peddapally : రేపటి నుంచి ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి నిలిపివేత
ABN , Publish Date - May 05 , 2025 | 12:21 AM
కోల్‌సిటీ, మే 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రైతాంగానికి అండగా ఉన్న ఆర్‌ఎఫ్‌సీఎల్ ఈ నెల 6వ తేది నుంచి ఉత్పత్తి నిలిపివేస్తోంది. వార్షిక మరమ్మతుల కార ణంగా ప్లాంట్‌ను షట్‌డౌన్ చేస్తున్నారు.
- జూన్ మొదటి వారంలో తిరిగి ఉత్పత్తి దశలోకి...
- హెచ్‌టీఆర్ మరమ్మతు, ఇతర మెయింటెనెన్స్ పనులు
- వర్షాకాల సీజన్‌లో యూరియాకు ఇబ్బందులు తప్పవా
కోల్‌సిటీ, మే 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రైతాంగానికి అండగా ఉన్న ఆర్‌ఎఫ్‌సీఎల్ ఈ నెల 6వ తేది నుంచి ఉత్పత్తి నిలిపివేస్తోంది. వార్షిక మరమ్మతుల కార ణంగా ప్లాంట్‌ను షట్‌డౌన్ చేస్తున్నారు. ఏప్రిల్‌లో షట్‌డౌన్ చేయాల్సి ఉండగా ఉత్పత్తి అవసరాల దృష్ట్యా మే వరకు పొడిగించారు. ప్లాంట్‌లో కీలకమైన హీట్ ట్రాన్స్‌ఫర్ రిఫార్మర్ (హెచ్‌టీఆర్)లో మరమ్మతు, అమ్మోనియా పైప్‌లైన్లు, ఇతర యంత్రాల మరమ్మ తులు చేయనున్నారు. హెచ్‌టీఆర్‌కు సంబంధించి గోద్రేజ్ సంస్థ మెయింటెనెన్స్ పనులు నిర్వహించ నుంది. సుమారు 30 నుంచి 40రోజుల పాటు ఈ మరమ్మతులు జరుగనున్నాయి. జూన్ 6 నుంచి 15వ తేదీలోగా ప్లాంట్‌లో తిరిగి ఉత్పత్తి దశలోకి వచ్చే అవకాశం ఉంది. 25రోజుల్లో షట్‌డౌన్ పూర్తి చేస్తామని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నా సాంకేతికంగా అది సాధ్యమయ్యే పరిస్థితులు లేనట్టుగా తెలుస్తోంది. వర్షాకాల సీజన్ ప్రారంభ సమయానికి కానీ ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది.
వర్షాకాలం ముందు టెన్షన్...
రాష్ట్రంలో ఈ ఏడాది వరి, మొక్క జొన్న విస్తీర్ణం పెరగడంతో యాసంగిలో ఎరువుల వాడకం భారీగా పెరిగింది. దీంతో ఆర్‌ఎఫ్‌సీఎల్‌పై యూరియా సర ఫరాకు ఒత్తిడి పెరిగింది. గతేడాది ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో 11.94లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి జరిగితే రాష్ట్రానికే 4.68లక్షల టన్నులు సరఫరా చేసింది. మిగతా యూరియాను ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సరఫరా చేశారు. సాధారణంగా తెలంగాణ ప్రభుత్వం వర్షాకాల సీజన్‌కు ముందే ఏప్రిల్ నుంచి వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గోడౌన్‌లలో యూరియా నిల్వలను భద్రపరుస్తుంది. బఫర్ స్టాక్‌గా ఈ నిల్వలు రైతుల అవసరాన్ని బట్టి మళ్లీ సరఫరా చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర యూరియా అవసరాల్లో ఆర్‌ఎఫ్‌సీఎల్‌నే ఎక్కువగా యూరియా సరఫరా చేస్తుంది. సంస్థ ఉత్పిత్తిలో 45శాతం తెలం గాణకే సరఫరా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశిం చిన కోటా ప్రకారం ఆర్‌ఎఫ్‌సీఎల్‌తో పాటు గుజరాత్ స్టేట్ ఫర్టిటైజర్స్, ఇఫ్కో, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్, కోరమండల్, క్రిభ్కో సంస్థలు యూరియా సరఫరా చేస్తాయి. ఇందులో గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్స్, ఇఫ్కో, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్‌కు సొంత యూనిట్లు ఉండగా కోరమండల్, క్రిభ్కోలు యూరి యాను దిగుమతి చేసుకుని రాష్ట్రాలకు సరఫరా చేస్తాయి.
ఆర్‌ఎఫ్‌సీఎల్‌తో రాష్ట్రంపై తగ్గిన ఒత్తిడి..
రాష్ట్రంలో నీటి లభ్యతను బట్టి సాగు విస్తీర్ణంలో హెచ్చుతగ్గులుంటాయి. దానిపై ఆధారపడి యూరియా వినియోగం ఉంటుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం సీజన్‌కు ముందు యూరియా దిగుమతి చేసుకుని బఫర్ స్టాక్‌గా నిల్వ ఉంచుకునేది. రామగుండంలో ఆర్‌ఎఫ్‌సీఎల్ నెలకొల్పిన తరువాత అత్యవసర సమ యాల్లో రాష్ట్రాన్ని ఆదుకుంటుంది. ఈ ఏడాది యాసం గిలో సాగు విస్తీర్ణం పెరగడంతో రాష్ట్రంలో అదనంగా 2.59లక్షల టన్నులు యూరియాను అదనంగా కొను గోలు చేశారు. డిపార్ట్‌మెంటల్ ఆఫ్ ఫర్టిలైజర్స్ సరైన సమయంలో యూరియాను అందివ్వలేదనే విమర్శలు కూడా వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఆర్‌ఎఫ్‌సీఎల్ రాష్ట్రా న్ని ఆదుకున్నది. యాసంగి సీజన్‌లో రికార్డు స్థాయిలో సరఫరా చేసింది.
షట్‌డౌన్‌తో టెన్షన్...
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో షట్‌డౌన్‌తో ఉత్పత్తి నిలిపి వేయ డంతో వ్యవసాయశాఖలో కొంత టెన్షన్ మొదలైంది. ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్రతీ నెల 1.35లక్షల టన్నుల ఉత్పత్తి చేస్తుంది. అందులో నుంచి 45శాతం తెలంగాణ అవస రాలకు యూరియాను ఇస్తారు. సాధారణంగా ఏప్రిల్‌లో షట్‌డౌన్ చేసుకున్నా మే మాసంలో ఉత్పత్తి జరుగుతుంది కనుక వర్షాకాల సీజన్‌కు యూరియా అందుతుంది. ఈసారి మేలో షట్‌డౌన్ చేశారు. వ్యవ సాయశాఖ వద్ద యూరియా నిల్వలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. సీజన్‌కు ముందు బఫర్ స్టాక్ పెట్టుకోవాల్సి ఉంది. ఆర్‌ఎఫ్‌సీఎల్ షట్‌డౌన్ కావడంతో ఇతర పరిశ్రమలు, విదేశాల నుంచి దిగుమతి అయ్యే యూరియాపై ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. మే నెల ప్రారంభం నుంచి 10వేల టన్నులు రాష్ట్రానికి సరఫరా చేశారు. రాష్ట్ర అవసరాలను బట్టి 20వేల నుంచి 35వేల టన్నులు ఆర్‌ఎఫ్‌సీఎల్‌కు టార్గెట్ పెట్టారు. జూన్‌లో ఉత్పత్తి ప్రారంభమైతే రాష్ట్రానికి యూరియాను యుద్ధ ప్రాతిపదికన సరఫరా చేయాల్సి ఉంటుంది. ఏమైన అవాంతరాలతో జాప్యం జరిగితే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిళ్లు తప్పవు.