అధికారుల సమన్వయంతో పంచాయతీ ఎన్నికలు విజయవంతం
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:40 AM
అధికారుల సమన్వయంతోనే గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు.
- కలెక్టర్ సత్య ప్రసాద్
జగిత్యాల, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): అధికారుల సమన్వయంతోనే గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. జిల్లాలో మూడు దశల్లో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా, విజయవం తంగా ముగియడంపై పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్లు బీఎస్ లత, రాజాగౌడ్, తదితరులు కలెక్టర్ బి సత్యప్రసాద్‌ను కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, అన్ని స్థాయిల అధికారులను, సిబ్బందిని అభినందించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు అధికారు లు అందరు సమన్వయంతో పనిచేయడం వల్లనే ఎన్నికలు సజావుగా నిర్వహించగలిగామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌డీఓ మధుసూదన, శిక్షణ అదనపు కలెక్టర్ కన్నం హరిణి, జడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, డిపివో రఘువరన, జిల్లా అధికారులు మదన మోహన, రేవంత, కలెక్టరేట్ ఏవో హకీం, కలెక్టరేట్ కార్యాలయం సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.
గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి
వచ్చే యేడాది జూలై మాసంలో రానున్న గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి అవసరమైన ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ధర్మపురిలోని గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృ ద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఇందుకు అవసరమైన మాస్టర్ ప్లాన రూపొందించాలన్నారు. పుష్కరాలకు రానున్న భక్తుల రద్దీ అంచనా వేయాలన్నారు. ఇందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ఒకే రోజు రెండు లక్షల మంది పుష్కర ఘాట్లకు తరలివచ్చిన ఇబ్బందులు లేకుండా రోడ్లు, రహదారుల నిర్మాణంతో పాటు ట్రాఫిక్ నియంత్రించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత, రాజాగౌడ్, డీపీఓ రఘువరన, ఆర్‌డీఓ మధుసూదన, డిప్యూటీ కలెక్టర్ హరిణి పాల్గొన్నారు.