Share News

Peddapalli: పెద్దపల్లి రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులపై జీఎం అసంతృప్తి

ABN , Publish Date - Sep 13 , 2025 | 11:52 PM

పెద్దపల్లి, సెప్టెంబర్‌ 13 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో నత్తనడకన జరుగుతున్న అమృత్‌ స్టేషన్‌ ఆధునీకరణ పనులపై దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Peddapalli: పెద్దపల్లి రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులపై జీఎం అసంతృప్తి

- రైల్వేస్టేషన్‌ను సందర్శించిన రైల్వే జీఎం సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ

పెద్దపల్లి, సెప్టెంబర్‌ 13 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో నత్తనడకన జరుగుతున్న అమృత్‌ స్టేషన్‌ ఆధునీకరణ పనులపై దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఆయన మంచిర్యాల, రామగుండం రైల్వే స్టేషన్లను పరిశీలించిన అనంతరం డీఆర్‌ఎం రాధాకృష్ణతో కలిసి పెద్దపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఇక్కడ 22కోట్ల రూపాయలతో రైల్వేస్టేషన్‌ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో తీవ్రమైన జాప్యం జరుగుతున్నది. పనుల్లో ఏమాత్రం వేగం పుంజుకోవడం లేదు. పనుల్లో జరుగుతున్న జాప్యంపై సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులను జీఎం ప్రశ్నించారు. పనుల్లో వేగం పెరగక పోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణీత గడువులోగా రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులను పూర్తిచేసి ప్రయాణికులకు స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా తాత్కాలికంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సదర్భంగా డీఆర్‌యూసీసీ మెంబర్‌ ఎన్‌డీ తివారి జీఎంకు శాలువా కప్పి సన్మానం చేశారు. ఇక్కడ వివిధ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్‌ సౌకర్యం కల్పించాలని తివారితోపాటు విష్ణు ప్రకాశ్‌, మాలని, దీపరాం, పూరా రామ్‌, పన్నా లాల్‌, నైన్‌ సింగ్‌ జీఎంను కోరారు.

రామగుండం రైల్వేస్టేషన్‌ సందర్శించిన జీఎం..

అంతర్గాం: రామగుండం పట్టణంలోని రైల్వే స్టేషన్‌ను శనివారం దక్షిణమధ్య రైల్వే జనరల్‌మేనేజర్‌ సంజయ్‌కుమార్‌ శ్రీవాత్సవ సందర్శించారు. ఈ సందర్భంగా జీఎం రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలు, ఎదుట గల పార్కు, పార్కింగ్‌ స్టాండ్‌లను పరిశీలించారు. అనంతరం మాట్లాడారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనే రైల్వేసంస్థ ప్రధానలక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుందనపల్లి, పెద్దంపెట్‌, కన్నాల వద్ద ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించాలని కోరుతూ రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి పోచం వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా రామగుండం రైల్వేస్టేషన్‌లో పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలపాలని కోరుతూ రైల్వేబోర్డు మెంబర్‌ అనుమాస శ్రీనివాస్‌ జీన్స్‌, పలు కార్మిక సమస్యలు పరిష్కరించాలని రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ నాయకులు, రైల్వేసంఘ్‌ యూనియన్‌ నాయకులు జీఎంకు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం జీఎం రైల్వే అధికారులతో కలిసి గోదావరిఖని లోని సింగరేణి, ఎన్‌టీపీసీ, రైల్వే సైడింగ్‌లను తనిఖీచేశారు. కార్యక్రమంలో డివిజనల్‌ రైల్వేమేనేజర్‌ గోపాల్‌కృష్ణన్‌, స్టేషన్‌మాస్టర్‌ మీనా, కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీమన్నారాయణ, రవి కుమార్‌, ఆర్‌పీఎఫ్‌ సీఐలింగమయ్య, యూనియన్‌ నాయకులు యాదగిరి స్వామి, రాథోడ్‌ ఆనంద్‌, అజ్మీరా వీరన్న పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 11:52 PM