Share News

ధాన్యం సేకరణకు ప్రణాళిక సిద్ధం

ABN , Publish Date - Oct 12 , 2025 | 01:05 AM

వానాకాలంలో సాగైన వరి ధాన్యం సేకరణకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.

ధాన్యం సేకరణకు ప్రణాళిక సిద్ధం

జగిత్యాల, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): వానాకాలంలో సాగైన వరి ధాన్యం సేకరణకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. మరో నెల రోజుల్లో దిగుబడి వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా ధాన్యం సేకరణ ఏర్పాట్లపై వ్యూహరచన చేస్తున్నారు. జిల్లాలో ఆలస్యంగా వరి నాట్లు వేసుకోవడంతో ఈ నెలాఖరు వరకు కోతలు ప్రారంభం కానుండడంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో 7.50 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 8 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, దిగుబడి అంచనా, వసతులు తదితర ఏర్పాట్లపై జిల్లా పౌరసరఫరా శాఖ, వివిధ ఏజన్సీలు, రైస్‌ మిల్లర్లతో ఇటీవల కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ నేతృత్వంలో అధికారులు సమావేశం నిర్వహించారు.

ఫజిల్లాలో 421 కొనుగోలు కేంద్రాలు..

జిల్లాలో వానాకాలం సీజన్‌ 2025-26 సంవత్సరానికి గాను 421 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఐకేపీ కేంద్రాలు 187, సహకార సంఘాల కేంద్రాలు 283, ఒకటి మెప్మా ఆధ్వర్యంలో కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. సుమారు 60 లక్షల గన్నీ సంచులు అవసరమని అంచనా వేశారు. దిగుబడి సమయానికి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అందజేస్తామని పౌర సరఫరాల శాఖ అధికారులు అంటున్నారు. ప్రతి కేంద్రంలో కొనుగోలుకు సంబంధించిన రిజిస్టర్లు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, వేయింగ్‌ యంత్రాలు, టార్పాలిన్‌ కవర్లు ఇతర వసతులు ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. హమాలీల కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంపై దృష్టి పెట్టారు. ధాన్యం రవాణాకు అవసరమైన వాహనాలను ముందుగానే సిద్ధం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసి రైతుల ఖాతాల్లో త్వరగా నగదు జమ అయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఫజిల్లాలో 3.15 లక్షల ఎకరాల్లో వరి సాగు..

జిల్లాలో ప్రధానంగా వరి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం గత ఏడాది కంటే పెరిగింది. గత యేడాది వానాకాలం సీజన్‌లో 3 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 3,15,562 ఎకారల్లో రైతులు వరిని సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 7.50 లక్షల మెట్రిక్‌ టన్నుల నుంచి 8 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో రైతుల అవసరాలు, ఇతర కంపెనీల విత్తనాలు పోను కొనుగోలు కేంద్రాలకు 5.50 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎక్కువగా దొడ్డు రకం వరి సాగు కావడంతో ధాన్యంలో 75 శాతం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది.

ఫఆలస్యంగా వరి నాట్లు..

జిల్లాలో కొన్నేళ్లుగా వానాకాలంలో ఎక్కువగా వరి సాగు చేస్తున్న రైతులు ప్రస్తుత సీజన్‌లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఆలస్యంగా వరి నాట్లు వేశారు. 75 శాతం దొడ్డు రకం, 25 శాతం సన్నరకం వ రి సాగైనట్లు అంచానాలున్నాయి. సన్నరకం ఇంటి అవసరాల కోసమే నిల్వ ఉంచుకోనున్నారు. యాసంగిలో 95 శాతం దొడ్డు రకం సాగు ఉంటుంది. దిగుబడి వచ్చిన ధాన్యంలో 90 శాతం కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి వస్తుంది. జూలైలో భారీ వర్షాలు, వరదల కారణంగా మొదట్లో నాట్లు వేసుకున్న పంట కొట్టుకపోవడం, ఇసుక మేటలు వేయడంతో రెండోసారి నారు పోసుకొని ఆగస్టు నెలాఖరు వరకు నాట్లు వేశారు. సాగు ఆలస్యం కావడంతో స్వల్పకాలిక దొడ్డు రకాల వరిసాగుకు ఎక్కువగా మొగ్గు చూపారు. దీంతో ఈ వానాకాలం సీజన్‌లో గతంలో కంటే ఎక్కువగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశం ఉంది.

ఫపెరిగిన మద్దతు ధర..

గత సీజన్‌లో కంటే ప్రస్తుత యేడాది మద్దతు ధరను పెంచి ఏ గ్రేడ్‌ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,389కి తోడుగా క్వింటాలుకు రూ.500 బోనస్‌, సాధారణ బీ గ్రేడ్‌ రకానికి రూ. 2,369 మద్దతు ధర నిర్ణయించారు. గత యేడాది కంటే అదనంగా మద్దతు ధర పెరిగింది. కాగా ధాన్యంలో 17 శాతం కంటే తక్కువ తేమ ఉన్నప్పుడే మద్దతు ధర లభిస్తుందని అధికారులు అంటున్నారు. రైతులు ధాన్యం బాగా ఆరబోసి కేంద్రాలకు తీసుకొస్తే తూకం వేయడంలో ఇబ్బందులు ఉండవని అధికారులు సూచిస్తున్నారు.

కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

-సత్యప్రసాద్‌, కలెక్టర్‌

ప్రస్తుత వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరించడానికి అనుగుణంగా ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే ఇందుకు అవసరమైన అంచనాలు రూపొందించాం. సీజన్‌లో దిగుబడి కానున్న వరి ధాన్యం, ఏర్పాటు చేయాల్సిన కేంద్రాలు, ధాన్యం తరలింపుకు వాహనాలు, నిల్వలకు గోదాములు, హమాలీలు, గన్నీ బ్యాగులు తదితర ఏర్పాట్లపై దృష్టి సారించాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నాణ్యమైన ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరను రైతులు పొందాలి. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

Updated Date - Oct 12 , 2025 | 01:05 AM