Share News

peddapally : సాగుకు భరోసా..!

ABN , Publish Date - Dec 29 , 2025 | 12:59 AM

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) ఈ ఏడాది కూడా పంటల సాగుకు ఢోకా లేకుండా పోయింది. వరుణుడు కరుణించడంతో జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలతో రైతులు రెండు పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో గల ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులు జలకళను సంతరించుకోవడంతో రైతులకు సాగు నీటికి తిప్పలు తప్పాయి.

peddapally :  సాగుకు భరోసా..!

- రైతులకు కలిసివచ్చిన కాలం

- ఆశించిన స్థాయిలో కురిసిన వర్షాలు

- ప్రాజెక్టులు, చిన్ననీటి వనరులకు జలకళ

- రెండు పంటలకు సరిపడా నీరు

- ఆరంభమైన రైతు భరోసా, యాసంగి సీజన్‌ నుంచి అమలు

- యాసంగిలో సన్నాలకు అందని రూ. 500 బోనస్‌

- పత్తి రైతులకు దక్కని మద్దతు ధర

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఈ ఏడాది కూడా పంటల సాగుకు ఢోకా లేకుండా పోయింది. వరుణుడు కరుణించడంతో జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలతో రైతులు రెండు పంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో గల ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులు జలకళను సంతరించుకోవడంతో రైతులకు సాగు నీటికి తిప్పలు తప్పాయి. ఈ ఏడాది ప్రారంభం యాసంగి సీజన్‌లో 2,28,728 ఎకరాలు, ఆ తర్వాత వానాకాలం సీజన్‌లో 2,71,615 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలను రైతులు సమృద్ధిగా సాగు చేశారు. ప్రస్తుతం ఈ యాసంగి సీజన్‌కు సమయాత్తం అవుతున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కటొక్కటిగా అమలు చేస్తున్నది. అర్హులైన రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ తో పాటు గతేడాది వానాకాలం సీజన్‌లో సన్న ధాన్యాన్ని పండించిన రైతులకు క్వింటాలుకు 500 రూపాయల చొప్పున 101 కోట్ల రూపాయలకు పైగా బోనస్‌ రైతుల ఖాతాల్లో జమ చేసింది. కానీ ఈ ఏడాది యాసంగిలో సన్న రకాలను సాగు చేసిన రైతులు 79,345.16 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించగా, వారికి చెల్లించాల్సిన 39 కోట్ల 67 లక్షల 25 వేల 800 రూపాయల బోనస్‌ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఆ డబ్బులను ప్రభుత్వం ఇస్తుందా, లేదా అనే విషయమై స్పష్టత లేకుండా పోయింది. 2 లక్షల రూపాయల రుణమాఫీ కింద నాలుగు విడతల్లో కలిపి 60,169 మంది రైతులకు 455 కోట్ల 50 లక్షల రూపాయలు మాఫీ చేశారు. పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం రెండేళ్లు గడుస్తున్నా కూడా అమలు చేయడం లేదు. దీంతో అకాల, భారీ వర్షాలు, చీడపీడల వల్ల పంటలు నష్టపోయే రైతులకు ఎలాంటి పరిహారం అందకుండా పోతున్నది. పంటల బీమా ఉంటే కొంత భరోసా ఉండేది. కానీ ప్రభుత్వం ఆ పథకం గురించి ప్రస్తావించక పోవడంతో పథకాన్ని అమలు చేస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ధాన్యానికి ప్రభుత్వ మద్దతు లభిస్తున్నప్పటికీ పత్తి రైతులకు మాత్రం లభించలేదు.

ఫ జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలు..

గడిచిన వర్షాకాలంలో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. మొదట పెద్దగా వర్షాలు పడక పోయినా జూలై చివరి వారం నుంచి సెప్టెంబర్‌ వరకు జోరుగా కురిసాయి. 960.6 సాధారణ వర్షపాతానికి గాను 1003.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఓదెల, ముత్తారం మండలాల్లో సాధార ణానికి మించి వర్షాలు పడగా, మిగతా మండలాల్లో సాధారణ వర్షాలు పడ్డాయి. దీంతో జిల్లాలో గల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో పాటు, ఇక్కడి నుంచి నంది గాయత్రి పంపుహౌస్‌ ద్వారా శ్రీరాజరాజేశ్వర రిజర్యాయర్‌ మిడ్‌ మానేరుకు దాదాపు 23 టీఎంసీలకు పైగా నీటిని ఎత్తిపోశారు. అదనపు జలాలను గోదావరిలోకి వదిలి పెట్టారు. అలాగే జిల్లాకు వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండింది. ఈ యాసంగి సీజన్‌కు గాను ఈ నెల 25వ తేదీన నీటిని విడుదల చేశారు. ఎప్పటిలాగానే ఆన్‌అండ్‌ఆఫ్‌ పద్ధతిన సాగునీటిని విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి వీటిని ఎత్తిపోయకుండానే రెండు పంటలకు సరిపడా నీళ్లు ఎస్సారెస్పీ, మిడ్‌ మానేరు, ఎల్‌ఎండీ, శ్రీపాద ఎల్లంపల్లిలో చేరడం గమనార్హం.

ఫ యాసంగి నుంచే రైతుభరోసా అమలు..

రైతుభరోసా పథకం కింద ఎకరానికి 7,500 చొప్పున రెండు పంటలకు 15 వేల రూపాయలు ఇస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది తర్వాత ఆ పథకాన్ని ఆరంభించింది. ఎన్నికల సందర్భంగా ప్రకటించిన విధంగా కాకుండా ఎకరానికి 6 వేల రూపాయల చొప్పున మాత్రమే ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 1,14,313 రైతులకు 42 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. 3 ఎకరాలకు పైగా భూములు ఉన్న వారికి పెట్టుబడి సాయాన్ని ఇవ్వలేదు. గడిచిన వానాకాలం సీజన్‌లో మాత్రం పూర్తి స్థాయిలో 1,21,698 మంది రైతుల ఖాతాల్లో 88లక్షల 86 వేల రూపాయలు వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ప్రస్తుత యాసంగి సీజన్‌కు ఇంకా రైతుభరోసా నిధులు జమ కాలేదు. గడిచిన వానాకాలం సీజన్‌లో జిల్లాలో 3,45,961.52 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయగా, ఇందులో 3,02,894.96 మెట్రిక్‌ టన్నులు సన్న ధాన్యం కావడం గమనార్హం. రైతులకు బోనస్‌ రూపేణా 151 కోట్ల 44 లక్షల 74 వేల 800 రూపాయలు అందాల్సి ఉన్నాయి. ఇప్పటి వరకు 50 కోట్లకు పైగా బోనస్‌ వచ్చినట్లు సమాచారం. మొత్తంగా ఈ ఏడాది కూడా రైతులకు కలిసి వచ్చిందనే చెప్పవచ్చు.

Updated Date - Dec 29 , 2025 | 12:59 AM