Peddapally : లాభమెంత... వాటా ఎంత...?
ABN , Publish Date - Aug 25 , 2025 | 01:53 AM
గోదావరిఖని, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సర లాభాలు, అందులో కార్మికుల వాటా శాతం ప్రకటనకు సమయం ఆసన్నమైంది.
35శాతం డిమాండ్ చేస్తున్న కార్మిక సంఘాలు
సింగరేణిలో పేరుకుపోయిన వేల కోట్ల బకాయిలు...
పెరిగిన ప్రణాళికల వ్యయం, ప్రాజెక్టులు
దసరాకు చెల్లించే ఆనవాయితీ...
గోదావరిఖని, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సర లాభాలు, అందులో కార్మికుల వాటా శాతం ప్రకటనకు సమయం ఆసన్నమైంది. కానీ యాజమాన్యం 2024-25 ఆర్థిక సంవత్సర లాభాలను ప్రకటించలేదు. యేటా దసరాకు ముందుగా సింగరేణి కార్మికులకు లాభాల వాటాను యాజమాన్యం అందజేస్తుంది. దీంతో పాటు రూ.25వేల దసరా అడ్వాన్స్‌ను చెల్లిస్తుంది. అక్టోబర్ 2న దసరా పండుగ ఉన్న నేపథ్యంలో సెప్టెంబర్‌లోనే కార్మికులకు లాభాల వాటా ప్రకటన చెల్లింపు జరుగాల్సి ఉంది. ఈ అంశంపై సింగరేణిలో ఇప్పుడు చర్చ జరుగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థకు రూ.2412కోట్ల లాభాలు వచ్చాయి. ఇందులో 33శాతం లాభాల వాటా చెల్లించారు. రూ.796కోట్లు కార్మికులకు వాటా రూపంలో పంపిణీ జరిగింది. కేవలం 35రోజులు మాత్రమే దసరాకు వ్యవధి ఉన్నప్పటికీ ఇప్పటికీ సింగరేణి యాజమాన్యం 2024-25 ఆర్థిక సంవత్సర లాభాలనే ప్రకటించలేదు. అయితే సింగరేణిలోని కార్మిక సంఘాలు మాత్రం గడిచిన ఆర్థిక సంవత్సరం లాభాల నుంచి కార్మికులకు 35శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్‌టీయూసీ కూడా 35శాతం వాటాను కోరుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయం మేరకు సింగరేణి యాజమాన్యం ఈ వాటాను నిర్దారించి పంపిణీ చేస్తుంది. 2024-25ఆర్థిక సంవత్సరం కూడా సింగరేణి సంస్థకు సుమారు రూ.3వేల కోట్ల లాభాలు వచ్చే అవకాశం ఉన్నట్టు సింగరేణి ఫైనాన్స్ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. ఈ లాభాలపై 35శాతం కార్మికులకు ప్రభుత్వం వాటా ప్రకటిస్తే రూ.900కోట్లకు పైబడి కార్మికులకు లాభాల వాటా వచ్చే అవకాశం ఉంది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ 72మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 69.01మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసింది. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం సంస్థ లాభాలను ఎంత ప్రకటిస్తుంది, అసలు నికర లాభాలు ఎంత, దానిపై రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఎంత శాతం వాటాను లాభాల బోనస్‌గా చెల్లిస్తుందనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే సింగరేణి సంస్థ గతంలో లాగా లాభాలు ప్రకటించి చెల్లించే ఆర్థిక వెసలుబాటులో లేదు. మోయలేనంత బకాయిల భారం, భారీగా పెట్టుకున్న ప్రణాళికలు, అందుకు సంబంధించిన వ్యయం, కొత్త ప్రాజెక్టులు ఇలా అనేక ఆర్థిక నిర్వహణ సంక్షోభాలను సంస్థ ఎదుర్కొంటున్నది.
పేరుకుపోయిన బకాయిలు
సింగరేణి నుంచి బొగ్గు కొనుగోలు చేస్తున్న తెలంగాణ జెన్‌కో, సింగరేణి నుంచి కరెంటు కొనుగోలు చేస్తున్న ట్రాన్స్‌కో రూ.40వేల కోట్ల బకాయిలు సింగరేణికి చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు సింగరేణికి భారంగా మారాయి. ఎన్‌టీపీసీతో పాటు కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాలకు అమ్మిన బొగ్గు ద్వారా వచ్చిన డబ్బులు మినహా సింగరేణి దగ్గర ఆర్థిక నిల్వలు లేకపోవడం కూడా లాభాల వాటా చెల్లింపుపై ఒత్తిడి పెంచనున్నది. గతంలో సింగరేణి సంస్థకు వేల కోట్ల రూపాయల బాండ్లు ఉండేవి. వాటిపై ప్రతి సంవత్సరం రూ.400 నుంచి రూ.600కోట్ల వడ్డీ వచ్చేది. క్రమంగా సింగరేణి బాండ్లు మొత్తం కరిగిపోయాయి. దీంతో వడ్డీ ప్రయోజనాలు కూడా సింగరేణికి లేకుండా పోయాయి. దీంతోపాటు యేటా రూ.1500 నుంచి రూ.2000కోట్లు బ్యాక్ ఫిల్లింగ్ కోసం సంస్థ లాభాల ప్రకటన కంటే ముందే పక్కనపెట్టేది. అందు కోసం కేటాయించిన ఆ డబ్బులు కూడా క్రమంగా కరిగిపోయాయి. ఇప్పుడు సింగరేణి సంస్థ కార్మికులకు లాభాల వాటా వందల కోట్లు చెల్లించాలంటే ప్రభుత్వ సంస్థలైన జెన్‌కో, ట్రాన్స్‌కోల నుంచి ఎంతో కొంత బకాయిల వసూలు జరుగాల్సి ఉంది.
సింగరేణికి పెట్టుబడుల భారం
రెండు సంవత్సరాలుగా సింగరేణి సంస్థ నాలుగు కొత్త ఓపెన్‌కాస్టులను ప్రారంభం, వందల మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు, ఖనిజాల అన్వేషణ, వేలల్లో కొత్త క్వార్టర్ల నిర్మాణాలు ఇలా ప్రాజెక్టులపై పెట్టుబడులు కూడా వేల కోట్లల్లో పెరిగిపోయాయి. ఒకేసారి సింగరేణి సంస్థ రకరకాల రంగాల్లో అడుగుపెట్టేందుకు వేసిన ప్రణాళికలు కూడా సింగరేణిని ఆర్థిక ఒత్తిడికి గురి చేశాయి. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో సింగరేణి సంస్థ 2024-25 సంవత్సరం లాభాలను ఎప్పుడు ప్రకటిస్తుందో, ఎన్ని వేల కోట్లు ప్రకటిస్తుంది, అందులో కార్మికులకు వాటా ఎంత శాతం ఇస్తుందనేది సింగరేణిలో రోజూ చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా కేవలం 20రోజుల్లోనే లాభాలు ప్రకటించి కార్మికులకు వాటా శాతాన్ని కూడా తేటతెల్లం చేయాల్సిన అసమయం ఆసన్నమైంది.