Share News

peddapalli : మంథనిలో ఆపరేషన్‌ మంకీస్‌

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:24 AM

మంథని, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): మంథని మున్సిపల్‌ పరిధిలో కోతుల బెడదకు చెక్‌ పెట్టేందుకు శ్రీకారం చుట్టారు. కొద్ది రోజులుగా మంథని పట్టణ పరిధిలో వివిధ ప్రాంతాల్లో ఆపరేషన్‌ మంకీస్‌ కొనసాగుతుంది.

peddapalli :  మంథనిలో ఆపరేషన్‌ మంకీస్‌

కోతుల బెదడకు చెక్‌ పెడుతున్న వైనం

ఊపీరి పీల్చుకుంటున్న ప్రజలు

మంథని, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): మంథని మున్సిపల్‌ పరిధిలో కోతుల బెడదకు చెక్‌ పెట్టేందుకు శ్రీకారం చుట్టారు. కొద్ది రోజులుగా మంథని పట్టణ పరిధిలో వివిధ ప్రాంతాల్లో ఆపరేషన్‌ మంకీస్‌ కొనసాగుతుంది. కోతుల బెడద పై ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు రావడంతో మున్సిపల్‌ అధికారులు వాటి పట్టుకోవడం, బెడద నివారణ కోసం ప్రత్యక చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆంధ్రాలోని నెల్లూరు ప్రాంతానికి చెందిన కోతులు పట్టే వారితో మాట్లాడి ఇక్కడి రపించారు. దీంతో వారు సుమారు 400 పైగా కోతులను పట్టుకొని బోన్‌లో బంధించారు. కాలేజీ గ్రౌండ్‌, బొక్కలవాగు కట్ట, బోయినిపేటతోపాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేశారు. అందులో ఆహారం పెట్టగా కోతులు అందులోకి వెళ్ళగానే బోన్‌ గేట్‌ ఆటోమెటిక్‌గా పడేలా ఏర్పాట్లు చేసి కోతులను పడుతున్నారు. ఇలా మంథని ప్రాంతంలో ఉన్న కోతులను బంధించడానికి ప్రణాళికబద్దంగా ముందుకు సాగుతున్నారు. పట్టుకున్న కోతులను అడవిలో వదిలి పెడుతున్నారు. పట్టణంతో పాటు శివారు ప్రాంతాల్లో ఇటీవల కాలంలో కోతుల బెదడ విపరీతంగా పెరగడం, దాడులు, బెదరింపులతో జనం బెంబేలెత్తిపోతున్నారు. గుంపులు, గుంపులుగా ఆహారం కోసం ఇండ్ల మీద పడుతున్నాయి. ఇండ్లలోకి వచ్చి తినుబండారాలు ఎత్తుకు పోవడం, షాపుల్లోకి వచ్చి వస్తువులను చిందరవందర చేస్తున్నాయి. వీటి అడ్డుకొని, బెదిరించే ఇండ్లలోని వారి పై దాడులకు సైతం తెగబడుతున్నాయి. వీటి దాడిన పడి చాలా మంది ఆసుపత్రుల పాలయ్యారు. నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటిలోకి, పరిసరాల్లోకి ఎప్పుడు ఎలా వస్తాయో తెలియక జనం ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో ఆపరేషన్‌ మంకీస్‌ ద్వారా కోతులను బంధిస్తుండటంతో ఇన్ని రోజులు వాటితో అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డ జనం ఊపీరి పీల్చుకుంటున్నారు.

Updated Date - Oct 06 , 2025 | 12:24 AM