పిల్లల విద్యాభ్యాసంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:22 AM
పదో తరగతి చదువుతున్న పిల్లల విద్యాభ్యాసంపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి అన్నారు.
సిరిసిల్ల టౌన్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : పదో తరగతి చదువుతున్న పిల్లల విద్యాభ్యాసంపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలను వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి సందర్శించారు. పాఠశాల తరగతి గదులు, మధ్యాహ్న బోజనశాల, క్రీడా మైదానం, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అనంతరం పాఠశాలలో ఉపాధ్యాయులు-తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి సంబంధించి తల్లిదండ్రులకు పలు సూచనలను చేశారు. పదో తరగతి విద్యార్థులకు స్టడీ హవర్స్, పరీక్షలకు సిద్ధత, పాఠశాలకు హాజరు శాతం, పిల్లల పరిరక్షణపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి పాఠశాలలో ఐఎఫ్‌బీ ప్యానల్ టీవీల ద్వారా కంప్యూటర్ విద్యను కూడా తప్పనిసరి చేశారన్నారు. అక్టోబరు నుంచే పదో తరగతి విద్యార్థులకు స్టడీ హవర్స్‌ను ప్రారంభించామన్నారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శారద, చకినాల శ్రీనివాస్, ఉపాధ్యాయులతో పాఠశాల విద్యాకార్యకలాపాలపై సమీక్షించారు. అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమాలలో పాల్గొని ఉపాధ్యాయులుగా వ్యవహరించిన విద్యార్థులను అభినందించారు.