Share News

peddapally : ప్రాజెక్టులు వెల వెల

ABN , Publish Date - Jul 10 , 2025 | 12:24 AM

(ఆంధ్రజ్యోతి పెద్దపల్లి) వర్షాకాలం సీజన్‌ ఆరంభమై నెల పది రోజులు గడుస్తున్నా ఆశించిన మేరకు వర్షాలు పడకపోవడంతో ప్రాజెక్టులు నీరు లేక వెలవెల పోతున్నాయి.

peddapally :  ప్రాజెక్టులు వెల వెల

వర్షాలు లేక నిండని జలాశయాలు

ముందుకు సాగని వ్యవసాయ పనులు

వర్షాల పై ఆందోళన చెందుతున్న రైతులు

(ఆంధ్రజ్యోతి పెద్దపల్లి)

వర్షాకాలం సీజన్‌ ఆరంభమై నెల పది రోజులు గడుస్తున్నా ఆశించిన మేరకు వర్షాలు పడకపోవడంతో ప్రాజెక్టులు నీరు లేక వెలవెల పోతున్నాయి. గత ఏడాది ఇదే సమయానికి భారీ వర్షాలు కురవగా ఈ ఏడాది ఆలస్యం అవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ బావుల కింద మాత్రమే వరినాట్లు వేస్తున్నారు. సీజన్‌ ఆరంభంలో అడపాదడపా కురిసిన వర్షాలతో ఆరుతడి పంటలను సాగు చేశారు. కానీ సరైన వర్షాలు లేక ఆ పంటలు ఎదగడం లేదు. జిల్లాలో ఈ సీజన్లో 2 లక్షల 80 వేల ఎకరాలకు పైగా వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలను రైతులు సాగు చేయనున్నారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటి వరకు సగం పంటలు కూడా సాగు కాలేదు. జిల్లాలో సాధారణ వర్షపాతం 216.8 మిల్లీమీటర్లకుగాను 130.1 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. ముత్తారం మండలంలో మినహా మిగతా 13 మండలాల్లో సాధారణ కంటే 40 శాతంకు పైగా లోటు వర్షపాతం నమోదైంది.

పెద్దపల్లి జిల్లాకు వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో సుమారు 1,80,000 ఎకరాలకు డీ 83, డి86 కాలువల ద్వారా సాగునీరు అందుతుంది. అయితే వర్షాలు లేక ఎస్సారెస్పీలోకి వరద నీరు రావటం లేదు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 19.22 టీఎంసీల నీళ్ళు మాత్రమే ఉన్నాయి. ప్రాజెక్టు నీటిమట్టం కనీసం 60 టీఎంసీలకు చేరితేనే ఆయ కట్టుకు సాగునీటిని విడుదల చేస్తారు. వ్యవసాయ శాఖ అధికారుల సూచనల ప్రకారం ఆగస్టు 15లోపే వరినాట్లు వేస్తే మంచి దిగుబడులు వస్తాయి. కానీ వర్షాలు రాక వరద నీరు చేరడం లేదు.

అలాగే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.76 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు లక్ష ఎకరాలకు పైగా సాగునీటిని అందించాల్సి ఉంది. అలాగే హైదరాబాద్‌ నగర ప్రజలకు, పెద్దపల్లి, రామగుండం, మంథని, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఎన్టీపీసీ అవసరాలకు కూడా ఈ ప్రాజెక్టు ద్యారానే నీటిని విడుదల చేస్తారు. వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టు నిండడం లేదు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని మధ్య మానేరు రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.90 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. లోయర్‌ మానేరు డ్యామ్‌ పూర్థి స్తాయి నీటిమట్టం 24.0 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.190 టీఎంసీల నీళ్ళు మాత్రమే ఉన్నాయి. భారీ వర్షాలు కురిస్తేనే ఈ ప్రాజెక్టులకు శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నంది మేడారంలోని నంది, గాయత్రి పంపు హౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోస్తారు. శ్రీపాద ఎల్లంపల్లిలోకి ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షం నీటితోపాటు కడెం, ఎస్సారెస్పీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టంకు చేరుకున్న తర్వాత విడుదల చేసే అదనపు నీరు రావాల్సి ఉంటుంది. శ్రీపాద ఎల్లంపల్లికి గత ఏడాది జూలై 20వ తేదీ నాటికి పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుకున్నది. కృష్ణా నది తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా ఆ నదిపై నిర్మించిన అన్ని ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతుండగా గోదావరి తీర ప్రాంతాల్లో వర్షాలు లేక ప్రాజెక్టులు వెలవెలబోతు న్నాయి. వర్షాలు కురువకపోతే ఈ వానాకాలం సీజన్‌కే కాకుండా యాసంగి సీజన్‌కు కూడా సాగునీటితోపాటు ఈ ప్రాంత ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రైతులంతా వరుణుడి పైనే ఆశలు పెట్టుకున్నారు.

Updated Date - Jul 10 , 2025 | 12:24 AM