దివ్యాంగులకు పెన్షన్ డబ్బులు పెంచి ఇవ్వాలి..
ABN , Publish Date - Jul 28 , 2025 | 01:11 AM
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెన్షన్ డబ్బులు పెంచి ఇవ్వాలని ఎంఆర్‌పీఎస్ వ్యస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు.
సిరిసిల్ల టౌన్, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెన్షన్ డబ్బులు పెంచి ఇవ్వాలని ఎంఆర్‌పీఎస్ వ్యస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం వీహెచ్‌పీఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఛలో హైదరాబాద్ మహాగర్జన జిల్లా స్థాయి సన్నాహక సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా ఎంఆర్‌పీఎస్ వ్యస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగా హాజరై మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్‌రెడ్డి వికలాంగులకు రూ.6వేలు, వృద్ధులు, వితంతులకు చేయూత పెన్షన్ రూ.4వేలుకు పెంచి ఇస్తామని మేనిఫెస్టోలో హామీనిచ్చారన్నారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీని అమలు చేయడంల లేదని ఆరోపించారు. 20 నెలలుగా వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులు ప్రతినెల రూ. 2వేలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ. 20వేల కోట్లు కేటాయించిందని, ఆ రూపాయలు అత్యంత పేదవాలైన వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళల పెన్షన్ డబ్బులేనని, ఎవరివి ఎవరికి ఇచ్చినట్లు అని ప్రశ్నించారు. కాళ్లు చేతులు లేని పేదవారి డబ్బులు తీసి భూములు ఉన్నవారికి ఇస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు ఎకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా ఇస్తే సమర్థిస్తామని, 10 ఎకరాల నుంచి వందల ఎకరాలు భూములున్న భూస్వాములకు వేల కోట్లు రైతు భరోసాను ఇస్తుందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం గడీలో నుంచి వచ్చిందని, పేదరికంతో రాలేదని, రేవంత్‌రెడ్డి గుడిసెలో నుంచి రాలేదు బంగ్లాలో నుంచి వచ్చినోడేనన్నారు. వికలాంగులు, వృద్ధులు, వితంతులకు పెన్షన్ ఇవ్వాల్సిందేనని, చేతకాకుంటే రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. పెన్షన్ పెంచి ఇస్తావా రాజీనామా చేస్తావా తేల్చుకోవడం కోసమే ఆగస్టు 13న చలో హైదరాబాద్ మహాగర్జన నిర్వహిస్తున్నామన్నారు. పేదవారి ఆకలి బాధ తెలిసినవాడిగా వికాలాంగులు, వృద్ధులు, వితంతుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని అన్నారు. భూములు ఉన్నవారికి ప్రభుత్వం రుణమాపీలు చేస్తుంది, రైతు భరోసా ఇస్తుంది కాని కాళ్లు చేతులు లేని వికలాంగులకు పెన్సన్ పెంచి ఇవ్వడానికి మనస్సు రావడం లేదని లేనివాడిని కొట్టి ఈ ప్రభుత్వం ఉన్నవాడికి పెడుతుందని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్ పెన్షన్ పెంచాలంటూ ప్రశ్నించడంలేదని ఆరోపించారు. తాడోపేడో తేల్లుకోవడం కోసం పోరాటం తప్ప వేరే మార్గం లేదని ఛలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చామన్నారు. వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ, నేత, గీత కార్మికులు భారీగా తరలిరావాలన్నారు. ఈ సమావేశంలో వీహెచ్‌పీఎస్ జాతీయ అధ్యక్షుడు గోపాల్, జాతీయ నాయకులు రాంబాబు, నాగేశ్వర్, జిల్లా కన్వీనర్ శోభారాణి, కోకన్వీనర్లు రవీందర్, సురేష్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.