peddapalli : ‘ఉపాధిహామీ’ పని దినాలు పెరిగేనా...
ABN , Publish Date - Oct 27 , 2025 | 12:53 AM
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరానికి పని దినాలు పెంచాలని డిమాండ్ వస్తోంది.
- వచ్చే ఆర్థిక సంవత్సరానికి మొదలైన గ్రామసభలు
- ఈనెల 30వ తేదీ వరకు పనుల గుర్తింపు
- 2025-26లో పని దినాల్లో సగానికి పైగా కోత
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరానికి పని దినాలు పెంచాలని డిమాండ్ వస్తోంది. ఎన్నడూ లేనివిధంగా కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా పని దినాల్లో కోత విధించింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో 34 లక్షల పని దినాలు కల్పించేందుకుగాను సంబంధిత అధికారులు గ్రామసభలు నిర్వహించి, ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం పనులను గుర్తించి అంచనాలను ప్రభుత్వానికి అందజేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం విధించిన కోతల వల్ల జిల్లాకు 13.99 లక్షల పని దినాలను మాత్రమే కేటాయించారు. ఈ పని దినాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఫిబ్రవరి, మార్చి నెలలో ఉపాధిహామీ కూలీలకు పనులు కల్పించే పరిస్థితి లేకుండాపోయింది. ఆ సమయంలో వ్యవసాయ పనులు ఉండవు. యేటా ఫిబ్రవరి, మార్చి నెలలోనే ఉపాధి పనులు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఆ పరిస్థితి లేకుండా పోయింది. దేశ వ్యాప్తంగా కూలీల వలసలను నిర్వహించేందుకు, కరువు కాటకాలు వచ్చినప్పుడు కూలీలకు పని కల్పించేందుకు 2005-06 సంవత్సరంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకానికి చట్టబద్దత కల్పించింది. ఈ పథకం ద్వారా ఆయా జిల్లాలకు కేటాయించే పని దినాల్లో 40 శాతం నిధులను మెటీరియల్ కాంపోనెంట్ కింద శాశ్వత నిర్మాణాల కోసం కేటాయిస్తారు. ఈ నిధులతో గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు, ప్రహరీ నిర్మాణాలు, సిమెంట్ రోడ్లు, మురికి కాలువల నిర్మా ణాలు తదితర పనులను చేపడుతున్నారు. ఉపాధిహామీ పథకానికి చట్టబ ద్దత కల్పించిన నాటి నుంచి గుర్తించిన పనులకు గాను పని దినాలను ఆయా ప్రభుత్వాలు కల్పించాయి. పెద్దపల్లి జిల్లాకు ఐదేళ్లలో 25 లక్షల నుంచి మొదలుకొని 30 లక్షల వరకు పని దినాలను కేటాయించారు. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో 50 శాతానికి పైగా కోత విధించడంతో కూలీలకు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే లేబర్ కాంపోనెంట్ కూడా తగ్గిపోవడం వల్ల గ్రామాల్లో శాశ్వత నిర్మాణ పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొన్నది.
మొదలైన గ్రామ సభలు...
2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను ఉపాధిహామీ పథకం ద్వారా పనులను గుర్తించేందుకు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు, గ్రామసభలు నిర్వహిస్తున్నారు. యేటా గాంధీ జయంతి అక్టోబరు 2 నుంచి గ్రామసభలను ఆరంభించి నవంబర్ నెలాఖరు వరకు నిర్వహి స్తారు. ఈ గ్రామసభల్లో పనులను గుర్తించి లేబర్ బడ్జెట్‌ను రూపొంది స్తారు. ప్రధానంగా ఈ ఏడాది జల సంరక్షణ పనులతోపాటు వ్యవసాయ అనుబంధ పనులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యవసాయానికి సంబంధించి ఫాంఫాండ్స్, గొర్రెలు, మేకలు, గేదెల షెడ్ల నిర్మాణానికి ఉపాధిహామీ పథకం ద్వారా పని దినాలను కేటా యించనున్నారు. ప్లాంటేషన్‌కు సంబంధించిన పనులను కూడా గుర్తిం చాలని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ డ్వామా సిబ్బంది గ్రామాల్లో పనులను గుర్తిస్తున్నారు. అయితే ఎప్పటిలాగానే వచ్చే ఆర్థిక సంవత్సరానికి కూడా 35 లక్షల పని దినాలను గుర్తించాలని సం బంధిత అధికారులు నిర్ణయించారు. గతంలో పని దినాలను కేటాయిస్తు న్నట్లుగానే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ఉపాధిహామీ పథకం ద్వారా ఎక్కువ మొత్తంలో పని దినాలను కల్పించాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు.