కొనసాగుతున్న యూరియా కష్టాలు
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:21 AM
యూరియా కోసం కష్టాలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రైతులు తెల్లవారు జాము నుంచే విక్రయ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. గంటల కొద్దీ వేచి చూసినా ఒకటి, రెండు బస్తాలే ఇస్తున్నారని అసంతృప్తితో వెనుదిరుగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు.
యూరియా కోసం కష్టాలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రైతులు తెల్లవారు జాము నుంచే విక్రయ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. గంటల కొద్దీ వేచి చూసినా ఒకటి, రెండు బస్తాలే ఇస్తున్నారని అసంతృప్తితో వెనుదిరుగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు.
హుజూరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్ డివిజన్‌లో యూరియా కోసం రైతుల ఇబ్బందులు పడుతున్నారు. హుజూరాబాద్ పట్టణంలోని ఓ ఫర్టిలైజర్ షాపునకు సోమవారం రాత్రి యూరియా లారీ లోడ్ వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు మంగళవారం ఉదయం బారులు తీరారు. దుకాణం యజమాని రైతులను క్యూలైన్లలో ఉంచి ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. యూరియా దొరక ని రైతులు నిరాశతో వెనుతిరిగారు.
ఫ హుజూరాబాద్‌రూరల్ : హుజూరాబాద్ మండలం చెల్పూర్ సొసైటీకి యూరియా స్టాక్ వచ్చిందనే సమాచారంతో రైతులు తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసుల సహకారంతో సొసైటీ అధికారులు రైతుకు ఒక బస్తా పంపిణీ చేశారు.
ఫ జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని హుజూరాబాద్ రోడ్డులో గల గ్రోమోర్‌లో యూరియా టోకెన్లు ఇస్తుండటంతో మంగళవారం రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాయంత్రం వరకు పడిగాపులు కాయగా 295 మందికి 440 టోకెన్లు జారీ చేశారు. తనుగుల సోసైటీ ఆధ్వర్యంలో వావిలాల రైతు వేదికలో 282 మందికి 440టోకెన్లు ఇచ్చారు. మండల వ్యవసాయ అధికారి షేక్ ఖాధర్ హుస్సేన్ ఈ-పాస్ మిషన్‌ను ప్రారంభించారు. జమ్మికుంట మండలం కోరపల్లి డీసీఎంఎస్‌లో 268 మందికి టోకెన్లు అందించారు. వీరికి బుధవారం బస్తాలు పంపిణీ చేయనున్నట్లు ఏవో తెలిపారు.
ఫ శంకరపట్నం : మండలంలోని మొలంగూర్, తాడికల్ గ్రామాలకు లారీ యూరియా లోడ్ రాగా యూరియా కోసం రైతులు గోదాముల ఎదుట బారులు తీరారు. ఒక్కో రైతుకు ఒక్క బస్తా యూరియాను అందిం చారు. మొలంగూర్ గ్రామంలో పోలీస్ పహారా మధ్య యూరియా పంపిణీ చేశారు.
ఫ రామడుగు: రామడుగు సింగిల్‌విండో పరిధిలోని వెదిర గోదాముకు యూరియా బస్తాలు వచ్చాయని తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 250 బస్తాలు రావడంతో నిర్వాహకులు అంతవరకే పంపిణీ చేశారు. మిగతా రైతులు నిరాశతో వెనుదిరిగారు.
ఫ తిమ్మాపూర్: తిమ్మాపూర్ మండల కేంద్రానికి 450, పర్లపల్లి గ్రామానికి 450, పొరండ్ల గ్రామానికి 450, కొత్తపల్లి గ్రామానికి 260 చొప్పున యూరియా బస్తాలు వచ్చాయి. విషయం తెలుసుకున్న రైతులు మంగళవారం తెల్లవారు నుంచే బారులు తీరారు. పర్లపల్లి సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం చెప్పులు లైన్‌లో పెట్టారు. పోరండ్ల సొసైటీ వద్ద పోలీసుల ఆధ్వర్యంలో యూరియా పంపిణీ చేశారు. తిమ్మాపూర్‌లో ఒక్కో రైతుకు రెండు చొప్పున యూరియా బస్తాలను పంపిణీ చేశారు. కొత్తపల్లిలో ఒక్కొక్కటి మాత్రమే రైతులకు అందజేశారు.
ఫ చిగురుమామిడి: మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం ఎదుట రెండు రోజులుగా యూరియా కోసం మహిళా రైతులు పడిగాపులు కాస్తున్నారు. చెప్పులు, ఇతర వస్తువులు క్యూలో పెట్టారు. రెండు రోజులుగా యూరియా రాకపోవడంతో మంగళవారం కరీంనగర్- హుస్నాబాద్ రోడ్డుపై రాస్తారోకో చేశారు.
ఫ మానకొండూర్ : మానకొండూర్‌లోని గ్రోమోర్ కేంద్రంత పాటు సహకార సంఘం కార్యాలయంలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. పోలీసుల ఆధ్వర్యంలో ప్రతి రైతుకు రెండు బస్తాలను పంపిణీ చేశారు.
ఫ గన్నేరువరం: మండల కేంద్రంలోని సొసైటీ కేంద్రంతో పాటు గ్రోమోర్ కేంద్రానికి యూరియా లోడ్ వస్తుందన్న సమాచారంతో భారీ సంఖ్యలో రైతులు క్యూలైన్‌లో నిలుచున్నారు గంటల తరబడి క్యూలో ఉన్నా కొందరికే బస్తాలు దొరికాయి. దీంతో మిగిలిన రైతులు ఆందోళనకు దిగడంతో ఎస్‌ఐ నరేందర్‌రెడ్డి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి పంపించారు.