Share News

peddapally : పంచాయతీ ఎన్నికల పై పోలీసు నిఘా

ABN , Publish Date - Dec 08 , 2025 | 12:40 AM

మంథని, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

peddapally :  పంచాయతీ ఎన్నికల పై పోలీసు నిఘా

శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ పై ఫోకస్‌

గ్రామాల్లో పర్యటిస్తున్న సీపీ, డీసీపీ, ఏసీపీలు

సమస్యాత్మక గ్రామాల్లో ప్రజలతో ప్రత్యేక సమావేశాలు

మంథని, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రామగుండం పోలీసు కమిషనరేట్‌ అధికారులు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో సున్నితమైన అంశం కావడంతోపాటు రాజకీయాలకు అతీతంగా జరుగుతుండటంతో గొడవలకు తావు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలోని మంథని, పెద్దపల్లి, రామగుండం అసెంబ్లీ నియోజకవవర్గాల్లో అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు చెందిన బలమైన రాజకీయ ప్రత్యర్థులు ఉండటంతో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ కోసం వ్యూహత్మకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పంచాయతీ ఎన్నికలు జరిగే మండలాల్లోని సమ్యస్యాత్మక గ్రామాలు, పోలింగ్‌ కేంద్రాల పై ప్రధాన దృష్టి సారించారు. మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఈసీ నిబంధనలు అమలయ్యేలా, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా, రాజకీయ, వ్యక్తిగత ఘర్షణలకు తావులేకుండా, పోలింగ్‌ రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ఇప్పటి నుంచే పటిష్టమైన నిఘా పెట్టారు. శాంతియుతంగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయటానికి అన్ని విధాలుగా గ్రామాల పై పోలీసు అధికారులు స్పెషల్‌ ఫోకస్‌ చేశారు. కొద్ది రోజులుగా రామగుండం సీపీ అంబర్‌ కిషోర్‌ ఝూ, పెద్దపల్లి డీసీసీ భూక్య రాంరెడ్డి, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్‌లు స్థానిక సీఐలు, ఎస్‌ల తోపాటు కలిసి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. గ్రామ ప్రజలు ప్రత్యేకంగా సమావేశమై ఎన్నికల నిబంధనల నియమావళి అమలు, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు ఉపయోగించుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను ప్రత్యేకంగా పరిశీలించి కట్టుదిట్టమైన బందోబస్తు కోసం ఏర్పాట్లు చేసేలా సూచనలు చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారి పై, శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారి చట్టపరంగా తీసుకునే చర్యల గురించి వివరిస్తున్నారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా అందరూ సహకరించాలని కోరుతున్నారు. మరో వైపు కట్టుదిట్టమైన భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 11న జరిగే తొలి విడత ఎన్నికల్లో జిల్లాలోని మంథని డివిజన్‌లోని మంథని, ముత్తారం, కమాన్‌పూర్‌, రామగిరి, కాల్వశ్రీరాంపూర్‌ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో ధర్మారం, అంతర్గాం, పాలకుర్తి, జూలపల్లి, మూడో విడతలో సుల్తానాబాద్‌, ఎలిగేడు, పెద్దపల్లి, ఓదెల మండలాల్లో 263 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు నామినేషన్ల విత్‌డ్రాలో మంథని మండలంలో నాగారం, మైదుపల్లి, తోటగోపయ్యపల్లి, రామగిరి మండలంలో చందనాపూర్‌ గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోలీసు పహారాలో ప్రశాంతంగా పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Dec 08 , 2025 | 12:40 AM