peddaplli : మానేరు, గోదావరిలో ఇసుక లభ్యతపై సర్వే..
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:44 AM
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) జిల్లాలో గల మానేరు, గోదావరి నదుల్లో ఇసుక లభ్యతపై సర్వే నిర్వహించి క్వారీలను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది.
- క్వారీలను లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధం
- పర్యావరణ అనుమతులతో క్వారీలు లీజుకు
- ఈ నెల 15వ తేదీ కల్లా పూర్తి కానున్న సర్వే
- అక్టోబర్ 1వ తేదీన ప్రభుత్వానికి తుది నివేదిక
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో గల మానేరు, గోదావరి నదుల్లో ఇసుక లభ్యతపై సర్వే నిర్వహించి క్వారీలను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో తప్పులు జరిగినట్లుగా గాకుండా పక్కాగా పర్యావరణ అనుమతులు సాధించే విధంగా ఇసుక క్వారీలను గుర్తించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు కలెక్టర్ గనులు, భూగర్భ, నీటి పారుదల, సర్వే అండ్ ల్యాండ్స్, భూగర్భ జల, అటవీ, తదితర శాఖల అధికారులు కలిసి జాయింట్ సర్వే చేయాలని ఆదేశించారు. ఈనెల 15వ తేదీ వరకు సర్వే నివేది కలను అందజేయాలని, తుది నివేదికను అక్టోబర్ 1వ తేదీన రూపొందించి ప్రభుత్వానికి పంపించనున్నారు. జిల్లాకు ఓ వైపు.. గోదావరి, మరోవైపు.. మానేరు నదులు ఉన్నాయి. ఈ నదుల్లో ఇసుక లభ్యత బాగానే ఉంది. గతంలో మానేరు నదిపై సుల్తానాబాద్, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, ముత్తారం, మంథని మండలాల పరిధిలో 21 ఇసుక క్వారీలను గుర్తించారు. కోటి 52 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను తోడాలని నిర్ణయించి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించారు. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత రావడం, మానేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కోర్టులో కేసు వేశారు. పర్యావరణ అనుమతులు లేకుం డానే ఇసుక క్వారీలను నిర్వహిస్తున్నారని, ఇసుకను తోడడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోవడమే గాకుండా, వాహనాల రాకపోకల వల్ల రోడ్లు దెబ్బతిన డం, దుమ్ము ధూళీతో ప్రజలు అనారోగ్యం బారిన పడు తున్నారని, ఇసుక క్వారీల నుంచి ఇసుకను తోడడాన్ని నిలిపి వేయాలని కోర్టును కోరారు. క్వారీలు నిలిపివేసే నాటికి సుమారు 70 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించారు. కోర్టు ఆదేశాలతో కొద్ది రోజులు తాత్కా లికంగా క్వారీలను నిలిపివేశారు. మొత్తానికే క్వారీలను మూసి వేయాలని కోర్టు తీర్పును వెలువరించింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తీసుక వచ్చింది. మానేరుకు అవతలి పక్కన గల కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో గల ఇసుక క్వారీలు నడుస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా వైపునకు గల క్వారీలు నడవనీయకుండా పెద్దపల్లి ఎమ్మెల్యే చింత కుంట విజయరమణారావు అడ్డుపడ్డారు. మానేరు ఇసుక క్వారీల కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్ల కాల పరిమితి కూడా పూర్తయ్యింది. హైదరాబాద్‌లో ఇసుక డిమాండ్ బాగా ఉంది. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల వైపు ఉన్న ఇసుక క్వారీల వద్ద మూడు, నాలుగు కిలోమీటర్ల దూరం వరకు ఇసుక లారీలు నిలిచిపోతున్నాయి. రెండు, మూడు రోజులైన లోడింగ్ కాని పరిస్థితి ఉంది. హైదారాబాద్‌లో మానేరు ఇసుకకు డిమాండ్ బాగానే ఉంది. అలాగే అప్పటికే జిల్లాలో నడుస్తున్న స్యాండ్ ట్యాక్సీ పాలసీకి కూడా మంగళం పాడారు. మానేరు, గోదావరి నదుల నుంచి జిల్లా అవసరాలకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉచితంగా ఇసుక తీసుక వెళ్లేందుకు ట్రాక్టర్ల యజమానులకు అనుమతించారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డులకు ఇసుకను తరలించుకుని, అక్కడి నుంచి హైదరాబాద్‌కు లారీల ద్వారా గుట్టుచప్పుడుగా తర లించి సొమ్ము చేసుకుంటున్నారు. గత ఏడాది కాలంగా జిల్లాలో ఉన్న మానేరు, గోదావరి నదుల నుంచి ఇసుక ఉచితంగానే తరలుతున్నది. తద్వారా ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఆదాయం రావడం లేదు. తాజాగా జిల్లాలో గల రెండు నదులపై ఇసుక లభ్యతపై సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పక్కాగా పర్యావ రణ అనుతులు లభించిన క్వారీలనే లీజుకు ఇచ్చేందుకు గుర్తించాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశిం చింది. ఎవరు కూడా కోర్టులను ఆశ్రయించే పరిస్థితి తలెత్తకుండా క్వారీలను గుర్తించాలన్నారు. గుర్తించిన ఇసుక క్వారీలను టీజీఎస్‌ఎండీసీ ద్వారానే నిర్వహించా లని ప్రభుత్వం భావిస్తున్నది.