Share News

peddaplly : ఆరోగ్య కేంద్రాలకు సుస్తి...

ABN , Publish Date - Nov 17 , 2025 | 12:49 AM

కళ్యాణ్‌నగర్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలకు సుస్తి చేసింది. ఆరోగ్య కేంద్రాల్లో దగ్గు, జలుబు ఇతర రోగాల మందులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

peddaplly :  ఆరోగ్య కేంద్రాలకు సుస్తి...

మందుల కొరత... సిబ్బంది లేక ఇబ్బందులు...

సకాలంలో అందని రక్తపరీక్షల నమూనాలు...

నలుగురు పని చేసే చోట ఇద్దరు

ఇబ్బందులు పడుతున్న రోగులు

కళ్యాణ్‌నగర్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలకు సుస్తి చేసింది. ఆరోగ్య కేంద్రాల్లో దగ్గు, జలుబు ఇతర రోగాల మందులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం పట్టణ, అర్బన్‌ ఆరోగ్యం కేంద్రాల్లో సిబ్బంది కొరత, మందుల కొరత నెలకొంది. జిల్లాలో మంథని, సుల్తానాబాద్‌లో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 7 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, 4 పల్లె దవాఖానాలు ఉన్నాయి. ఇందులో సిబ్బంది కొరతతో సక్రమంగా వైద్య సేవలు అందడం లేదు. కాల్వ శ్రీరాంపూర్‌, ఓదెల, ధర్మారం, జూలపల్లి, ఎలిగేడు, బసంత్‌నగర్‌, రామగిరి, కమాన్‌పూర్‌, ముత్తారం, పాలకుర్తి, అంతర్గాం, పెద్దపల్లి, సుల్తానాబాద్‌లలో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. రామగుండం అర్బన్‌ పరిధిలో లక్ష్మీపురం, రామగుండం, అల్లూరు, ఫైవింక్లయిన్‌, అడ్డగుంటపల్లి, జనగామలో అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు ఉన్నాయి. నాలుగు బస్తీ దవాఖానాలు ఖాజిపల్లి, పీకే రామయ్యకాలనీ, చందపల్లి, పెద్దపల్లిలో ఉన్నాయి. ఇందులో అరకొర సౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సూది మందులు కరువు...

ఈ ఆరోగ్య కేంద్రాల్లో కొంత కాలంగా మందుల కొరత ఏర్పడడం, సకాలంలో సరఫరా జరుగకపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం జ్వరం మందులు తప్ప దగ్గు, జలుబుకు సంబంధించి టానిక్‌లు లేక పోవడం, గాయాలు మానడానికి ఆయింట్‌మెంట్‌లు లేక పోవడం, యాంటీ బయోటిక్‌ ఇంజెక్షన్లు లేక పోవడంతో రోగులు బయట కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం నుంచి ప్రతీ నెల మందులు సరఫరా కావాల్సి ఉండగా అవి సప్లయి కావడం లేదు. మలేరియా, టైఫాయిడ్‌, గర్భ నిర్ధారణకు సంబంధించిన కిట్లు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. సుల్తానాబాద్‌లో ఉన్న సెంట్రల్‌ గోడౌన్‌ నుంచి మందులు సకాలంలో సరఫరా జరుగకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు.

సిబ్బంది కొరతతో సకాలంలో రాని రక్త పరీక్షల నమూనాలు

జిల్లాలో ఉన్న ఆరోగ్య కేంద్రాల నుంచి వివిధ రోగాలతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చే వారి రక్తనమూనాలు సేకరించి పెద్దపల్లిలోని టీ హబ్‌కు పంపుతున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు సకాలంలో రోగులకు అందక వైద్యం ఆలస్యమవుతుంది. జిల్లాలో ల్యాబ్‌ టెక్నిషియన్ల కొరత ఉండడం, కొన్ని సెంటర్లలో రక్తనమూనాలు సేకరించడానికి ల్యాబ్‌ టెక్నిషియన్లు లేకపోవడం, ఉన్న వారిని డిప్యూటేషన్‌ మీద ఇతర ప్రాంతాలకు పంపుతున్నారు. థైరాయిడ్‌, బీ12, లివర్‌ ప్రొఫైల్‌ ఇతర ముఖ్యమైన డయోగ్నోస్టిక్‌ పరీక్షలు కూడా ఆలస్యంగా జరుగుతున్నాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో గర్భిణీలకు సకాలంలో రక్త పరీక్షల నమూనాలు రాక ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అంతేకాకుండా ఆసుపత్రిలో నలుగురు పని చేయాల్సిన చోట ఇద్దరే పని చేస్తున్నారు. ప్రతీ ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు స్టాఫ్‌నర్సులు, నర్సింగ్‌ సిబ్బంది, ల్యాబ్‌ టెక్నిషియన్లు ఉండాల్సి ఉండగా ఒక్కొక్క కేంద్రంలో ఒక్క స్టాఫ్‌ నర్సు మాత్రమే ఉంటున్నారు. దీంతో వైద్య సేవలు అందడం లేదు. సిబ్బంది కొరత తీర్చాలని ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నప్పటికీ పోస్టులను మాత్రం భర్తీ చేయడం లేదు.

స్టేషనరీ కొరత...

ఆసుపత్రికి వచ్చే రోగులకు మందులు, ల్యాబ్‌ రిపోర్టు ఇవ్వడానికి కూడా స్టేషనరీ కొరత ఏర్పడుతుంది. మందులు రాయడానికి, రక్త పరీక్షల నమూనాలకు, ఇతర అవసరాల కోసం స్టేషనరీని కూడా ప్రభుత్వం అందించలేని దుస్థితిలో ఉంది.

సిబ్బందికి వేతనాలు లేక ఇబ్బందులు...

పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు బస్తీ దవాఖానాల్లో పని చేసే కాంట్రాక్టు సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. తమకు వేతనాలు చెల్లించాలంటూ పలు మార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని వైద్య సిబ్బంది ఆరోపిస్తున్నారు. సోమవారం ధర్నా కార్యక్రమాన్ని చేపడుతామని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు.

Updated Date - Nov 17 , 2025 | 12:49 AM