Share News

peddaplli : మనుగడలో లేని ఆహార సంఘాలు..

ABN , Publish Date - Nov 01 , 2025 | 12:31 AM

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌ షాపులు, అంగన్‌ వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసే బియ్యం, ఇతర సరుకుల సరఫరా, నాణ్యతపై పర్య వేక్షించేందుకు ఆహార సలహా సంఘాలు కనబడకుండా పోతున్నాయి.

peddaplli :  మనుగడలో లేని ఆహార సంఘాలు..

- కనిపించని ఆహార సలహా కమిటీలు

- సమావేశాల నిర్వహణ పట్టని అధికారులు

- బియ్యం, ఇతర సరుకులపై పర్యవేక్షణ కరువు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌ షాపులు, అంగన్‌ వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసే బియ్యం, ఇతర సరుకుల సరఫరా, నాణ్యతపై పర్య వేక్షించేందుకు ఆహార సలహా సంఘాలు కనబడకుండా పోతున్నాయి. అసలు ఆ సంఘాలు మనుగడలో ఉన్నా యా లేదా అనే విషయమై అనుమానాలు నెలకొ న్నాయి. సంబంధిత శాఖాధికారులు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించకపోవడంతో పర్యవేక్షణ కొరవ డింది. జిల్లాలో 413 రేషన్‌ షాపులు ఉండగా, వీటి పరిఽఽధిలో 2,35,721 రేషన్‌ కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 7,79,534 మంది ప్రయోజనం పొందుతున్నారు. ఈ కార్డులపై ప్రభుత్వం ప్రతీ నెలా 4,507 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేస్తున్నది. ఈ బియ్యాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేస్తున్నాయి. కేంద్రం దేశ మంతటా రేషన్‌ కార్డులపై దొడ్డు బియ్యం సరఫరా చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నది. అలాగే 706 అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం, పప్పులు, కోడిగుడ్లు, ఇతరత్రా సరుకులు సరఫరా అవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు సన్న బియ్యంతో భోజనాలు పెడుతున్నారు. వాటికి కూడా ప్రతి నెలా సన్న బియ్యం సరఫరా అవుతున్నాయి. సరుకుల సరఫరాను పరిశీలించేందుకుగాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మండల, డివిజన్‌, జిల్లా స్థాయిలో ఆహార సలహా సంఘాలను ఏర్పాటు చేశారు. ఆహార సలహా సంఘాలకు జిల్లాస్థాయిలో కలెక్టర్‌, డివి జన్‌ స్థాయిలో ఆర్డీవో, మండల స్థాయిలో తహసీల్దారు చైర్మన్లుగా ఉంటారు. ఆయా కమిటీల్లో ప్రజాప్రతినిధులు, మహిళా, స్వచ్ఛంద సంస్థల ప్రతి నిధులు, పాత్రికేయులు, ఇతర శాఖ అధికారులు సభ్యు లుగా ఉంటారు. ప్రతి రెండేళ్లకోసారి ఈ సంఘాలు మారుతూ ఉంటాయి. ఆయా స్థాయిలోని ఈ సంఘాల సభ్యులు ప్రతీ మూడు నెలలకు ఒకసారి సమావేశమై రేషన్‌ బియ్యం నాణ్యత, పంపిణీ తీరు, మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న పౌష్టికాహారం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించాలి. లోపాలు ఉంటే సరిదిద్దేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలి. వాటిపై ప్రభుత్వానికి నివేదించాలి. జిల్లాలో మాత్రం ఆహార సలహా సంఘాల జాడే లేకుండా పోతోంది. పర్యవేక్షణ కరవై పంపిణీ, నాణ్యత ప్రశ్నార్థక మవుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఫ పర్యవేక్షణ లేక పక్కదారి..

రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యంలో ఎక్కువగా నూకలు వస్తుండడంతో ఆయా వర్గాల ప్రజలు వాటిని రేషన్‌ డీలర్లకు గానీ, దళా రులకు గానీ కిలోకు 18 నుంచి 20 రూపాయల చొప్పున విక్రయించుకుంటున్నారు. సర్కార్‌ పంపిణీ చేసే సన్న బియ్యంలో 20 శాతానికి పైగా నూకలు నిబంధనల ప్రకారమే వస్తాయని వినియోగదారులకు చెప్పే వాళ్లు లేక కొంత మంది ఆ బియ్యాన్ని డీలర్లకు గానీ, బయట గానీ విక్రయించుకుంటున్నారు. ఆహార సలహా సంఘాలు షాపులకు వెళ్లి తెలుసుకుంటే ఇలాం టివి బయట పడతాయి. అలాగే అంగన్‌వాడీ కేంద్రా లకు అందజేసే పాలు, కోడిగుడ్లు, బియ్యం, పప్పు, కూర గాయలు సరిగా ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎంఎల్‌ఎస్‌ కేంద్రాల నుంచే తమకు నాణ్యమైన బియ్యం రావడం లేదని, తక్కువగా వస్తున్నాయని డీలర్లు చెబుతున్నారు. జిల్లాలో ఆహార పదార్థాలు నాసిరకంగా ఉన్నా ప్రశ్నించే వారు కరవవుతున్నారని ప్రజలు వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి ఆహార సలహా సంఘాల సమావేశాన్ని క్రమం తప్పకుండా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Nov 01 , 2025 | 12:31 AM