- మరికొన్ని సంఘాలకు ప్రత్యేక అధికారులు

- ఎమ్మెల్యేలకు నచ్చని చోట తొలగించారనే విమర్శలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

రైతులకు సేవలందించడానికి ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమకు నచ్చని, తమ మాట వినని వారు ఉన్న చోట ప్రత్యేక అధికారులనుఏర్పాటు చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆయా సంఘాల చైర్మన్లు ఆరోపిస్తున్నారు.

ఫ జిల్లాలో 30 సహకార సంఘాలు

జిల్లాలో 30 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా వీటి పదవీ కాలం ఫిబ్రవరి 14తో ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా ఆరు నెలల పాటు ఆయా సంఘాల పాలక వర్గాలనే కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యవసాయ సహకార సంఘాలకు వర్తించేలా ఈ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో కరీంనగర్‌, దుర్శేడ్‌, గట్టుదుద్దెనపల్లి, మానకొండూర్‌, దేవంపల్లి, ఊటూరు, పోరండ్ల, నుస్తులాపూర్‌, చొప్పదండి, ఆర్నకొండ, గంగాధర, కురిక్యాల, రామడుగు, కొక్కెరకుంట, చిగురుమామిడి, హుజూరాబాద్‌, తుమ్మనపల్లి, జూపాక, ఇల్లందకుంట, మల్యాల, బోగంపాడు, జమ్మికుంట, తనుగుల, ధర్మారం, వీణవంక, తాడికల్‌, గద్దపాక, మెట్‌పల్లి, సైదాపూర్‌, వెన్నంపల్లి ప్రాథమిక సహకార సంఘాలు రైతులకు అవసరమైన సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ సంఘాల పదవీ కాలం ఫిబ్రవరి 14 నుంచి మరో ఆరు నెలలు పొడగించాల్సి ఉన్నది. అధికార పార్టీ ఎమ్మెల్యేల జోక్యం కారణంగా కొన్ని సంఘాల పాలక వర్గాల పదవీ కాలం పొడగింపునకు నోచుకోవడం లేదు.

ఫ పలు సంఘాలకు ప్రత్యేక అధికారులు

పదవీ కాలాన్ని పొడగిస్తు ఉత్తర్వులు జారీ చేసే సమయంలోనే రాజకీయ జోక్యం కారణంగా మానకొండూర్‌ నియోజక వర్గంలోని పోరండ్ల, గట్టుదుద్దెనపల్లి, మెట్‌పల్లి, గద్దపాక, ఊటూరు ప్రాథమిక సహకార సంఘాల పాలక వర్గాల పదవీ కాలం పెంచకుండా ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సహకార సంఘాలతోపాటు ఇదే నియోజక వర్గ పరిధిలో సిరిసిల్ల జిల్లాలో ఉన్న గాలిపల్లి, ఇల్లంతకుంట సహకార సంఘాల పాలక వర్గాలను కూడా కొనసాగించకుండా ప్రత్యేక అధికారులను నియమించారు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగానే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు భిన్నంగా ప్రత్యేకాధికారులను నియమించి పాలక వర్గాలను పదవీ కాలం పెంచకుండా పక్కనపెట్టారని బిఆర్‌ఎస్‌ ఆరోపిస్తున్నది. బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తోపాటు ఆయా సంఘాల చైర్మన్లు ఇదే ఆరోపణను చేస్తున్నారు. ఆయా సహకార సంఘాల్లో పలు అక్రమాలు జరిగిన నేపథ్యంలోనే పాలక వర్గాల పదవీ కాలం పెంచకుండా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రత్యేక అఽధికారులను నియమించారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

చొప్పదండి నియోజక వర్గంలోని చొప్పదండి, ఆర్నకొండ వ్యవసాయ సహకార సంఘాలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు పాలక వర్గాల పదవీ కాలాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏమైందో ఏమో కాని ఇరవై రోజుల తర్వాత ఆ పాలక వర్గాల పొడగింపును రద్దు చేస్తు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ కూడా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగానే పదవీ కాలం పొడగించినా పాలక వర్గాలను రద్దు చేశారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో రైతులు ఎరువుల కొరత తదితర సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో వ్యవసాయ సహకార సంఘాలలో చోటు చేసుకుంటున్న రాజకీయాలు ఆయా ప్రాంతాల రైతులకు మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టేవిగా మారాయని విమర్శిస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో చురుకైన నేతలుగా ఉంటూ ఆ పార్టీకి గ్రామంలో పట్టు సాధించిన నేతలు సహకార సంఘాల చైర్మన్లుగా ఉన్న చోటనే పాలక వర్గాలను పొడగించడం లేదని అంటున్నారు. మరికొన్ని సహకార సంఘాల పాలక వర్గాలు కూడా రద్దయ్యే ప్రమాదం ఉన్నదని ప్రచారం జరుగుతున్నది.

ఫ రాజకీయాలకతీతంగా రైతులకు మేలు చేయాలి

- జీవీ రామకృష్ణారావు, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడగిస్తూ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా స్థానిక ఎమ్మెల్యేలు రాజకీయ కక్షతో ప్రభుత్వ ఆదేశాలను అమలు కాకుండా చూస్తున్నారని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు. ఈ సంఘాలు రాజకీయాలకతీతంగా రైతులకు మేలు చేయాల్సి ఉండగా సహకార సంఘాల చైర్మన్లు తమకు నచ్చని వారు, ఇతర పార్టీలకు చెందిన వారు ఉన్నందున ఎమ్మెల్యేలు వారి పదవీ కాలాన్ని పొడగించకుండా ఒత్తిడి తెచ్చి ప్రత్యేకాధికారులను నియస్తున్నారని ఆయన అన్నారు. అవినీతి అక్రమాలు జరిగిన సహకార సంఘాల్లోనే పాలక వర్గాలను పొడగించడం లేదని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్న మాటలను ఆయన తోసిపుచ్చారు. ఆయా సంఘాల్లోవచ్చిన ఫిర్యాదులపై విచారించిన కోర్టులు స్టే ఇవ్వడాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం నుంచి సహకార సంఘాల పాలక వర్గాల పదవీ కాలం పొడిగిస్తూ ఉత్తర్వులు రాక ముందే అవినీతి జరిగిందంటున్న సంఘాల చైర్మన్లను, పాలక వర్గాలను ఎందుకు తొలగించలేదని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ వ్యవసాయ సహకార సంఘాల విషయంలో రాజకీయాలు చేయకుండా యూరియా కొరతతోపాటు రైతులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై దృష్టి సారిస్తే మంచిదని ఆయన సూచించారు.

Updated Date - Mar 11 , 2025 | 01:16 AM