Share News

‘స్థానికం’పై పార్టీల దృష్టి

ABN , Publish Date - Aug 13 , 2025 | 01:10 AM

మూడు నెలల్లోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో మరో రెండు నెలల్లోనే ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రజల వద్దకు వెళ్లేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు సన్నాహాలు చేసుకుంటున్నాయి.

‘స్థానికం’పై పార్టీల దృష్టి

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

మూడు నెలల్లోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో మరో రెండు నెలల్లోనే ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రజల వద్దకు వెళ్లేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని ఆర్డినెన్స్‌ జారీ చేసి గవర్నర్‌కు పంపగా ఆయన దానిని కేంద్ర న్యాయశాఖ పరిశీలనకు పంపించారు. కాంగ్రెస్‌ పార్టీ బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని, ఈ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో పైచేయిగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. బీసీలనంతా ఒక్కతాటిపైకి తెచ్చి కాంగ్రెస్‌కు అనుకూలంగా వారు నిలిచేలా చేయాలనే వ్యూహంతో ఈ రిజర్వేషన్ల వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది.

ఫ 24న చొప్పదండిలో కాంగ్రెస్‌ పాదయాత్ర, శ్రమదానం

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌గౌడ్‌ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను నిర్వహించాలని నిర్ణయించారు. మొదటి విడత యాత్రను ఇప్పటికే పూర్తిచేసుకున్న ఆయన ఈ నెల 24న కరీంనగర్‌ జిల్లాలో తన రెండో విడత యాత్రను ప్రారంభిస్తున్నారు. 24న సాయంత్రం ఆయన చొప్పదండి నియోజకవర్గానికి చేరుకుని 10 నుంచి 15 కిలోమీటర్ల మేరకు ఆ పరిధిలో వచ్చే గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి ప్రజలను కలుసుకుని నేరుగా ముచ్చటిస్తారు. పార్టీ పథకాల గురించి, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తారు. భవిష్యత్‌లో చేపట్టే కార్యక్రమాల గురించి కూడా ఆయన వివరించి ప్రజల్లో ఆయా పథకాలపైన వాటిని అమలు తీరుపైన ఉన్న అభిప్రాయాలను తెలుసుకుని తీసుకురావాల్సిన మార్పులపైన సూచనలను స్వీకరిస్తారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ కూడా ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు. 25న వారు ఇదే నియోజకవర్గంలో జరిగే శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా స్థాయిలో విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కార్యక్రమం రూపొందించారు. ఈ కార్యక్రమంలో వారు పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత పటిష్టంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలను సూచిస్తారు. స్థానిక సంస్థల్లో మెజార్టీ స్థానాల్లో పార్టీ ప్రతినిధులను గెలిపించుకోవడానికి అనుసరించవలసిన వ్యూహాల గురించి చర్చించి దిశానిర్దేశం చేస్తారని సమాచారం. ఎన్నికల కమిషన్‌ ఎప్పుడు నోటిఫికేషన్‌ ఇచ్చినా వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల్లో ఒకరిగా కలిసిపోయి పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషిచేసే విధంగా కార్యకర్తలు, నాయకులకు ఈ సమావేశంలో కార్యాచరణను ఇస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

ఫ బీసీ సభలతో బీఆర్‌ఎస్‌ ప్రజల్లోకి...

కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ఆర్డినెన్స్‌ జారీ చేయగా బీఆర్‌ఎస్‌ మాత్రం కాంగ్రెస్‌ పార్టీ బీసీ రిజర్వేషన్ల పేరిట డ్రామా ఆడుతున్నదని విమర్శిస్తోంది. ఈ అంశంపై జిల్లాల్లో సభలు నిర్వహించి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను తెచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ లబ్దిపొందే అవకాశం ఇవ్వకూడదని బీఆర్‌ఎస్‌ భావిస్తున్నది. బీఆర్‌ఎస్‌ అంటేనే బీసీల పక్షపాతిగా నిలిచిన పార్టీ అని, బీసీలకు వివిధ పథకాలు ప్రారంభించడంతోపాటు అన్ని రాజకీయ అవకాశాలను కల్పించిన పార్టీగా నిలిచిందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్‌ బీసీ నినాదంతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నదని విమర్శిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సభలను నిర్వహించి ఇదే ప్రచారాన్ని కొనసాగించి బీసీల మద్దతు కూడగట్టుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు గంపగుత్తగా కాంగ్రెస్‌వైపు వెళ్లకుండా నిలువరించాలని ఆ పార్టీ భావిస్తున్నది. అధికార, విపక్ష పార్టీలు రెండూ బీసీ నినాదం ఎత్తుకోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.

ఫ బీఆర్‌ఎస్‌ సభ వాయిదా

జిల్లా నుంచే బీసీ సభలకు శ్రీకారంచుట్టాలని బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం భావించి ఈ నెల 8న అందుకు ముహూర్తంగా నిర్ణయించింది. వర్షాల కారణంగా ఆ సభ వాయిదా పడగా 14న సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేసింది. రాష్ట్రంలో 14 నుంచి 17వ తేదీ వరకు అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ ప్రకటించింది. వాతావరణ శాఖ ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలర్ట్‌ ప్రకటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాల కారణంగా ఎవరు ఎలాంటి నష్టాలకు గురికాకుండా చూసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ బీసీ సభను వాయిదా వేసుకుంది. త్వరలోనే ఈ సభ నిర్వహించే తేదీని ప్రకటిస్తామని సభ నిర్వాహక బాధ్యులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ప్రకటించారు.

Updated Date - Aug 13 , 2025 | 01:10 AM