‘రాంలీల’కు రాజకీయ సెగ
ABN , Publish Date - Oct 01 , 2025 | 12:23 AM
దసరా సందర్భంగా నగరంలోని రాంనగర్ మార్క్‌ఫెడ్ మైదానంలో రాంలీల వేడుకలను ఆ ప్రాంత మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో 15 ఏళ్లుగా నిర్వహిస్తూ వస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
దసరా సందర్భంగా నగరంలోని రాంనగర్ మార్క్‌ఫెడ్ మైదానంలో రాంలీల వేడుకలను ఆ ప్రాంత మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో 15 ఏళ్లుగా నిర్వహిస్తూ వస్తున్నారు. మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఈ కార్యక్రమానికి ప్రతియేటా అతిథిగా హాజరవుతూ వస్తున్నారు. ఈసారి రాంలీల కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. గురువారం విజయదశమిరోజు ఈ వేడుక జరుగాల్సి ఉండగా మంగళవారం ఆ మైదానం గేట్లకు అధికారులు తాళం వేశారు. అధికారపార్టీకి చెందిన పెద్దలు ఈ కార్యక్రమం తామే నిర్వహిస్తామంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చి మార్క్‌ఫెడ్ గ్రౌండ్‌కు తాళం వేయించారని బీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. గ్రౌండ్‌కు తాళం వేయడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ నగరశాఖ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు.
ఫ పరస్పర ఆరోపణలు
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ అధికారులు ప్రొటోకాల్ పాటించకుండా చేసే కార్యక్రమానికి ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. అందుకే వారు గ్రౌండ్‌కు తాళం వేశారు అంటూ వాఖ్యానించారు. రాంలీల వేడుకల ఏర్పాట్ల కోసం మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ వారంరోజులుగా మార్క్‌ఫెడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులకు అనుమతి కోరుతూ లేఖ ఇచ్చి పనులు చేపట్టామని, ప్రతియేటా ఈ కార్యక్రమం ఇలాగే చేస్తున్నామన్నారు. గత సంవత్సరం ఈ కార్యక్రమం జరిగినపుడు లేని అభ్యంతరం ఈసారెందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఏర్పాట్లు చేస్తున్న క్రమంలోనే సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్, మరికొంత మంది కాంగ్రెస్ నేతలు మార్క్‌ఫెడ్ గ్రౌండ్‌కు వెళ్లి తామే ఆ కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రభుత్వ స్థలంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తారు.. అధికారికంగానే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని బీఆర్‌ఎస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. అధికారంలో ఉన్న మిమ్మల్ని అతిథులుగా ఆహ్వానిస్తామని, అందరం కలిసి రాజకీయలకతీతంగా ఘనంగా నిర్వహిద్దామని సర్దిచెప్పగా అప్పటికి వ్యవహారం సద్దుమణిగింది. మంగళవారం ఉదయం మార్క్‌ఫెడ్ గ్రౌండ్‌కు తాళం పడడంతో రాంలీల వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. ఈ వ్యవహారంలో కలెక్టర్, పోలీస్ కమిషనర్ జోక్యం చేసుకొని శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూసి వేడుక జరిగేలా చూడాలని బీఆర్‌ఎస్ నేతలు కోరుతున్నారు.