peddapaaly : నిరుపయోగంగా నిఘా నేత్రాలు
ABN , Publish Date - Jul 28 , 2025 | 12:58 AM
కోల్‌సిటీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): ఒక సీసీ కెమెరాల పది మంది పోలీసులతో సమానం... సీసీ కెమెరాల ఏర్పాటు అందరి బాధ్యత అంటూ ప్రజలను, వ్యాపారులను చైతన్యపరుస్తోంది. పోలీస్‌శాఖ ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తుంది.
- అలంకారప్రాయంగా సీసీ కెమెరాలు
- లక్షల వ్యయంతో ఏర్పాటు
- నేర పరిశోధనలకు అడ్డంకులు
- రామగుండం కమిషరేట్‌లోనే 13,151కెమెరాలు....
- జిల్లాలో 5,400, గోదావరిఖనిలో రెండు చోట్లనే లైవ్...
కోల్‌సిటీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): ఒక సీసీ కెమెరాల పది మంది పోలీసులతో సమానం... సీసీ కెమెరాల ఏర్పాటు అందరి బాధ్యత అంటూ ప్రజలను, వ్యాపారులను చైతన్యపరుస్తోంది. పోలీస్‌శాఖ ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తుంది. లక్షల రూపాయల వ్యయంతో గ్రామాల నుంచి నగరాల వరకు అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నా వాటి నిర్వహణ లేకపోవడంతో చాలా చోట్ల అలంకారప్రాయంగా మారాయి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒక పోలీస్ స్టేషన్‌లలోనే సీసీ కెమెరాలు పకడ్బందీగా పని చేస్తాయని, మిగతా చోట్ల అంతంత మాత్రమే. ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో నేర పరిశోధనల్లో సైతం పోలీసులకు చుక్కెదురవుతున్నాయి. చిన్న చిన్న దొంగతనాలు సైతం ఇండ్ల వద్ద యజమానులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీసీకెమెరాల ఏర్పాటుకు పోలీస్‌శాఖ విస్తృతంగా ప్రోత్సహించింది. గతంలో ఒక రామగుండం నగర పరిధిలోనే సీసీ కెమెరాల ఏర్పాటుకు నగరపాలకసంస్థ సీఎంఏ గ్రాంట్ నుంచి రూ.1కోటి వెచ్చించింది. ఎన్‌టీపీసీ, గోదావరిఖని ప్రాంతాల్లో అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్‌శాఖకు అప్పగించింది. పోలీసుల విజ్ఞప్తి మేరకు సింగరేణి సంస్థ రూ.10లక్షలతో సింగరేణి కాలనీలు జీఎం కాలనీ, పవర్‌హౌస్‌కాలనీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఇక ప్రజలు, వ్యాపారుల భాగస్వామ్యంతో కమిషనరేట్ పరిధిలో 13,150 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు ముఖ్య కూడళ్లల్లో సీసీ కెమెరాలు ఉండే విధంగా చర్యలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా పరిధిలోనే 5400లకుపైగా సీసీ కెమెరాలు ఉన్నట్టు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి. ఇందులో పెద్దపల్లి సబ్ డివిజన్‌లో 1861, గోదావరిఖని సబ్‌డివిజన్‌లో 3540 ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 3338, బెల్లంపల్లి పరిధిలో 2906, జైపూర్ పరిధిలో 1506 సీసీ కెమెరాలు ఉన్నాయి. దీనికి తోడు రాజీవ్ రహదారి పరిధిలో పలు చోట్ల అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ అండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేశారు. పెద్దపల్లి, సుల్తానాబాద్, ఎన్‌టీపీసీ, గోదావరిఖని ప్రాంతాల్లో రాజీవ్ రహదారిపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల ఠాణాలకు అనుసంధానం చేశారు.
నిర్వహణ లేక అలంకార ప్రాయం...
రామగుండం పోలీస్ కమిషరేట్ పరిధిలో పోలీస్ సిబ్బంది కృషి చేసి టార్గెట్ ప్రకారం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించింది. కానీ నిర్వహణ భారంగా మారింది. సీసీ కెమెరాల నిర్వహణకు ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక నిధులు ఇవ్వడం లేదు. సాధారణంగా మేజర్ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో సీసీ కెమెరాలను ఆయా ప్రాంతాల ఠాణాలకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఈ కెమెరాల నెట్‌వర్క్ నిర్వహణకు వ్యయం ఉంటుంది. కేబుళ్లు పాడైపోవడం, కెమెరాలు చెడిపోవడం, ఇతర సాంకేతిక కారణాలను ఎప్పటికప్పుడు సరిచేయాల్సి ఉంటుంది. ఇందుకు పోలీస్ సబ్ డివిజన్ల వారీగా నిర్వహణ వ్యవస్థ అవసరం. నిర్వహణ లేకపోవడంతో చాలా చోట్ల సీసీ కెమెరాలు పనిచేయలేని పరిస్థితి ఉంది. రామగుండంలో కోటి రూపాయల వ్యయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే రాజేష్ థియేటర్, బస్టాండ్ సమీపంలోని కెమెరాలు మాత్రమే పని చేస్తున్నాయి. పట్టణంలోని చాలా ప్రాంతాల్లో కెమెరాలు అలంకార ప్రాయమయ్యాయి.
ప్రభుత్వ సంస్థలు భాగస్వామ్యం అయితేనే ఫలితం...
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సీసీ కెమెరాల నిర్వహణలో ప్రభుత్వ సంస్థలను భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. ఎన్‌టీపీసీ, సింగరేణి సంస్థలు హైదరాబాద్‌లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కోట్ల రూపాయల నిధులు ఇచ్చాయి. కానీ రామగుండంలో నిధులు వెచ్చించడం లేదు. ఎన్‌టీపీసీ సంస్థ జీహెచ్‌ఎంసీ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీస్‌శాఖకు నిధులు ఇచ్చింది. జిల్లా పరిధిలోని ప్రధాన పట్టణాలు, రహదారుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు వార్షిక నిర్వహణకు కూడా ఎన్‌టీపీసీ, సింగరేణి, ఆర్‌ఎఫ్‌సీఎల్, కేశోరాం సిమెంట్స్ వంటి సంస్థలను భాగసామ్యం చేయాల్సిన అవసరం ఉంది. సింగరేణి సంస్థ ఆర్‌జీ-1 పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఇప్పటికే నిధులు మంజూరు చేసింది. ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంలో పోలీస్‌శాఖ సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వార్షిక మరమ్మతులకు సంబంధించి ఏరియాల వారీగా మున్సిపల్ పాలకవర్గాలు, పరిశ్రమలకు బాధ్యతలు అప్పగిస్తేనే సీసీ కెమెరాల పని తీరు మెరుగుపడే అవకాశం ఉంది.