Share News

peddapally : మద్యం షాపుల టెండర్లకు సన్నద్ధం

ABN , Publish Date - Aug 23 , 2025 | 01:11 AM

ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) మద్యం రిటైల్‌ షాపులకు లైసెన్సులు జారీ చేసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు మాసాల ముందే గెజిట్‌ విడుదల చేసింది.

peddapally :  మద్యం షాపుల టెండర్లకు సన్నద్ధం

- మూడు నెలల ముందే గెజిట్‌ విడుదల చేసిన ప్రభుత్వం

- దరఖాస్తు రుసుం రూ.3 లక్షలకు పెంపు

- జిల్లాలో 77 మద్యం రిటైల్‌ షాపులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మద్యం రిటైల్‌ షాపులకు లైసెన్సులు జారీ చేసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు మాసాల ముందే గెజిట్‌ విడుదల చేసింది. గతేడాది కంటే టెండర్‌ దరఖాస్తు ఫారం ధరను 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలకు పెంచింది. కానీ కొత్త మద్యం షాపులను పెంచలేదు. గతంలో ఉన్న రిటెయిల్‌ షాపులనే కొనసాగించేందుకు టెండర్లను ఆహ్వానించనున్నది. ఈ నెలాఖరులో, వచ్చే నెల మొదటి వారంలో టెండర్ల నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశాలున్నందున జిల్లా ఎక్సైజ్‌ శాఖాధికారులు సన్నద్ధం అవుతున్నారు.

జిల్లాలో రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ లు, మొత్తం 14 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 77 మద్యం రిటైల్‌ షాపులు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న షాపుల కాంట్రాక్టు గడువు ఈ ఏడాది నవంబర్‌ 30వ తేదీతో ముగియనున్నది. కొత్త మద్యం షాపులు డిసెంబర్‌ 1వ తేదీ నుంచి 2027 నవంబర్‌ 30వ తేదీ వరకు రెండేళ్లపాటు కొనసాగనున్నాయి. ఆలోపు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ముందస్తుగానే ఈ నెల 19వ తేదీన గెజిట్‌ విడుదల చేసింది. 2023లో కూడా అప్పటి ప్రభుత్వం ఆగస్టులో టెండర్లను పూర్తి చేసింది. సాధారణంగా మద్యం షాపుల లైసెన్స్‌ గడువు ముగిసే నెల రోజుల ముందు టెండర్లను ఆహ్వానిస్తారు. గత పర్యాయం నుంచి ముందస్తుగా టెండర్లను ఆహ్వా నిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలో జరగనున్నందున ప్రభుత్వం ముంద స్తుగా టెండర్లను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు కనబడుతున్నది. దీనికితోడు సంక్షేమ పథకాల అమలు కోసం నిధుల కొరత ఉన్నందున టెండర్ల ద్వారా కొంత ఆదాయాన్ని సమకూర్చుకోనున్నట్లు తెలుస్తున్నది.

ఫ పాత పాలసీ ప్రకారమే టెండర్లు..

గత ప్రభుత్వ హయాంలో తీసుకవచ్చిన పాలసీ ప్రకారమే జిల్లాలో మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించనున్నారు. గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం షాపులను కేటాయించాలని గెజిట్‌లో పేర్కొన్నారు. 2023లో జరిగిన టెండర్లలో జిల్లాలో 77 మద్యం షాపులకు గాను, గౌడ కులస్తులకు రిజర్వేషన్‌ ప్రకారం 13 షాపులు, ఎస్సీలకు రిజర్వేషన్‌ ప్రకారం 8 షాపులు, ఓపెన్‌ కేటగిరీలో 56 షాపులను కేటాయించారు. జిల్లాలో అంతగా ఎస్టీ జనాభా లేని కారణంగా ఆ వర్గాలకు ఇక్కడ షాపులు కేటాయించారు. రిజర్వేషన్లను అప్పుడు రాష్ట్రం యూని ట్‌గా తీసుకుని కేటాయించారు. ఈసారి అదే పద్ధతిలో రిజర్వేషన్లు కేటాయిస్తారా, జిల్లా యూనిట్‌గా చేపడ తారా అనే విషయం నోటిఫికేషన్‌ జారీ అయితే కానీ తెలియదని అధికారులు అంటున్నారు. గత ఏడాది 77 షాపులకు 2022 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి 40 కోట్ల 44 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ డబ్బులు తిరిగి వాపస్‌ ఇవ్వరు. ఇందులో అత్యధికంగా సుల్తానాబాద్‌ మండలం భూపతిపూర్‌లో గల గెజిట్‌ నంబర్‌ 33 షాపునకు 71 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి దరఖాస్తు రుసుంను 3 లక్షల రూపాయలకు పెంచడం వల్ల ప్రభుత్వానికి మరింత ఆదాయం సమ కూరనున్నది. లైసెన్స్‌ ఫీజుల శ్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు. 5 వేల వరకు జనాభా కలిగిన ప్రాం తాల షాపులకు 50 లక్షలు, 5001 నుంచి 50 వేల జనాభా వరకు 55 లక్షలు, 50001 నుంచి లక్ష జనాభా వరకు 60 లక్షలు, 100001 నుంచి 5 లక్షల జనాభా వరకు 65 లక్షలు, 5 నుంచి 20 లక్షల జనాభా వరకు 85 లక్షలు, 20 లక్షలకు పైగా జనాభా గల ప్రాంతాల్లోని షాపులకు కోటి 10 లక్షల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మద్యం షాపులను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నడపాల్సి ఉంటుంది. పండుగలు, ఎన్నికలు ఉన్నా, లేకున్నా మద్యం అమ్మకాలు రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దీంతో ఈసారి మద్యం షాపుల కోసం పోటీపడే వారి సంఖ్య గతంలో కంటే మరింత పెరగవచ్చని ఎక్సైజ్‌ అధికారులు భావిస్తున్నారు.

Updated Date - Aug 23 , 2025 | 01:11 AM