Peddapalli: గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలి: కలెక్టర్ కె శ్రీహర్ష
ABN , Publish Date - Sep 11 , 2025 | 12:40 AM
పెద్దపల్లి, సెప్టెంబర్ 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
పెద్దపల్లి, సెప్టెంబర్ 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో గోదావరి పుష్కరాల ఏర్పాట్ల సన్నద్ధతపై అదనపుకలెక్టర్లు డి వేణు, జే అరుణశ్రీతో కలిసి నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. గతంలో జిల్లాలో సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సమ్మక్కసారలమ్మ జాతర గోదావరిఖని, మంథని గౌతమేశ్వర ఆలయం, సమ్మక్క సారలమ్మ జాతర గోలివాడ, ప్రాంతాల్లో స్నానాల ఘాట్లలో పుష్కర స్నానాలు జరిగాయని కలెక్టర్ తెలిపారు. గోలివాడ స్నానాల ఘాట్ దెబ్బతిన్నం దున నూతనఘాట్ నిర్మాణం, గౌతమేశ్వర ఆలయంవద్ద ప్రస్తుతం ఉన్న స్నానాల ఘాట్‌కు అదనంగా మరో ఘాట్ సురబండేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్మించడానికి ప్రతిపాదనలు తయారుచేయాలన్నారు. గతపుష్కరాల సమయంలో వచ్చిన భక్తుల సంఖ్య, పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రస్తుత సంవత్సరం మన జిల్లాలో ఎంతమంది పుణ్యస్నానాలు ఆచరిస్తారో అంచనా వేస్తూ దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో జడ్పీసీఈవో నరేందర్, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, గోదావరిఖని ఏసీపీ రమేష్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ తదితరులు పాల్గోన్నారు.
అంగన్‌వాడీ సూపర్వైజర్ల పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం
జిల్లాలో పనిచేస్తున్న అంగన్‌వాడీ సూపర్వైజర్ల పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరును మెరుగు పరుచుకోకుంటే కఠినచర్యలు తప్పవని హెచ్చ రించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లా డుతూ.. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు నిబంధనల ప్రకారం పనిచేసేలా పర్యవే క్షించాలని ఆదేశించారు. అంగన్‌వాడీకేంద్రాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాలలో పిల్లల సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టాలని, ప్రతి కేంద్రంలో కనీసం 15మంది పిల్లలు ఉండేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పాలు, కోడిగుడ్లు, పప్పు దినుసులు, ఇతర ఆహార పదార్థాలను సరిగ్గా స్టోర్ చేయాలని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రం నుంచి అందించే ఆహార పదార్థాల నాణ్యతను రెగ్యులర్‌గా చెక్‌చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో పాడైన ఆహార పదార్థాలు పిల్లలకు, గర్భిణులకు ఇవ్వకూడదన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్‌రావు, సీడీపీవోలు అలేఖ్య, పుష్ప పాల్గొన్నారు.
నిబంధనల మేరకు భూసమస్యల పరిష్కారం
ఓదెల, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): భూ భారతిచట్టం క్రింద నిబంధనల మేరకు భూ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. బుధవారం ఓదెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతోపాటు రెవెన్యూ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రికి ఎలాంటి రోగులు వస్తున్నారని, జ్వరాల పరిస్థితి ఎలా ఉందని తెలుసుకున్నారు. అలాగే ప్రజలకు అందుబాటులో ఉండాలని, వైద్య సిబ్బంది సకాలంలో విధులకు హాజరుకావాలని సూచించారు. వర్షాల వల్ల కలుషిత నీటి ప్రభావం ప్రజలపై పడకుండా అప్రమత్తం చేయాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అవగాహన కల్పిస్తూ, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో తహసిల్దార్ ధీరజ్‌కుమార్, ఎంపీడీవో తిరుపతి, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.