మా నిధులు మాకే
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:47 AM
జిల్లాలో గల ఖనిజ వనరుల ద్వారా ప్రభుత్వానికి జమయ్యే సీనరేజీ పన్నుల నుంచి డీఎంఎఫ్‌టీకి తరలించి ప్రభావిత గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయాల్సిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్‌ఎస్ ప్రభుత్వ విఽధానాన్నే అనుసరిస్తున్నది. మా నిధులు మాకే కావాలం టూ స్థానిక ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో గల ఖనిజ వనరుల ద్వారా ప్రభుత్వానికి జమయ్యే సీనరేజీ పన్నుల నుంచి డీఎంఎఫ్‌టీకి తరలించి ప్రభావిత గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయాల్సిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్‌ఎస్ ప్రభుత్వ విఽధానాన్నే అనుసరిస్తున్నది. మా నిధులు మాకే కావాలం టూ స్థానిక ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. సోమవారం ప్రభుత్వ విప్ జగిత్యాల ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పెద్దపల్లి, రామగుం డం ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కలిసి డీఎంఎఫ్‌టీ నిధులు విడుదల చేయాలని వినతిపత్రం సమర్పించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. అంతకుముందు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కూడా కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 మాసాలు గడుస్తున్నా కూడా జిల్లాలో గల వనరుల ద్వారా వసూలవుతున్న డీఎంఎఫ్‌టీకి జమ అవుతున్న నిధులను ప్రభుత్వం జిల్లాకు విడుదల చేయకపోవడం గమనార్హం. వాస్తవానికి ఆయా జిల్లాల్లో డీఎంఎఫ్‌టీకి జమయ్యే నిధులను అక్కడి ప్రభావిత ప్రాంతాల అభివద్ధికి, జిల్లాలో గల ఇతర గ్రామాల అభివృద్ధికి నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. కానీ డీఎం ఎఫ్‌టీకి జమ చేయాల్సిన నిధులను నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే జమ చేస్తున్నారు. ఈ జిల్లాకు రావాల్సిన నిధులను ఇతర జిల్లాలకు మళ్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయా సంస్థలు డీఎంఎఫ్‌టీ నిధులను జిల్లా ఖాతాలో జమ చేయకుండా, నేరుగా ప్రభుత్వ ఖజానాకే చెల్లిస్తున్నారు. కానీ ఆ నిధులు జిల్లాకు బదలాయింపు కావడం లేదు. గత ప్రభుత్వ హయాంలో నిధులు రాకపోగా, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ నిధులను విడుదల చేయకపోవడంతో జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడింది. గత ఐదేళ్ల నుంచి డీఎంఎఫ్‌టీ రూపేణా జిల్లాకు రావాల్సిన సుమారు 669 కోట్ల రూపాయలు రాకుండా పోయాయి. దీని పర్యావసానంగా జిల్లాలో చేపట్టిన కొన్ని పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. జిల్లాలోని గోదావరిఖని, రామగుండం, రామగిరి, కమాన్‌పూర్, మంథని వరకు బొగ్గు గనులు విస్తరించి ఉన్నాయి. కొన్ని అండర్ గ్రౌండ్ బొగ్గు గను లు ఉండగా, మరికొన్ని ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. అలాగే పాల కుర్తి మండలంలో సున్నం రాయి గుట్టలు ఉండగా, వాటిని సిమెంట్ తయారీ పరిశ్రమకు లీజుకు ఇచ్చారు. జిల్లాలో గోదావరి, మానేరు నదులు పారుతుండగా ఇసుక రీచులు నడుస్తున్నాయి. ఈ వనరు లను తరలించుకు పోయేందుకు ప్రభుత్వానికి సీనరేజీ సొమ్మును చెల్లిస్తూ ఉంటారు. ఈ సొమ్మును గతంలో స్థానిక సంస్థలకు వాటాల ప్రకారం బదలాయిస్తే, ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం వెచ్చించే వాళ్లు. కానీ ఆ పరిస్థితి గత ఐదేళ్ల నుంచి లేకుండా పోయింది.
ఫ 2015లో డీఎంఎఫ్‌టీ ఏర్పాటు
2015లో కేంద్ర ప్రభుత్వం డిస్ట్రిక్ట్ మినరల్ ట్రస్టు ఫండ్ (డీఎం ఎఫ్‌టీ)ను తీసుక వచ్చింది. ప్రభుత్వానికి చెల్లించే సీనరేజీ నుంచి 30 శాతం నిధులను డీఎంఎఫ్‌టీకి జమ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా జమ అయిన నిధులను ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం వెచ్చిం చాల్సి ఉంటుంది. డీఎంఎఫ్‌టీకి 2018 వరకు సుమారు 713 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. కేంద్రం తీసుకవచ్చిన జీఓకు అనుబంధంగా ఈ నిధులను ఉమ్మడి జిల్లా అంతటా వెచ్చించాలని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక జీఓను తీసుక వచ్చింది. ఆ మేరకు 2018లో మొదట ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 8106 పనులకు 559 కోట్ల 22 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో 1807 పనులు చేపట్టేందుకు 252 కోట్ల 23 లక్షలు మంజూరు చేశారు. అలాగే కొవిడ్ సమయంలో 2020లో రాష్ట్ర ప్రభుత్వం 198 కోట్ల రూపాయలు తీసుకోగా, ఆ తర్వాత కూడా మరొకసారి 123 కోట్ల రూపాయలను మళ్లించడం గమనార్హం. సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాలతో జగిత్యాల జిల్లాకు 23 కోట్లు, రాజన్న సిరిసిల్ల జిల్లాకు 31 కోట్ల 92 లక్షలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు 18 కోట్ల రూపాయలను జిల్లా అధికారులు కేటా యించారు. మొత్తంగా 13 నియోజకవర్గాల్లో 8266 పనులకు 782 కోట్ల 94 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి.
ఫ ఐదేళ్లుగా జమకానీ నిధులు
జిల్లాలో ఖనిజ వనరుల ద్వారా చెల్లించే సీనరేజీ పన్నుల నుంచి 30 శాతం నిధులను జిల్లా డీఎంఎఫ్‌టీకి జమ చేయాల్సి ఉండగా, ప్రభుత్వ ఆదేశాలతో ఐదేళ్లుగా ప్రభుత్వ ఖజానాకే చెల్లిస్తున్నారు. దీంతో జిల్లాలో నేరుగా అభివృద్ధి పనులు చేసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం వద్ద చేతులు చాపాల్సిన దుస్థితి ఏర్పడింది. జిల్లాలో అతి పెద్ద వనరుగా భావి స్తున్న సింగరేణి సంస్థ నుంచి గత ఐదేళ్లుగా డీఎంఎఫ్‌టీకి నేరుగా డబ్బులు జమకావడం లేదని అధికారులు చెబుతున్నారు. సింగరేణితో పాటు ఆయా సంస్థలు జమచేస్తున్న నిధులను జిల్లాకు కేటాయించ కుండా రాష్ట్ర ప్రభుత్వమే వివిధ అవసరాలకు వాడుకుంటున్నట్లు తెలుస్తున్నది. అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధిలో భాగంగా 50 కోట్ల రూపాయలు కేటాయించారు. మంథని నియోజకవర్గంలో కొన్ని నిధులను రోడ్ల నిర్మాణాలకు నిధులు కేటాయించారు. గతంలో డీఎంఎఫ్‌టీ కింద చేసిన పనులకు సంబంధించి చాలా వరకు బిల్లు లు పెండింగులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో గల ఖనిజ, ఇసుక, ఇతర వనరుల ద్వారా ప్రతి ఏటా 130 నుంచి 150 కోట్ల రూపాయలకు పైగా జమ అవుతాయని, జిల్లా అభివృద్ధి కోసం ఎవరి వద్ద చేయి చాపకుండా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యేలు ఆశిస్తే వారి ఆశలు అడియాసలే అవుతున్నాయి. జిల్లాలో నెలకొన్న పరిస్థితుల గురించి ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. నేరుగా ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఇప్పటికైనా జిల్లాకు డీఎంఎఫ్‌టీ నిధులను కేటాయిస్తారా, లేదా వేచి చూడాల్సిందే.