ప్లాంటేషన్ సర్వేను అడ్డుకున్న పోడు రైతులు
ABN , Publish Date - Jun 19 , 2025 | 12:48 AM
ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములను అటవీ శాఖ అధికారులు ప్లాంటేషన్ కోసం సర్వే చేయడం సరికాదని పోడు రైతులు మండిపడ్డారు.

వీర్నపల్లి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి) : ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూములను అటవీ శాఖ అధికారులు ప్లాంటేషన్ కోసం సర్వే చేయడం సరికాదని పోడు రైతులు మండిపడ్డారు. వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామంలో 20 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీశాఖ అధికారులు బుధవారం సర్వే చేపట్టారు. విషయం తెలుసుకున్న అన్ని కులాల రైతులు అక్కడికి చేరుకొని మొక్కలు నాటొద్దని అధికారులను వేడుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 2005 సంవత్సరం తర్వాత ఆక్రమణకు గురైన అటవీ భూమిలో ప్లాంటేషన్ కోసం సర్వే చేస్తున్నామని అటవీశాఖ సెక్షన్ అధికారి పద్మలత రైతులకు వివరించారు. పోడు పట్టాల కోసం ప్రభుత్వాలను వేడుకుంటున్నామని ఏళ్ల క్రితం సాగుచేసిన భూములను అధికారులు సర్వే చేయడం సరికాదన్నారు. అధికారులు సర్వేను ఆపకపోతే పురుగుల మందు తాగే పరిస్థితి వస్తుందని రైతులు పేర్కొన్నారు. అక్కడి నుంచి రైతులను పంపించేందుకు అటవీ సిబ్బంది ప్రయత్నించినా వినకపోవడంతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.