Share News

peddapally : రైతు బీమా కొనసాగేనా!

ABN , Publish Date - Aug 09 , 2025 | 12:56 AM

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తీసుకవచ్చిన రైతు బీమా పథకాన్ని కొనసాగిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం తిరిగి రెన్యువల్‌ చేయడం, కొత్త రైతులకు అవకాశం కల్పించే విషయమై ఇప్పటి వరకు ఊసెత్తక పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

peddapally :  రైతు బీమా కొనసాగేనా!

- ఈ నెల 14వ తేదీతో ముగియనున్న గడువు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తీసుకవచ్చిన రైతు బీమా పథకాన్ని కొనసాగిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం తిరిగి రెన్యువల్‌ చేయడం, కొత్త రైతులకు అవకాశం కల్పించే విషయమై ఇప్పటి వరకు ఊసెత్తక పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకాన్ని కొనసాగిస్తారా, లేదా అనే అనుమానాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని తీసుక వచ్చింది. పట్టాలు కలిగిన రైతులందరికీ ఎకరానికి 4 వేల చొప్పున, ఆ తర్వాత 5 వేల రూపాయల చొప్పున ఇచ్చింది. అదే సమయంలో రైతుల కోసం రైతు బీమా పథకాన్ని తీసుక వచ్చింది. రైతులు ప్రమాదవశాత్తు మృతి చెందినా, అనారోగ్య కారణాల వల్ల గానీ, ఇతరత్రా కారణాల వల్ల బలవన్మరణాలకు పాల్పడినా రైతుల కుటుంబాలు బజారున పడకుండా ఉండేందుకు రైతు బీమా పథకాన్ని తీసుక వచ్చింది. రైతులు మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా పథకాన్ని రూపొందించారు. భారతీయ బీమా సంస్థ (ఎల్‌ఐసీ)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ పథకం కింద ప్రభుత్వమే నేరుగా వందకు వందశాతం ప్రీమియం డబ్బులను ఎల్‌ఐసీ సంస్థకు నేరుగా చెల్లిస్తున్నది. ప్రతి ఏటా ఆగస్టు 15వ తేదీ నుంచి ఆ తర్వాత ఏడాది ఆగస్టు 14వ తేదీ వరకు అమల్లో ఉంటున్నది. ధరణి పోర్టల్‌ ఆధారంగా బీమా పథకాన్ని రైతుల పేరిట రెన్యూవల్‌ చేశారు. ఆ మధ్య కాలంలో కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని కొనసాగిస్తూ వస్తున్నది. అలాగే రైతుబంధుకు బదులు రైతు భరోసా పథకాన్ని తీసుక వచ్చి ఎకరానికి 6 వేల రూపాయల చొప్పున పట్టాదారులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారు.

ప్రతి ఏటా రైతు బీమా పథకంలో కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులకు, పాత రైతుల రెన్యూవల్‌ ప్రక్రియను అంతా ఆగస్టు 5వ తేదీ నాటికి పూర్తి చేస్తారు. కొత్తగా పథకంలో చేరే రైతులు జూన్‌ 30వ తేదీ వరకు పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతుల నుంచి జూలై 15వ తేదీ నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. వారి డేటా మొత్తం మండల వ్యవసాయ శాఖాధికారులకు చేరుతుంది. సదరు రైతుల నుంచి అధికారులు, ఏఈఓలు దరఖాస్తులు తీసుకుని నామిని పేరు, తదితర వివరాలన్నింటినీ రాసి ప్రభుత్వానికి పంపిస్తారు.

2024-25 సంవత్సరానికి పెద్దపల్లి జిల్లాకు చెందిన 1,05,092 మంది రైతులకు రైతు బీమా పథకాన్ని వర్తించే విధంగా ఒక్కో రైతు పేరిట 3,830 రూపాయల చొప్పున 40 కోట్ల 25 లక్షల 2 వేల 360 రూపాయల చొప్పున ప్రభుత్వం ఎల్‌ఐసీ సంస్థకు ప్రీమియం చెల్లించింది. ఈ పథకం ఆరంభమైన నాటి నుంచి జిల్లాలో 376 మంది రైతులు వివిధ కారణాల వల్ల మరణించగా, అన్ని డాక్యుమెంట్లు అందించిన 363 మంది రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. 345 మంది రైతు కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున 17 కోట్ల 25 లక్షల రూపాయలు ఎల్‌ఐసీ సంస్థ చెల్లించింది. ఇంకా కొంత మంది రైతులకు చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ప్రీమియం చెల్లించే విషయమై ఊసెత్తడం లేదు. ఈ ఏడాది కాలంలో పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన దాదాపు 5 వేల మంది రైతులు కొత్తగా పథకంలో చేరడానికి దరఖాస్తు చేసుకునేందుకు ఎదురు చూస్తున్నారు. ఈ విషయమై వ్యవసాయ శాఖాధికారులతో మాట్లాడితే, ప్రభుత్వం నుంచి రైతు బీమా కోసం కొత్తగా దరఖాస్తులు తీసుకోవాలని ఎలాంటి ఆదేశాలు రాలేదని, రెన్యూవల్‌కు ఇంకా ఐదు రోజులు గడువు ఉందని చెబుతున్నారు. అప్పటి వరకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.

Updated Date - Aug 09 , 2025 | 12:56 AM