Share News

వరి పంటలకు తెగుళ్ల ముప్పు...

ABN , Publish Date - Oct 13 , 2025 | 12:09 AM

రామడుగు మండలంలో పల్లెల్లో వరి పంటలకు తెగుళ్ల రూపంలో ముప్పు పొంచి ఉంది. అష్టకష్టాలు పడి సాగు చేస్తున్న రైతాంగాన్ని చీడపీడలు బెంబేలెత్తిస్తున్నాయి. ఓవైపు ఎండాకు తెగులు, అగ్గి తెగులు, దోమపోటు ఇబ్బంది పెడుతుండగా మరోవైపు ఖర్చు తడిసి మోపెడు అవుతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

వరి పంటలకు తెగుళ్ల ముప్పు...

రామడుగు, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): రామడుగు మండలంలో పల్లెల్లో వరి పంటలకు తెగుళ్ల రూపంలో ముప్పు పొంచి ఉంది. అష్టకష్టాలు పడి సాగు చేస్తున్న రైతాంగాన్ని చీడపీడలు బెంబేలెత్తిస్తున్నాయి. ఓవైపు ఎండాకు తెగులు, అగ్గి తెగులు, దోమపోటు ఇబ్బంది పెడుతుండగా మరోవైపు ఖర్చు తడిసి మోపెడు అవుతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. మండలంలో 25 వేల ఎకరాల సాగు భూమి ఉండగా ప్రస్తుత ఖరీఫ్‌లో 23,200 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ఇందులో ప్రధానంగా 16,220 ఎకరాల్లో వరి సాగవుతుంది. ప్రస్తుతం గోపాల్‌రావుపేట, గుండి, తదితర ప్రాంతంలో దోమపోటు, అగ్గి తెగులు, ఎండాకు తెగులు రైతులను ఇబ్బంది పెడుతున్నాయి. ప్రస్తుతం వరి పైరు పొట్ట దశ నుంచి ఈనే దశ వరకు వచ్చింది. కంకి పోటు రూపంలో తెగుళ్లు రావడంతో ఎదుగుదల ఆగిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సన్నరకాల వరిపై ఈ తెగుళ్ల ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. తెగుళ్లను నివారించడానికి రైతులు క్రిమిసంహారక మందులు పిచికారి చేయడం తప్పని పరిస్థితి కావడంతో నాలుగు నుంచి ఐదుసార్లు స్ర్పే చేస్తున్నారు. ఎకరానికి 20 వేల రూపాయల వరకు ఖర్చు వస్తున్నదని రైతులు చెబుతున్నారు. జిల్లాస్థాయి వ్యవసాయ అధికారులు తక్షణమే గ్రామస్థాయిలో పరిశీలించి, ఫీల్డ్‌ డెమోస్‌ నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.

ఫ ఆరెకరాల్లో దోమపోటు వచ్చింది...

- ముదుగంటి ముకుందరెడ్డి, రైతు, గోపాల్‌రావుపేట...

ఆరెకరాల్లో దోమపోటు పాటు అగ్గి తెగులు వచ్చింది. వీటిని రక్షించుకోవడానికి నాలుగుసార్లు క్రిమిసంహారక మందులను స్ర్పే చేయవలసి వచ్చింది. ఎకరానికి 20,000 వరకు ఖర్చు అవుతుంది.

ఫ నాలుగెకరాల్లో తెగులు...

- ఎడవల్లి భూపతిరెడ్డి, రైతు, గోపాల్‌రావుపేట

రైతులు పంటను కాపాడేందుకు ఇప్పటికే నాలుగు నుంచి ఐదుసార్లు రసాయన స్ర్పేలు వాడుతున్నాం. నాలుగెకరాల పొలంలో తెగులు వచ్చింది. వీటిని తగ్గిచుకోవడానికి కష్టపడుతున్నాం. ఖర్చు పెరుగుతోంది. అధికారులు, ప్రభుత్వం ఆదుకోవాలి.

ఫ రైతులకు అవగాహన కల్పిస్తున్నాం...

- త్రివేదిక, ఏవో

ప్రస్తుతం ఎండాకు తెగులు వచ్చినట్లు తన దృష్టికి వచ్చింది. దీని నివారణ కోసం రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టి తెగుళ్లు అదుపు చేసుకోవాలి. రైతులకు సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వారి ఫీల్డ్‌ విజిట్‌ చేసి సరైన విధంగా సలహాలు ఇస్తాం. ఇప్పటికే కొన్ని ప్రాంతాలను పరిశీలించి సలహాలు ఇచ్చాం.

Updated Date - Oct 13 , 2025 | 12:09 AM