Share News

పేద ప్రజల పొట్ట కొట్టడమే దేశభక్తా

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:08 AM

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి, వీబీ జీరాంజీ పేరుతో కొత్త చట్టం చేసిందని, దేశ పేద ప్రజల పొట్ట కొట్టడమే దేశభక్తా అని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి ప్రశ్నించారు.

పేద ప్రజల పొట్ట కొట్టడమే దేశభక్తా

గణేశ్‌నగర్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి, వీబీ జీరాంజీ పేరుతో కొత్త చట్టం చేసిందని, దేశ పేద ప్రజల పొట్ట కొట్టడమే దేశభక్తా అని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి ప్రశ్నించారు. కరీంనగర్‌ గీతా భవన్‌ చౌరస్తాలో వీబీ జీరాంజీ చట్టాన్ని నిరసిస్తూ బిల్లు ప్రతులను శనివారం దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ వీబీ జీరాంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వామపక్షాలు పోరాటం చేసి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సాధించుకున్నాయన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్‌లో నిధులు తగ్గిస్తూ పేద ప్రజల పొట్టగొడుతోందని విమర్శించారు. పని దినాల సంఖ్యను తగ్గించి, నిర్వహణ భారాన్ని రాష్ట్రాలపై మోపుతామనడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ ముక్తకంఠతో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష ఎంపీలు బిల్లును జేపీసీకి పంపాలని విజ్ఞప్తి చేసినా వినకుండా చట్టం చేశారని విమర్శించారు. గ్రామీణ పేదల ఉపాధి హక్కును కాపాడేందుకు ప్రజలందరూ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్‌, ఎడ్ల రమేష్‌, కోనేటి నాగమణి, డి నరేష్‌పటేల్‌, జిల్లా నాయకులు గజ్జల శ్రీకాంత్‌, రాయికంటి శ్రీనివాస్‌, కాంపెల్లి అరవింద్‌, పుల్లెల మల్లయ్య, కనకరాజు, రాకేష్‌, శివ, మహేష్‌, శ్రీకాంత్‌, సతీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 12:08 AM