Share News

ఒక్క ఓటు.. సర్పంచను చేసింది

ABN , Publish Date - Dec 16 , 2025 | 02:41 AM

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఓటు విలువను చాటిచెప్పాయి.

ఒక్క ఓటు.. సర్పంచను చేసింది

- ఒక్క ఓటుతో ఐదుగురు అభ్యర్థుల విజయం

- మూడు ఓట్ల తేడాతో ముగ్గురు గెలుపు

- స్వల్ప ఆధిక్యతతో 18 మందికి పదవీ యోగం

- రెండు విడతల్లో కాంగ్రెస్‌ అగ్రస్థానం

- రెండో స్థానంలో బీఆర్‌ఎస్‌

- గౌరవ ప్రదమైన సీట్లతో బీజేపీ

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌ )

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఓటు విలువను చాటిచెప్పాయి. ఈ విడతలో ఐదుగురు అభ్యర్థులు ఒకే ఒక్క ఓటుతో తమ ప్రత్యర్థులను ఓడించి సర్పంచ పదవిని దక్కించుకున్నారు. మానకొండూర్‌ మండలం ముంజంపల్లి పంచాయతీలో ఎం కనకలక్ష్మి, పెద్దూరుపల్లి గ్రామంలో ఆర్‌ హరీష్‌, శంకరపట్నం మండలం అంబాలపూర్‌లో వి వెంకటేశ, తిమ్మాపూర్‌ మండలం కొత్తపల్లిలో జి శోభారాణి, మహాత్మానగర్‌లో పి సంపత ఒక్క ఓటుతో గెలుపొందారు.

- తిమ్మాపూర్‌ మండలం పోలంపల్లిలో మూడు ఓట్ల ఆధిక్యతతో స్వతంత్ర అభ్యర్థి జి లావణ్య, బాలయ్యపల్లి పంచాయతీలో బీఆర్‌ఎస్‌కు చెందిన డి శ్రీనివాస్‌, శంకరపట్నం మండలం కరీంపేట పంచాయతీలో కాంగ్రెస్‌కు చెందిన ఎ శ్రీలత సర్పంచులుగా గెలుపొందారు.

- ఐదు ఓట్ల మెజార్టీతో శంకరపట్నం మండలం బీఆర్‌ఎస్‌కు చెందిన ఎం నాగలక్ష్మి, ఆరు ఓట్ల మెజార్టీతో ఆధిక్యతతో కాంగ్రెస్‌కు చెందిన కె. తిరుపతి గన్నేరువరం మండలం యాస్వాడలో సర్పంచుగా విజయం సాధించారు. గన్నేరువరం మండలం మాదాపూర్‌ గ్రామంలో బీఆర్‌ఎస్‌కు చెందిన ఎం శ్రీనివాస్‌ తొమ్మిది ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. చాకలివానిపల్లెలో ఇండిపెండెంట్‌ అభ్యర్థి బి బానవ్వ ఐదు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.

- పది ఓట్ల మెజార్టీతో తిమ్మాపూర్‌ మండలం ఇందిరానగర్‌లో బీఆర్‌ఎస్‌కు చెందిన రామకిషన, నర్సింగాపూర్‌లో కాంగ్రెస్‌కు చెందిన పి రవి విజయం సాధించారు. శంకరపట్నం మండలం రాజాపూర్‌లో 13 ఓట్ల మెజార్టీతో ఇండిపెండెంట్‌ కె రవి, మానకొండూర్‌ మండలం నిజాయితీ గూడెంలో 14 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌కు చెందిన బి సరిత సర్పంచలుగా గెలుపొందారు. బీజేపీకి చెందిన మధుసూధనరెడ్డి చిగురుమామిడి మండలం గునుకులపల్లి పంచాయతీలో 12 ఓట్ల మెజార్టీతో సర్పంచుగా గెలుపొందారు. శంకరపట్నం మండలం ఆర్కండ్ల పంచాయతీలో ఇండిపెండెంట్‌ ఎన.పవనకుమార్‌ సర్పంచుగా 10 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.

ఫ జోష్‌లో కాంగ్రెస్‌ నేతలు

గ్రామ పంచాయతీ ఎన్నికలు అందిస్తున్న విజయాలు అధికార కాంగ్రెస్‌ పార్టీ నేతలను, శ్రేణులను ఆనందోత్సహాల్లో ముంచెత్తుతున్నాయి. మూడో విడతలోనూ అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల్లో పాగా వేస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 11, 14న రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆధికత్యను సాధించింది. అధికారపార్టీ పాలనా వైఫల్యాల కారణంగా ప్రజల్లో నిరసన వ్యక్తమవుతున్నదని, అది ఈ ఎన్నికల్లో ఓట్ల రూపంలో వ్యక్తమవుతుందని విపక్షాలు ఆశించినా ఫలితాలు కాంగ్రెస్‌కు ఉత్సాహం కలిగించే విధంగానే ఉన్నాయి. రెండు విడతల్లో 205 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగగా కాంగ్రెస్‌ 87 పంచాయతీల్లో విజయం సాధించింది. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) 63 స్థానాలతో ద్వితీయ స్థానంలో నిలిచింది. బీజేపీకి గతంలో కంటే ఎక్కువ సీట్లే లభించాయి. రెండు విడతల్లో కలిపి ఆ పార్టీకి చెందిన నేతలు 23 పంచాయతీల్లో సర్పంచులుగా గెలుపొందారు. 31 స్థానాల్లో ఇండిపెండెంట్లు, ఒక స్థానంలో టీడీపీ అభ్యర్థి గెలిచారు. మొదటి విడత ఎన్నికల కంటే రెండో విడత ఎన్నికల్లోనే బీఆర్‌ఎస్‌కు ఎక్కువ స్థానాలు వచ్చాయి. 23 స్థానాలను బీజేపీ దక్కించుకున్నా అందులో అత్యధికంగా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, రామడుగు మండలాల్లో 10 స్థానాలు రావడం జిల్లాలో కొత్త చర్చకు తెరతీస్తున్నాయి.

ఫ మొదటి విడత పంచాయతీలు

- కరీంనగర్‌ రూరల్‌ మండలంలో ఉన్న 14 పంచాయతీల్లో కాంగ్రెస్‌కు ఆరు, బీఆర్‌ఎస్‌కు మూడు, బీజేపీకి రెండు, ఇండిపెండెంట్లకు మూడు దక్కాయి.

- కొత్తపల్లి మండలంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ రెండేసి స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ఒక్కో చోట గెలుపొందారు.

- చొప్పదండి మండలంలో కాంగ్రెస్‌ 10 పంచాయతీల్లో విజయం సాధించగా, బీఆర్‌ఎస్‌ ఆరు స్థానాల్లో గెలుపొందింది. ఇక్కడ బీజేపీ ఖాతా తెరవలేక పోయింది.

- గంగాధర మండలంలో 33 పంచాయతీల్లో 13 పంచాయతీలను కాంగ్రెస్‌, ఏడు బీజేపీ, ఆరు స్థానాలను బీఆర్‌ఎస్‌ దక్కించుకున్నాయి. ఇండిపెండెంట్లు ఆరు పంచాయతీల్లో గెలుపొందగా ఒక్క పంచాయతీలో టీడీపీ ఖాతా తెరిచింది.

- రామడుగు మండలంలో 23 పంచాయతీల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. 11 స్థానాలు కాంగ్రెస్‌కు రాగా, ఎనిమిదింటిలో బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. మూడు పంచాయతీలను బీజేపీ, ఒక పంచాయతీని ఇండిపెండెంట్‌ అభ్యర్థి దక్కించుకున్నారు.

ఫ రెండో విడత పంచాయతీలు

మానకొండూరు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలతోపాటు హుస్నాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని చిగురుమామిడి మండలంలో రెండో విడతలో ఎన్నికలు జరిగాయి. ఈ విడతలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు గట్టి పోటీనే ఇచ్చింది.

- గన్నేరువరం మండలంలో 17 గ్రామపంచాయతీలు ఉండగా ఎనిమిది పంచాయతీల్లో కాంగ్రెస్‌, రెండు పంచాయతీల్లో బీజేపీ, ఏడు పంచాయతీల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఈ మండలంలో బీఆర్‌ఎస్‌ ఒక్కస్థానాన్నికూడా దక్కించుకోలేక పోయింది.

- తిమ్మాపూర్‌ మండలంలో 23 పంచాయతీలుండగా ఈ మండలంలో బీఆర్‌ఎస్‌ తన ఆధిక్యతను చాటింది. బీఆర్‌ఎస్‌కు ఇక్కడ తొమ్మిది పంచాయతీలు దక్కగా, ఆరింటిలో కాంగ్రెస్‌, ఏడు స్థానాల్లో ఇండిపెండెంట్లు, ఒక్కస్థానంలో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు.

- మానకొండూర్‌ మండలంలో 29 గ్రామపంచాయతీలు ఉండగా ఇక్కడ కాంగ్రెస్‌ తన పట్టును చాటుకున్నది. 18 గ్రామాల్లో కాంగ్రెస్‌ తన సర్పంచులను గెలిపించుకోగా తొమ్మిది పంచాయతీల్లో బీఆర్‌ఎస్‌, రెండు పంచాయతీల్లో బీజేపీ విజయం సాధించాయి.

- శంకరపట్నం మండలంలో బీఆర్‌ఎస్‌ తన ఆధిక్యతను చాటుకున్నది. ఈ మండలంలో 27 పంచాయతీలకు గాను 11 పంచాయతీలను బీఆర్‌ఎస్‌ దక్కించుకున్నది. ఏడు పంచాయతీల్లో కాంగ్రెస్‌ గెలుపొందింది. ఆరు పంచాయతీల్లో ఇండిపెండెంట్లు, మూడు పంచాయతీల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.

- చిగురుమామిడి మండలంలో 17 పంచాయతీలు ఉండగా బీఆర్‌ఎస్‌ తొమ్మిది పంచాయతీల్లో, కాంగ్రెస్‌ ఏడు స్థానాల్లో, బీజేపీ ఒక స్థానంలో గెలిచింది.

ఫ తోడి కోడళ్ల మధ్య హోరాహోరీ

తిమ్మాపూర్‌ మండలం కొత్తపల్లిలో తోటికోడళ్లు జి.శోభారాణి (బీఆర్‌ఎస్‌), గోదారి లక్ష్మి (కాంగ్రెస్‌) నుంచి సర్పంచు పదవి దక్కించుకునేందుకు పోటీ చేశారు. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల పోరులో ఒక్క ఓటు ఆధిక్యతతో బీఆర్‌ఎస్‌కు చెందిన జి శోభారాణి విజయం సాధించారు. ఇదే మండలంలో అత్యధికంగా 13 ఓట్లు నోటాకు వేశారు.

-----------------------

మొదటి, రెండు విడతల్లో పార్టీల వారీగా పంచాయతీలు

---------------------------------------------------------------

విడత పంచాయతీలు కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ బీజేపీ ఇతరులు

----------------------------------------------------------------------------------------------

మొదటి 92 41 25 14 12

(ఒకరు టీడీపీ)

రెండవ 113 46 38 9 20

-------------------------------------------------------------------------------------------

205 87 63 23 32

-----------------------------------------------------------------------------------------

Updated Date - Dec 16 , 2025 | 02:41 AM