రాష్ట్రంలో రాజకీయ శూన్యత
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:16 AM
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం కరీంనగర్‌లోని వీ పార్క్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
సుభాష్‌నగర్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం కరీంనగర్‌లోని వీ పార్క్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల సమస్యలను దగ్గర నుంచి తెలుసుకోవడం కోసమే జనంబాట కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. తాను వాళ్ల, వీళ్ల బాణాన్ని కాదని తెలంగాణ ప్రజల బాణాన్ని అని అన్నారు. జనం బాట పూర్తయిన తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ప్రజల తరఫున పోరాడాల్సిన పార్టీలు ఆ పనిచేయటం లేదన్నారు. తమ ప్రాధాన్యం ప్రజల సమస్యలు తీర్చటమే, మేము ప్రజల గొంతుకగా మారుతామని అన్నారు. ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ జూబ్లీహిల్స్ ఎన్నికలో బిజీగా ఉన్నాయన్నారు. మొంథా తుపానుతో రైతులు నష్టపోయిన పట్టించుకోవడం లేదన్నారు. జాగృతి రాజకీయ వేదికేనని చాలా సందర్బాల్లో రాజకీయాలు మాట్లాడామన్నారు. మోదీ కార్మికుల హక్కులను కాలరాస్తే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు చేయాల్సినంత పోరాటం చేయలేదని ఆరోపించారు. రైతు చట్టాల గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ లేబర్ చట్టాల గురించి మాట్లాడలేదన్నారు. మోదీ కారణంగా కార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. లోకల్ బాడీ ఎన్నికల సమయంలోనే ఏం చేయాలన్నది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాకు ఎలాంటి స్టాండ్ లేదని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి మండలిలోలో తాను మాట్లాడితేనే సీఎం రూ.700 కోట్లు ఇచ్చారని తెలిపారు. ప్రతి నెల నిధులు విడుదల చేస్తామని చెప్పి ఇపుడు విడుదల చేయటం లేదన్నారు. స్కూల్స్, కాలేజ్ యాజమాన్యాలు ఆందోళన చేస్తే వారికి మద్దతుగా ఉంటామని తెలిపారు. స్కూల్స్ బంద్ కాకుండా పోరాటం చేస్తామని, లేదంటే చదువుకునే ఆడపిల్లలే నష్టపోతారని వాపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రధేశ్‌కు 23 మంది సీఎంలు అయితే ఒక్క బీసీ గానీ, మహిళ గానీ ఎందుకు సీఎం కాలేదన్నారు. అన్ని ప్రాంతాలు తిరిగి ప్రజల అభిప్రాయం తీసుకొని కార్యాచరణ తీసుకుంటామన్నారు. తన రాజీనామాను అనుమతించాలని కోరినట్లు తెలిపారు. వీలైనంత తొందరగా సామాజిక తెలంగాణ, బీసీ రిజర్వేషన్లు పూర్తి కావాలని కోరుకుంటు న్నామన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు మేలు జరుగుతుం దని, తెలంగాణలో 69 మంది మహిళ ఎమ్మెల్యేలు అవుతారని అన్నారు. కచ్చితంగా దగాపడ్డ ఉద్యమకారులను అక్కున చేర్చుకుంటామన్నారు. పేదవాడికి విద్య, వైద్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి మోదీ కార్మికుల విషయంలో నల్ల చట్టాలు తెచ్చినా సరే మనం స్పందించలేదని ఆరోపించారు. ఆర్టీసీ, సింగరేణి కార్మికులకు నష్టం జరిగే విధంగా చట్టాలు చేశారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ సహకారంతో సింగరేణిలో కార్మికుల హక్కులను కాపాడుకున్నామని తెలిపారు.
గ్రానైట్ ఆదాయాన్ని జిల్లా అభివృద్ధికి వినియోగించాల్సిన అవసరముందన్నారు. హుజురాబాద్, మానకొండూరులో ఏ రోడ్ చూసినా ఆధ్వాన్నంగా తయారైందన్నారు. పనులు ఎప్పుడు పూర్తవుతాయో బండి సంజయ్ గారు చెప్పాలన్నారు. తుఫానుతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలన్నారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు పూర్తికావడం లేదన్నారు. సమావేశంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు ఎల్.రూప్‌సింగ్, రాష్ట్ర కార్యదర్శి జాడి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.