Share News

peddapally : ముమ్మరంగా రోడ్ల విస్తరణ

ABN , Publish Date - Jun 02 , 2025 | 01:05 AM

కోల్‌సిటీ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): రామగుండంలో వ్యాపార అభివృద్ధి, పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా సౌకర్యాల కల్పనకు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్ల విస్తరణ చేపట్టారు. ఈ కార్యక్రమం గోదావరిఖని, ఎన్టీపీసీ ప్రాంతాల్లో ముమ్మరంగా సాగుతున్నాయి.

peddapally :   ముమ్మరంగా రోడ్ల విస్తరణ

- రామగుండంలో మొదలైన పనులు

- బస్టాండ్‌ వద్ద సర్వీస్‌ రోడ్డు నిర్మాణానికి మోక్షం

- లక్ష్మీనగర్‌లో పూర్తి కావస్తున్న విస్తరణ

- ఎన్టీపీసీలో మేడిపల్లి సెంటర్‌, మల్కాపూర్‌ రహదారుల విస్తరణ

- విస్తరణ జరిగిన ప్రాంతాల్లో రోడ్లు, కూడళ్ల నిర్మాణాలు

కోల్‌సిటీ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): రామగుండంలో వ్యాపార అభివృద్ధి, పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా సౌకర్యాల కల్పనకు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్ల విస్తరణ చేపట్టారు. ఈ కార్యక్రమం గోదావరిఖని, ఎన్టీపీసీ ప్రాంతాల్లో ముమ్మరంగా సాగుతున్నాయి. నగరంలోని వ్యాపార కేంద్రాలైన లక్ష్మీనగర్‌, కళ్యాణ్‌నగర్‌, మేదరిబస్తీ, అడ్డగుంటపల్లి రహదారుల్లో రోడ్ల విస్తరణ చేపట్టారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తా కేంద్రంగా ఈ విస్తరణ కార్యక్రమం మొదలైంది. లక్ష్మీనగర్‌, కళ్యాణ్‌నగర్‌, ఉల్లిగడ్డల బజార్‌ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణతో పాటు భవిష్యత్‌ 50ఏళ్ల అవసరాలకు అనుగుణంగా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఇరువైపులా వీధిదీపాలు, అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ వ్యవస్థ ఏర్పాటుకు 35కోట్ల రూపాయలు కేటాయించారు. ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ టీయూఎఫ్‌ఐడీసీ నిధులు 100కోట్ల రూపాయలు మంజూరు చేయించగా 35కోట్ల రూపాయలను వ్యాపార కేంద్రాల్లో వెచ్చిస్తున్నారు. గోదావరిఖని పట్టణంలోని వ్యాపార కేంద్రాలు, ప్రధాన కూడళ్లలో రోడ్ల విస్తరణ చేస్తున్నారు. గోదావరిఖని బస్టాండ్‌ వద్ద రాజీవ్‌ రహదారి సర్వీస్‌ రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించారు. బస్టాండ్‌ ముందున్న కాంగ్రెస్‌ నాయకుడు గాజుల రాజమల్లు భవనాన్ని సైతం తొలగించారు. నిర్వాసితులైన వారికి ప్రత్యామ్నాయ స్థలాలను చూపారు. సర్వీస్‌ రోడ్డు పనులను సైతం ప్రారంభించారు.

- ఇరుకు రోడ్లు.. ఆక్రమణలు..

మార్కండేయకాలనీ-అడ్డగుంటపల్లి 60 అడుగుల ప్రధాన రహదారిపై ఉన్న భవనాన్ని నగరపాలక సంస్థ తొలగించింది. భవనం శిథిలావస్థకు చేరడం, రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న భవనాన్ని తొలగించారు. భవనం తొలగిస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా కుప్పకూలి శిథిలాలు ఎక్స్‌కావేటర్‌పై పడ్డాయి. మార్కండేయకాలనీ ప్రాంతం వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందడం, మార్కండేయకాలనీ నుంచి ఎఫ్‌సీఐ రోడ్డు వరకు క్వార్టర్లు, షాపింగ్‌ మాల్స్‌ రావడంతో ఈ రహదారి రద్దీగా ఉంది. 60 అడుగులకు ఆర్‌డీపీ ఆమోదం ఉన్నా స్థానికుల విజ్ఞప్తి మేరకు గతంలో 50 అడుగులుగానే విస్తరించారు. 50 అడుగుల రహదారిలోనూ అనేక ఆక్రమణలు ఉన్నాయి. అలాగే గోదావరిఖని కళ్యాణ్‌నగర్‌ కూడలిని కూడా విస్తరిస్తున్నారు. నగరానికి సరుకులను తీసుకువచ్చే వాహనాలు ఈ కూడలి గుండానే రావాల్సి ఉంది. ఉల్లిగడ్డల బజార్‌, కళ్యాణ్‌నగర్‌ హోల్‌సేల్‌ బజార్‌, హార్డ్‌వేర్‌ బజార్లు కూడా ఈ ప్రాంతంలోనే ఉండడంతో భారీ వాహనాలు వస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో కళ్యాణ్‌నగర్‌ జంక్షన్‌లోని మూడు వైపులా భవనాలను తొలగిస్తున్నారు. అలాగే ఉల్లిగడ్డల బజార్‌కు 40 అడుగుల మార్కింగ్‌ ఇస్తున్నారు. పాపులర్‌ షూమార్ట్‌ -అజయ్‌ మెడికల్‌ స్టోర్‌ రహదారి విస్తరణ పూర్తయ్యింది. క్యాస శ్రీనివాస్‌ ఆసుపత్రి నుంచి గణేష్‌నగర్‌ బోర్డు వరకు కూడా విస్తరణ జరిగింది. గోదావరిఖని మున్సిపల్‌ కూరగాయాల మార్కెట్‌ను రెండు కోట్ల రూపాయలతో ఆధునికీకరిస్తున్నారు. హోల్‌సేల్‌ మార్కెట్‌కు కూరగాయలు తీసుకువచ్చే వాహనాలకు రోడ్డు ఇరుకుగా ఉండి ఇబ్బందులు ఏర్పడుతుండడంతో ఆ రహదారి సైతం విస్తరిస్తున్నారు.

- ఒత్తిళ్లు, అడ్డంకులను అధిగమిస్తూ..

ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్‌ నుంచి మేడిపల్లి గ్రామం వరకు మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం 100 అడుగులుగా రోడ్డుగా ఉంది. దానిని ఆ మేరకు విస్తరిస్తున్నారు. గతంలో సింగరేణి సంస్థ ఓసీపీ-4 నుంచి బొగ్గు రవాణా కోసం 100అడుగుల రహదారి నిర్మాణానికి భూ సేకరణ జరిపింది. తరువాత మున్సిపల్‌ రహదారి నిర్మాణానికి అప్పగించారు. కాగా ఈ రహదారిలో ఆక్రమణలు జరిగాయి. ఈ ప్రాంతంలో కాలనీలు పెరగడం, జనసాంద్రత ఎక్కువగా ఉండడంతో ఈ రహదారిని విస్తరిస్తున్నారు. 80అడుగులకు మార్కింగ్‌ చేసి విస్తరణ పనులు మొదలు పెట్టారు. అలాగే ఎన్టీపీసీ రాజీవ్‌ రహదారి నుంచి మల్కాపూర్‌ రహదారిని సైతం విస్తరిస్తున్నారు. ఈ రహదారిలో నిర్మాణానికి కార్పొరేషన్‌ రెండు కోట్ల రూపాయలు కేటాయించి టెండర్లు కూడా ఖరారు చేసింది. ఇటీవల కృష్ణనగర్‌ రహదారి నిర్మాణానికి కూడా మరో రెండు కోట్ల రూపాయలు కేటాయించారు. మేడిపల్లి రహదారి విస్తరణ తరువాత కొత్తగా రహదారి నిర్మాణం జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ రహదారుల విస్తరణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నా రు. కలెక్టర్‌ ప్రత్యేకాధికారిగా ఉండడం, అదనపు కలెక్టర్‌ కమిషనర్‌గా ఉండడంతో రహదారుల విస్తరణల్లో ఒత్తిళ్లను, అడ్డంకులను అధిగమిస్తు న్నారు. కొన్నికొన్ని సందర్భాల్లో దూకుడుగానూ వ్యవహరిస్తున్నారు.

- జంక్షన్ల అభివృద్ధికి ప్రణాళికలు

రామగుండం నగరపాలకసంస్థ పరిధిలో వివిధ కూడళ్లలో జంక్షన్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఈ పనులకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. మున్సిపల్‌ జంక్షన్‌, మెయిన్‌ చౌరస్తా, మేడిపల్లి సెంటర్‌, ఎఫ్‌సీఐ క్రాస్‌ రోడ్డు, గౌతమినగర్‌ జంక్షన్‌ను అభివృద్ధి చేయనున్నారు. రాజీవ్‌ రహదారి సర్వీస్‌ రోడ్ల నిర్మాణం చేపట్టడమే కాకుండా ఎన్టీపీసీ, సింగరేణి స్థలాలు ఉన్న ప్రాంతాల్లో విస్తరించనున్నారు. జీఎం ఆఫీస్‌, బంగ్లాస్‌ ఏరియా, బీ పవర్‌హౌస్‌ ప్రాంతాల్లో ఈ విస్తరణ జరుగనున్నది.

Updated Date - Jun 02 , 2025 | 01:09 AM