Share News

పంచాయతీ ఓటర్ల లెక్క సిద్ధం

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:24 AM

గ్రామాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. గ్రామపంచాయతీ, మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఓటరు ముసాయిదా జాబితాలను ప్రదర్శించడంతో ఆశావాహులతో పాటు గ్రామీణుల్లో ఎన్నికలపై ఆసక్తి చోటుచేసుకుంది.

పంచాయతీ ఓటర్ల లెక్క సిద్ధం

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

గ్రామాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. గ్రామపంచాయతీ, మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఓటరు ముసాయిదా జాబితాలను ప్రదర్శించడంతో ఆశావాహులతో పాటు గ్రామీణుల్లో ఎన్నికలపై ఆసక్తి చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామపంచాయతీలు, 12 మండల పరిషత్‌ కార్యాలయాల్లో ఓటర్ల వివరాల జాబితాలను అధికారులు అందుబాటులో ఉంచారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. శనివారం మండలస్థాయిలో ఎంపీడీవోలు రాజకీయ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. 30వ తేదీ వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి, 31న పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. అదేరోజు అభ్యంతరాలను పరిష్కరించి ఓటరు జాబితాను సవరిస్తారు. సెప్టెంబర్‌ 2న తుది ఓటర్‌ జాబితాను వెల్లడిస్తారు.

ఫ బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామపంచాయతీ ఉండగా 2268 వార్డులు ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో 352134 మంది ఓటర్లు ఉన్నట్లు లెక్క తేల్చి గ్రామాల్లో డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ ప్రదర్శించారు. గ్రామాల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాలను రూపొందించే క్రమంలో ఓకే కుటుంబంలోని ఓటర్లందరూ ఓకే పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో ఉండే విధంగా సవరించారు. మృతిచెందిన ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించారు. కొత్త ఓటర్లను జాబితాలో చేర్చారు. అధికారులు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జిల్లాలో 200 మంది ఓటర్లు ఉన్న గ్రామాల్లో 1734పోలింగ్‌ కేంద్రాలు, 400 ఓటర్ల వరకు 468 పోలింగ్‌ కేంద్రాలు, 650 ఓటర్ల వరకు ఉన్న పంచాయతీల్లో 76 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. పంచాయతీ ఎన్నికల్లో 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నారు. 260 సర్పంచ్‌లు, 2268 వార్డులకు ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే బ్యాలెట్‌ బాక్సులు సిద్ధంగా ఉంచారు. సర్పంచ్‌ ఎన్నికలకు పెద్ద బాక్సులు, వార్డు సభ్యులకు చిన్న బ్యాలెట్‌ బాక్సులు జిల్లాకు వచ్చాయి. జిల్లాలో పోలింగ్‌ స్టేషన్ల పక్రియను కూడా పూర్తి చేశారు. అంతకుమించి ఓటర్లు ఉంటే రెండో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తారు. 200 మంది ఓటర్లు ఉన్న చోట ఒక ప్రిసైడింగ్‌ అధికారి ఒక పోలింగ్‌ అధికారి ఉంటారు. 201 నుంచి 400 వరకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి ఇద్దరు పోలింగ్‌ అధికారులు, 401 నుంచి 650 వరకు ఉంటే ప్రిసైడింగ్‌ అధికారితో పాటు ముగ్గురు పోలింగ్‌ అధికారులను నియమిస్తారు.

ఫ ముందుగా సర్పంచ్‌ ఎన్నికలే..

స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుగా హైకోర్టు ఆదేశం మేరకు గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారని భావిస్తున్నారు. తుది ఓటరు జాబితా సిద్ధమవుతుండడంతో గ్రామాల్లో ఆశావహుల్లోనూ హడావుడి పెరిగింది. గ్రామాల్లో పెద్దలను, వివిధ కుల సంఘాల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్‌ తేలకపోయినా పార్టీపరంగా రిజర్వేషన్‌ ఇచ్చే చర్చ కూడా జరుగుతోంది. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీ నాయకులు పోటీ ఆసక్తి పెరిగింది.

ముసాయిదా జాబితా ప్రకారం ఓటర్లు

మండలం పంచాయతీలు వార్డులు ఓటర్లు

బోయినపల్లి 23 212 30,505

చందుర్తి 19 174 28,094

ఇల్లంతకుంట 35 294 40,546

గంభీరావుపేట 22 202 36,807

కోనరావుపేట 28 238 35,225

ముస్తాబాద్‌ 22 202 38,500

రుద్రంగి 10 86 13,665

తంగళ్లపల్లి 30 252 38,862

వీర్నపల్లి 17 132 11,727

వేములవాడ 11 104 18,492

వేములవాడరూరల్‌ 17 146 18,825

ఎల్లారెడ్డిపేట 26 226 40,886

మొత్తం 260 2268 3,52,134

Updated Date - Aug 30 , 2025 | 01:24 AM