peddapally : బంగారం తాకట్టులో గోల్‌మాల్
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:46 AM
కోల్‌సిటీ, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల బంగారాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, గోల్డ్‌లోన్ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణం తీసుకుంటాం.
- వేలం పేర దందా...
- బ్యాంకు అధికారులు, అప్రైజర్ల మిలాఖత్
- బినామీలతో తక్కువ ధరకే బంగారం కొట్టేస్తున్న వైనం
- తాకట్టుదారులకు కుచ్చుటోపి...
కోల్‌సిటీ, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల బంగారాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, గోల్డ్‌లోన్ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణం తీసుకుంటాం. తిరిగి రుణం చెల్లించని పక్షంలో బ్యాంకులు బంగారం వేలం పేరిట గోల్‌మాల్ దం దాకు తెరలేపుతున్నారు. ఓపెన్‌యాక్షన్ జరుగకుండా బ్యాంకులు, గోల్డ్‌లోన్ సంస్థ అధికారులు, అప్రైజర్లు కలిసి ఒక రేటు కట్టి తాకట్టుదారులకు కుచ్చు టోపి పెడుతున్నారు. లక్షల రూపాయల బంగారాన్ని బినామీ లతో కొట్టేస్తున్నారు. ఇప్పటివరకు ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థల్లోనే ఈ తరహా దందా జరుగగా ఇప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకులకు సైతం పాకింది.
జిల్లాలో ప్రభుత్వ రంగ, కో ఆపరేటివ్ బ్యాంకులు, ప్రైవేట్ గోల్డ్‌లోన్ సంస్థలు బంగారాన్ని తాకట్టు పెట్టు కుని రుణాలు ఇస్తున్నాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంతోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని ప్రాంతాల్లో ప్రైవేట్ గోల్డ్‌లోన్ సంస్థలున్నాయి. ఒక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోనే ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థలకు చెందిన పది కంపెనీలు ఉన్నాయి. ఒక్కో కంపెనీకి ఏరియాల వారీగా మూడు నాలుగు బ్రాంచ్‌లు ఉన్నాయి. తమిళనాడు కేంద్రంగా పని చేసే రెండు కంపెనీలకైతే ఐదు నుంచి ఆరు బ్రాంచ్‌లు ఉన్నాయి. ప్రభుత్వరంగ సంస్థ బ్యాంకుల్లోనైతే అకౌంట్ ఉన్న ఖాతాదారుల బంగారాన్ని తాకట్టు పెట్టుకుని రుణాలు ఇస్తారు. అప్రైజర్(బంగారం మదింపు చేసే వారు) లెక్కగట్టిన ఆభరణాల్లోని బంగారం విలువ, బరువు, నాణ్యతను బట్టి ఇవ్వాల్సిన రుణం మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఆ బంగారం విలువలో 75శాతం వరకు రుణం ఇచ్చి మిగతా 25శాతాన్ని బ్యాంకులో మార్టిగేజ్ కింద లెక్కకడుతారు. రుణాలు ఇచ్చే సమయంలో వ్యాల్యువేషన్ చార్జీలు, లోన్ ప్రాసెసింగ్ చార్జీలను వసూలు చేస్తారు.
ప్రైవేట్ సంస్థల్లోనైతే ఖాతాలు లేకున్నా ఆభరణా లపై రుణాలు ఇస్తారు. ఈ రుణాలు ఇచ్చే సమ యంలో తిరిగి చెల్లించే గడువును నిర్దేశించి వడ్డీ లెక్క గడతారు. అదే సమయంలో గడువులోగా చెల్లించక పోతే బంగారం వేలం వేసేలా అగ్రిమెంట్ చేసుకుం టారు. దీన్ని అదునుగా బంగారం వేలం జరుగుతుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనైతే రెండు మూడు సార్లు నోటీసులు ఇచ్చి, పత్రిక ప్రకటనలు ఇచ్చి వేలం వేస్తారు. ప్రైవేట్ సంస్థల్లో నోటీసులు ఇచ్చి నేరుగా వేలం వేస్తున్నారు. ఇక్కడే అసలు దందా మొదలవు తుంది. ఈ వేలం పాటల్లో ఇతరులు పాల్గొనకుండా బ్యాంకు అధికారులు, అప్రైజర్లు ఏకమవుతున్నారు. వేలంకు కొంత సమయం ముందే తాకట్టుదారులను పిలిచి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఫలాన అధికారికి మీ ఆభరణం నచ్చింది, ఆయన తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నాడని, విలువ ఎక్కువ ఇస్తాడని నమ్మిస్తున్నారు. వేలం పాటలకుపోతే ఆభరణాలు తక్కువ రేటుకు పోతాయని తాకట్టుదారులను భయపెట్టి రుణం పోగా ఎంతో కొంత అప్పజెప్పి వెళ్లగొడుతున్నారు. ఈ తరహా ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి.
గోదావరిఖనిలోని ఒక ప్రైవేట్ గోల్డ్‌లోన్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి ఇద్దరు ముగ్గురు అప్రైజర్లను ఏజెంట్లుగా పెట్టుకుని ఈ తరహా వ్యవహా రంలో సిద్ధహస్తుడిగా ప్రచారం ఉంది. తాకట్టుదారులు బ్యాంకుకు వెళితే మీ ఆభరణాలు వేలం వేశాం, మీరే అదనంగా కట్టాల్సి వస్తుందని వారిని బెదిరిస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇటీవల గోదా వరిఖని పట్టణంలోని గోల్డ్‌లోన్ సంస్థలో దీర్ఘకాలంగా తాకట్టు పెట్టి రుణం చెల్లించని ఆభరణాలను వేలం పేర ఆ సంస్థలో పని చేసే ఒక ఉద్యోగి తక్కువ సొమ్ముతో దక్కించుకున్నారు. కర్ణాటకకు చెందిన పోలీసులు చోరీ కేసుల్లో నిందితుడిని సదరు సంస్థ వద్దకు తీసుకువచ్చారు. చోరీ సొత్తును సదరు సంస్థలో తాకట్టు పెట్టి నగదు తీసుకున్నట్టు నిందితుడు పేర్కొ నడంతో పోలీసులు విచారణ జరుపగా ఆ సంస్థలో పని చేసే ఉద్యోగే దానిని దక్కించుకున్నట్టు తేలింది. దీంతో పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకోగా రికవరీ సొమ్మును చెల్లించారు. ఈ ఘటన నగరంలో చర్చనీయాంశమైంది. మరికొందరు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు సైతం ఈ తరహా తాకట్టు ఆభరణాలను తిరిగి విడిపించుకునేందుకు ఒక్క రోజు గడువుతోనే 5 నుంచి 10శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. మొత్తంగా అవసరాల కోసం బంగారం తాకట్టుపెట్టిన సామా న్యులు మాత్రం ఈ గోల్‌మాల్ దందాలతో నిండా మునుగుతున్నారు.