Peddapalli: గణేష్ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:02 AM
కోల్‌సిటీ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ పరి ధిలో ఈనెల 5న జరుగనున్న గణేష్ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు అదనపుకలెక్టర్, రామగుండం నగరకమిషనర్ అరుణశ్రీ పేర్కొన్నారు.
మున్సిపల్, పోలీస్, సింగరేణి సమన్వయంతో పనిచేయాలి
నిర్దేశించిన పనులను బాధ్యతతో పూర్తి చేయాలి
సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ
కోల్‌సిటీ, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ పరి ధిలో ఈనెల 5న జరుగనున్న గణేష్ నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు అదనపుకలెక్టర్, రామగుండం నగరకమిషనర్ అరుణశ్రీ పేర్కొన్నారు. బుధవారం కార్పొరేషన్ కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, సింగరేణి, ఆర్‌ఎఫ్‌సీఎల్, ఎన్టీపీసీ, ఎన్‌పీడీసీఎల్, ఫిషరీస్, ఫైర్, ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రామగుండం ప్రాంతంలోని గణనాథులతోపాటు మంచిర్యాల జిల్లానుంచి నిమజ్జనంకు వచ్చే గణనాథుల సంఖ్యను దృష్టిలో ఉంచు కుని ఏర్పాట్లు చేయాలన్నారు. సింగరేణి సంస్థ అదనపు ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేయడంతోపాటు క్రేన్‌లను సమకూర్చాలన్నారు. ప్లాట్‌ఫాంలు, క్రేన్‌ల సిబ్బంది షిప్టుల వారీగా పనిచేయాలని, నిమజ్జనం పూర్తయ్యేంత వరకు బాధ్యులందరూ విధుల్లోనే ఉండాలన్నారు. మెయిన్‌చౌరస్తాతోపాటు అన్ని కూడళ్లు, నిమజ్జనం జరిగే గోదావరి వంతెన, సమ్మక్క-సారలమ్మ పుష్కర ఘాట్ వద్ద విస్తృత లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్‌పీడీసీఎల్ గోదావరిఖని మెయిన్‌చౌరస్తాతో పాటు గోదావరి వంతెన వద్ద అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను సమకూర్చాలని, సిబ్బంది 24గంటలు అందుబాటులో ఉండాలన్నారు. నిమజ్జనం తరువాత గోదావరి వంతెన తరువాత రైస్ మిల్లు వద్ద యూటర్న్ ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ అంతరాయం ఏర్పడితే ఎలాంటి ఇబ్బంది కలుగకుండా జనరేటర్లను సమకూర్చుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. సింగరేణి రెస్క్యూ సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉండాలన్నారు. నిమజ్జనానికిపిల్లలను పంపవద్దని, గోదావరి వంతెన నుంచి నిమజ్జనప్రాంతానికి ఎక్కువ మందిని అనుమతించేది లేదన్నారు. ఎన్‌టీపీసీసంస్థ ఆర్థిక వనరులను సమకూర్చడంతో పాటు స్కైలిఫ్టర్, రెండుక్రేన్‌లు ఇవ్వాలన్నారు. ఫిషరీస్ విభాగం స్పీడ్‌బోట్‌తో పాటు 25మంది గజఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ సంస్థ గణపతి మండపాలకు స్వీట్‌ను ఇవ్వనున్నట్టు ఆమె తెలిపారు. సమీక్ష సమావేశంలో గోదావరిఖని ఏసీపీ రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాద్‌రావు, రాజేశ్వర్‌రావు, ప్రవీణ్, తహసిల్దార్ శ్రీపాద ఈశ్వర్, సింగరేణి, ఆర్‌ఎఫ్‌సీఎల్,ఎన్టీపీసీ, ఎన్‌పీడీసీఎల్ అధికారులు పాల్గొన్నారు.