ముంపు గ్రామాల సమస్యలకు శాశ్వత పరిష్కారం
ABN , Publish Date - Jul 09 , 2025 | 12:48 AM
మిడ్ మానేరు రిజర్వాయర్ ముంపు గ్రామల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ టౌన్, జూలై 8 (ఆంధ్రజ్యోతి): మిడ్ మానేరు రిజర్వాయర్ ముంపు గ్రామల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మండలం అగ్రహారం శ్రీకన్వెన్షన్‌లో మంగళవారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి నిర్వసితులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మిడ్ మానేరు రిజర్వాయర్‌లో ముంపునకు గురైన నిర్వాసితులు ఇళ్లు కట్టుకోకుండా ఖాళీ ప్లాట్స్ ఉన్న వారికి స్పెషల్ కోటా కింద 847 మంది నిర్వసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్ల మొదటి విడతలో మంజూరు చేశామని, వీటితో వేములవాడ నియోజకవర్గానికి కేటాయించిన 3500 ఇందిరమ్మ ఇళ్లను ఇప్పటికే పంపిణీ చేశామని, స్పెషల్ కోటా కింద మిడ్ మానేరు నిర్వసితలుకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. మరో 3 వేల ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు పెండింగ్‌లో విచారణలో ఉన్నాయని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలో మిగిలిన వారికి తప్పనిసరిగా మంజూరు చేస్తామన్నారు. అర్బన్ మండలంలో ముంపు గ్రామాల నిర్వాసితులకు తప్పనిసరిగా ఇళ్లు మంజూరు అవుతాయన్నారు. నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. దశంలో ఎక్కడ కూడా పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఇవ్వడం లేదని, రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యమెందని వివరించారు. రూ.76కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఈ పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రస్తుతం జరుగుతుందన్నారు. ధనిక రాష్ట్రం తెలంగాణను గత పాలకులు అప్పుల కుప్పగా మార్చి ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందులు పడుతున్నప్పటికీ గత పాలకుల హయాంలో ప్రారంభించిన పథకాలను కొనసాగిస్తూనే ఎన్నికల సమయంలో ఇచ్చిన మేరకు ఒక్కో హామీ అమలు చేస్తున్నామన్నారు. అనంతరం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక కృషితో స్టేట్ రిజర్వు బ్యాంకు నుంచి మొదటిసారిగా 5 వేల ఇందిరమ్మ ఇళ్లను ఇప్పించారన్నారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశల్లో రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం 400 నుంచి 600 చదరపు గజాలలోపు మాత్రమే నిర్మించాలన్నారు. తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు ఇళ్లు వచ్చేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పిల్లి కనుకయ్య తదితరులు ఉన్నారు.