పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:36 AM
గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్వోలకు, ఏఆర్వోలకు ఫేజ్- 2 శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ కార్యక్రమాన్ని వీడియో పవర్ ప్రెజెంటేషన ద్వారా అవగాహన కల్పిస్తూ ఎన్నికల విధులపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలం టే నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణలో నామినేషన్లు చాలా ముఖ్యమైన అంశమని, దీని పైన చాలా కేసులు దాఖలు అయ్యే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రతీఅంశం నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని తెలిపారు. అధికారిక ప్రకారం మాత్రమే రిజర్వేషన అంశాలను పరిశీలించాలని అన్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, అప్పిళ్ల పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు సంబంధించిన కరపత్రాలు, గోడ పత్రాలు, ప్రచార వాహనాల అనుమతులను తీసుకోవాలంటే సంబంధిత మండల తహసీల్దార్లను సంప్రదించాలని తెలిపారు. గ్రామాల్లో ఎక్కడైనా సర్పంచ అభ్యర్థికి ఎనిమిది, వార్డు సభ్యులకు ఆరు కంటే ఎక్కువ నామినేషన దాఖలు అయితే తమకు తెలియజేయాలని అన్నారు. అభ్యర్థుల వివరాలు నామినేషన పత్రాల్లో పూర్తిగా నమోదు చేయాలని, లేకుంటే నామినేషనను తిరస్కరించాలని సూచించారు. ప్రతీ చిన్న అంశాన్ని, అనుమానాలను శిక్షణలో నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమవాళికి లోబడి గ్రామపంచాయతీ ఎన్నికలను నిర్వహించాలన్నారు. ఎలాంటి పొరపాట్లు జరుగకుండా పగడ్బందీగా నిర్వహణకు అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషనకు ఒకరోజు ముందుగా కొత్త బ్యాంక్ ఖాతా తీసుకునే విధంగా వారికి తెలియజేయాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన నామినేషన ఒరిజినల్ పత్రాలను సంబంధిత గ్రామ పంచాయతీలలోని ఆర్వోల వద్ద పొందవచ్చని తెలిపారు. జిరాక్స్ కాపీలు వాడవద్దని, వార్డుసభ్యుడు పోటీ కోసం అదే వార్డు సభ్యుడు ప్రొపోజర్ గా ఉండాలని, సర్పంచగా పోటీచేసే అభ్యర్థి డిపాజిట్ కింద కేటగిరి వారీగా చెల్లించాలని, ఏమైనా అప్పీల్ ఉంటే ఆర్డీవోను సంప్రదించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో స్థానికసంస్థల అదనపు కలెక్టర్ బి రాజగౌడ్, జగిత్యాల ఆర్డీవో మధుసూదన, జనరల్ అబ్జర్వర్ జి. రమేష్, జిల్లా వ్యయ పరిశీలకులు మనోహర్, అడిషనల్ డీఆర్‌డీవో మదన మోహన, డీపీవో రేవంత, జిల్లా నోడల్ అధికారులు, జిల్లా ఎన్నికల విభాగం, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.