విలీన గ్రామాల్లో రాజకీయ స్తబ్ధత
ABN , Publish Date - Nov 29 , 2025 | 01:21 AM
మొన్నటి ఎన్నికల వరకు అవన్నీ గ్రామ పంచాయతీలు... పంచాయతీ ఎన్నికల నగరా మోగితే చాలు... ఎటుచూసినా ఎన్నికల హడావుడి కనిపించేది. ఓవైపు సర్పంచు పదవులను ఆశించేవారు. మరోవైపు వార్డు సభ్యుల పదవులకు పోటీపడే వారు ఓటర్ల వద్దకు వచ్చి మద్దతు కోసం ప్రాధేయపడేవారు.
- కార్పొరేషన్‌లో విలీనంతో తగ్గిన పదవులు
- బల్దియా ఎన్నికలపై చర్చోపచర్చలు
కరీంనగర్ టౌన్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): మొన్నటి ఎన్నికల వరకు అవన్నీ గ్రామ పంచాయతీలు... పంచాయతీ ఎన్నికల నగరా మోగితే చాలు... ఎటుచూసినా ఎన్నికల హడావుడి కనిపించేది. ఓవైపు సర్పంచు పదవులను ఆశించేవారు. మరోవైపు వార్డు సభ్యుల పదవులకు పోటీపడే వారు ఓటర్ల వద్దకు వచ్చి మద్దతు కోసం ప్రాధేయపడేవారు. కరీంనగర్‌కు అత్యంత చేరువలో ఉన్న పద్మనగర్, చింతకుంట, మల్కాపూర్, రేకుర్తి, సీతారాంపూర్, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్, గోపాల్‌పూర్, బొమ్మకల్, సదాశివపల్లి, అల్గునూర్ గ్రామపంచాయతీల్లో రాజకీయ హడావుడి మరింత ఎక్కువగా ఉండేది. పేరుకే అవి గ్రామ పంచాయతీలు అయినప్పటికీ అక్కడ అంత నగరీకరణ చోటు చేసుకోవడంతో అక్కడి ఇళ్లు, భూములకు నగరంలోని విలువ ఉండేవి. దీంతో పంచాయతీలకు పోటీ చేసే వారు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేందుకు పోటీపడే వారు. ఇప్పుడు ఆ గ్రామాలన్నీ నగరపాలక సంస్థలోనే విలీనం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలతో ఆ గ్రామాలకు (విలీన డివిజన్ల) సంబంధం లేకుండా పోయింది. దీంతో ఆయా గ్రామాల్లో రాజకీయ విరామం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల పరిధిలోని ఈ గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయడంతో మండలాల్లో గ్రామాల సంఖ్య భారీగా తగ్గిపోయింది. కార్పొరేషన్‌లో డివిజన్ల సంఖ్య 66కు చేరింది.
ఫ విలీనం వద్దు... గ్రామపంచాయతీలే ముద్దు
కార్పొరేషన్‌లో విలీనం చేయవద్దంటూ ప్రజలు వ్యతిరేకించినప్పటికీ నగరీకరణలో భాగంగా సమీపంలోని గ్రామాలను విలీనం చేశారు. గ్రామాల విలీనంతో తమకు పన్నుల భారమే తప్ప అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఒరిగిందేమి లేదని విలీన గ్రామాల ప్రజలు వాపోతున్నారు. గ్రామ పంచాయతీలు ఉంటే ఒక్కో గ్రామంలో 5,6 నుంచి 10 వార్డు సభ్యులు, సర్పంచు, ఉపసర్పంచు పదువులు ఉండేవి. ఎంపీటీసీ, మండల స్థాయిలో జడ్పీటీసీ పదవులు ఉండేవి. కార్పొరేషన్‌లో విలీనంతో ఆ పదవులన్నీ పోయి పంచాయతీ పరిధిలో ఒక్క కార్పొరేటర్ పదవి మాత్రమే దక్కుతుందని రాజకీయ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థాయిని బట్టి ఎవరి హోదాలో వారు వార్డు సభ్యులు, సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులకు పోటీపడే వారమని, ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయిందని వాపోతున్నారు. దాదాపు ఐదు వేల ఓటర్లతో నగరపాలక సంస్థలో డివిజన్లను ఏర్పాటు చేయడంతో కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలువడం అందరకీ సాధ్య కాదని, వార్డుసభ్యులేకాదు ఉప సర్పంచ్, సర్పంచ్, ఎంపీటీసీ స్థాయి నాయకులు పోటీకి జంకుతున్నారు. విలీనంతో తమ పదవులు ఊడడమే కాకుండా రాజకీయ భవిష్యత్ లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో విలీన గ్రామాల్లో మున్సిపల్ ఎన్నికలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి.. ఇప్పట్లో ఉంటాయా, ఎవరు పోటీచేస్తారు... డివిజన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది... రిజర్వేషన్ ఏమైనా తెలిసిందా అంటూ నలుగురు కలిస్తే ముచ్చటిచుకుంటున్నారు.