Share News

ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:49 PM

ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంట ప్రలోభాలకు గురికావద్దని, ఎన్నికల నియమావళిని పాటించాలని కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ విజయ్‌కుమార్‌, రూరల్‌ సీఐ ఏ నిరంజన్‌రెడ్డిలు ప్రజలను కోరారు.

ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
కవాతు నిర్వహిస్తున్న పోలీసులు

కరీంనగర్ క్రైం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంట ప్రలోభాలకు గురికావద్దని, ఎన్నికల నియమావళిని పాటించాలని కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ విజయ్‌కుమార్‌, రూరల్‌ సీఐ ఏ నిరంజన్‌రెడ్డిలు ప్రజలను కోరారు. కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని మొగ్దుంపూర్‌, చెర్లబూత్కూర్‌, చామనపల్లి, నగునూర్‌ గ్రామాల్లో కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు ఆదివారం ‘కవాతు’ నిర్వహించారు. కూడళ్లలో ప్రజలను సమీకరించి ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామాలలో ప్రజలను ఉద్దేశించి ఏసీపీ, సీఐ మాట్లాడుతూ... గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లోని ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. ఎన్నికలకు బందోబస్తుకు వచ్చిన పోలిసులకు గ్రామాల ప్రజలు సహకరించాలన్నారు. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని, ఎన్నికల తర్వాత ప్రజలందరూ కలిసి, మెలిసి ఉండాలని కోరారు. ఎన్నికల నిబంధనలు పాటించక, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు నరేష్‌, లక్ష్మారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 07 , 2025 | 11:49 PM