Share News

ఏదయా.. యూరియా..

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:33 AM

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం తోపాటు వెంకటాపూర్‌, రాచర్లతిమ్మాపూర్‌, అల్మాస్‌పూర్‌ గ్రామాల్లోని గోదాంల వద్ద సోమవారం యూరియా కోసం రైతులు ఎదురు చూశారు.

ఏదయా.. యూరియా..

ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం తోపాటు వెంకటాపూర్‌, రాచర్లతిమ్మాపూర్‌, అల్మాస్‌పూర్‌ గ్రామాల్లోని గోదాంల వద్ద సోమవారం యూరియా కోసం రైతులు ఎదురు చూశారు. యూరియా బస్తాలు వచ్చాయనే సమాచారంతో ఉదయం నుంచే రైతులు బారులు తీరారు. బస్తాల కోసం ఎగబడ్డారు. రైతుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వరుసలో నిలబెట్టారు. చివరి వరకు ఉన్న తమకు యూరియా లభించకపోవడంతో నిరాశతో వెనుదిరిగామని రైతులు వాపోయారు. ఎల్లారెడ్డిపేట, వెంకటాపూర్‌, రాచర్లతిమ్మాపూర్‌, అల్మాస్‌పూర్‌ ఐకేపీ, ప్యాక్స్‌ ఆధ్వ ర్యంలోని గోదాంలకు సోమవారం 65 మెట్రిక్‌ టన్నుల యూరియా చేరుకుందని వ్యవసాయ అధికారి రాజశేఖర్‌ పేర్కొన్నారు. ముందు వరసలో ఉన్న రైతులు ఎక్కువ సంఖ్యలో బస్తాలు తీసుకోవడం వల్ల చివరి రైతులకు అందలేదని చెప్పారు. యూరియా సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతామని ఏవో రాజశేఖర్‌ వివరించారు.

ఇల్లంతకుంట : యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మండలకేంద్రంలోని సహకార సంఘ కార్యాలయం, పెద్దలింగాపూర్‌, ముస్కానిపేట, పొత్తూరు గ్రామాలలో విక్రయ కేంద్రాలకు యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు సోమవారం ఉదయమే చేరుకున్నారు. కేంద్రాలు ప్రారంభించక ముందే రైతులు క్యూ కట్టారు. యూరియా బస్తాలు తక్కువగా ఉండటం రైతులు ఎక్కువ మంది రావడంతో నిర్వాహాకులు ఇబ్బంది పడ్డారు. ప్రతి ఆధార్‌కార్డుకు కేవలం రెండు యూరియా బస్తాలు మాత్రమే ఇస్తామని సిబ్బంది, వ్యాపారులు నిబందనలు విధించారు. రైతులు ఎక్కువ మంది రావడంతో సమాచారం అందుకున్న పోలీసులు కేంద్రాలకు చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. కొన్ని గ్రామాలలో ప్రైవేట్‌ వ్యాపారులు సేంద్రియ ఎరువు బస్తాలు, పోషకాలు పెంచే బయోజన్‌ అనే లిక్విడ్‌ను కొనుగోలుచేస్తేనే యూరియా బస్తాలు ఇస్తామనే నిబంధనలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులపై వ్యవసాయాధికారి సురేష్‌రెడ్డి మాట్లాడుతూ ఎవరు ఆందోళన చెందవద్దన్నారు. నాలుగు రోజుల్లో సరిపడా యూరియా వస్తుందన్నారు. అపోహలు నమ్మి అవసరం లేకున్నా రైతులు యూరియా కొనుగోలు చేయవద్దన్నారు. వ్యాపారులు ఎలాంటి నిబంధనలు విధించవద్దన్నారు.

చందుర్తి : అధికారులు ఒకవైపు యూరియా కొరత లేదని చెప్తున్నా మండల కేంద్రంతోపాటు సనుగుల గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎదుట రైతులు సోమవారం తెల్లవారుజామున నుంచే బారులు తీరారు. మండలంలోని చందుర్తి, సనుగుల పీఏసీఎస్‌లో సోమ వారం యూరియా పంపిణీ చేపట్టారు. అయితే యూరియా దొరుకుతుం దో లేదో అన్న సందేహంతో రైతులు ఉదయం 6 గంటలకు చేరుకుని తమ చెప్పులను క్యూలైన్‌లో పెట్టారు. సిబ్బంది ఒక్కో రైతుకు ఒకటి, రెండు బస్తాల చొప్పున చందుర్తి, సనుగుల సొసైటీలో 888బస్తాలను 306 మంది కి రైతులకు అందించారు. సరిపడా యూరియా అమ్మేలా ఏర్పాట్లు చేయా లని రైతులు కోరుతున్నారు. చందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి సోమవారం సాయంత్రం 444బస్తాల యూరియా వచ్చినట్లు సీఈవో తెలిపారు. చందుర్తి ఎస్‌ఐ రమేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు బం దోబస్తు నిర్వహించారు. కాగా మండల కేంద్రంతోపాటు మల్యాల, మర్రిగ డ్డ,సనుగుల గ్రామంలోని ప్రైవేట్‌ వ్యాపారులు యూరియాను రూపాయలు 300నుంచి 350వరకు విక్రయించినట్లు రైతులు వాపోయారు. కొంతమంది బడా రైతులు ముందస్తుగానే ఒక్కొక్క రైతు 60బస్తాల పైగా నిల్వ చేసుకోవడం వల్లనే యూరియా కొరత ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు అధిక ధరలకు విక్రయించకుండా, బ్లాక్‌ మార్కెట్‌కు తరలించకుండా అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

కోనరావుపేట : యూరియా కోసం రైతులు పడికాపులు కాస్తున్నారు. అధికారులు మాత్రం యూరియా కొరతలేదని చెప్తున్నారు. అయినప్పటికీ యూరియా కోసం రైతులు బారులు తీరుతు న్నారు. కోనరావుపేట మండలంలోని కొలనూరు సింగిల్‌ విండో కార్యాల యానికి నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ కార్యాలయానికి 250 బస్తాల చొప్పున యూరియా వచ్చింది. యూరియా వచ్చిందని తెలుసుకొని రైతులు బారు తీరడంతో యూరియా సరిపోక రైతులు వెను తిరిగారు.

Updated Date - Aug 12 , 2025 | 12:34 AM