Share News

Peddapalli: స్థానిక సమరానికి సన్నద్ధం..

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:22 AM

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) స్థానిక సమరానికి ప్రధానపార్టీలకు చెందిన నాయకులు సన్నద్ధం అయ్యారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేయడంతో మొదటివిడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది.

Peddapalli:  స్థానిక సమరానికి సన్నద్ధం..

- గెలుపు గుర్రాల కోసం పార్టీల వేట

- మెజారిటీ స్థానాల్లో గెలిచేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ వ్యూహాలు

- పార్టీ సమావేశాల నిర్వహణ

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

స్థానిక సమరానికి ప్రధానపార్టీలకు చెందిన నాయకులు సన్నద్ధం అయ్యారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేయడంతో మొదటివిడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. నామినేషన్లకు మరో రెండురోజులు గడువు మాత్రమే ఉండడంతో ఆయా పార్టీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ద్వితీయ శ్రేణి నాయకులు అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. నామినేషన్లకు మొదటి రోజైన గురువారం నాడు కొందరు నామినేషన్లు దాఖలు చేయగా, 28,29తేదీల్లో మరికొందరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయ నున్నారు. జిల్లాలో మొదటివిడతలో కాల్వశ్రీరాంపూర్‌, కమాన్‌పూర్‌, రామగిరి, మంథని మండలాల్లోని 99గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకోవాలని అధికార కాంగ్రెస్‌ పార్టీ తహతహలాడుతున్నది. అధికార కాంగ్రెస్‌ పార్టీకి గట్టి పోటీని ఇచ్చేందుకు బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు తమ అభ్యర్థులను రంగంలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నారు. రాజకీయపార్టీలకు సంబంధం లేకుండా ఈ ఎన్నికలు జరుగనుండడంతో చాలామంది అభ్యర్థులు పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి.

ఫ మండలాల వారీగా సమావేశాలు

పంచాయతీ ఎన్నికల్లో తమపార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అధికార కాంగ్రెస్‌పార్టీ సహా, బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు మండలాల వారిగా ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశాలు నిర్వహిస్త్తున్నారు. ఆయాగ్రామాలకు కేటాయించిన రిజర్వేషన్లను అనుసరించి ఎవరిని బరిలో దింపాలనే విషయమై సమాలోచనలు చేస్తున్నారు. పోటీఉన్న చోట, ఏఅభ్యర్థిని రంగంలో దింపితే గెలుపొందుతారనే విష యమై పార్టీ కార్యకర్తల ద్వారా అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. బలమైన అభ్యర్థులకే పార్టీల మద్దతు ఇవ్వాలని భావిస్తున్నారు. రెబల్స్‌గా పోటీచేసే వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేయాలని మండలస్థాయి నాయకులకు బాధ్యతలను అప్పగించారు. అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు ముందుకు కదులుతున్నాయి.

ఫ గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ ముందుకు.

జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, చింతకుంట విజయరమణారావు, రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ తమ నియోజకవర్గంలోని అన్నిగ్రామాల్లో తమపార్టీకి చెందిన అభ్యర్థులే గెలుపొందే విధంగా చర్యలు చేపడు తున్నారు. పార్టీ శ్రేణులను ఇప్పటికే అప్రమత్తం చేయడంతో వాళ్లంతా గ్రామాల్లో తిరుగుతున్నారు. 23నెలలలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు.

ఫ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షాలు..

అధికార కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో అమలు చేయని హామీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, 23నెలల పాలన వైఫల్యాలపై ముమ్మరంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే వివిధ కార్యక్రమాల ద్వారా కాంగ్రెస్‌పాలన గురించి ప్రజలకు వివరించేందుకు ప్రయత్ని స్తున్నాయి. ఈ ఎన్నికల ద్వారా తమ పార్టీలకు పూర్వవైభవం తీసుకురావాలని భావిస్తున్నాయి. గెలుపు గుర్రాల కోసం వేటాడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు దీటైన అభ్యర్థులను నిలబెట్టి విజయం సాధించాలని చూస్తున్నారు. తద్వారా పంచా యతీ ఎన్నికల అనంతరం జరిగే మండల, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటి క్షేత్రస్థాయిలో తమ బలాన్ని మరింత పెంచుకోవాలని చూస్తున్నాయి.

Updated Date - Nov 28 , 2025 | 12:22 AM