అగ్రనేతల్లో.. మిగిలింది ముగ్గురే..
ABN , Publish Date - Nov 20 , 2025 | 01:07 AM
మావోయిస్టు పార్టీ మోస్ట్ వాంటెడ్ మాడ్వి హిడ్మా మారేడుమిల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నేలకొరగడంతో ఉమ్మడికరీంనగర్ జిల్లాలో ఆందోళన మొదలైంది.
పెద్దపల్లి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ మోస్ట్ వాంటెడ్ మాడ్వి హిడ్మా మారేడుమిల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నేలకొరగడంతో ఉమ్మడికరీంనగర్ జిల్లాలో ఆందోళన మొదలైంది. పార్టీ అగ్రనేతలైన ఉమ్మడిజిల్లాకు చెందిన మావోయిస్టుపార్టీ మాజీ ప్రధానకార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ప్రస్తుత ప్రధానకార్యదర్శి తిప్పిరి తిరుపతి, అలియాస్ దేవుజీ, కేంద్రకమిటీ సభ్యుడు మల్లారాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ ముగ్గురే మిగలగా, వారు క్షేమమేనా? అని ఎక్కడ నలుగురు గుమిగూడినా చర్చించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాలో పట్టుబడిన మావోయిస్టుల్లో తొమ్మిదిమంది దేవ్‌జీ రక్షకదళ సభ్యులు ఉండటంతో దేవ్ జీ ఎక్కడ అనే ఉత్కంఠ నెలకొన్నది. ఆయన ఇక్కడి నుంచి తప్పించుకున్నారా లేక మరోచోట ఉన్నారా అనే విషయం తెలియడం లేదు. మావోయిస్టు పార్టీని నడిపిస్తున్న వారిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కీలకంగా కొన్నేళ్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఉద్యమమే ఊపిరిగా అనేకమంది స్వగ్రామాలను వదిలి అడవుల బాటపట్టి అసువులు బాషారు.
మావోయిస్టు పార్టీ తొలి ప్రధానకార్యదర్శిగా ముప్పాళ్ల..
తాడిత, పీడిత ప్రజలను, అణగారిన వర్గాలను భూస్వామ్య పెత్తందారుల నుంచి కాపాడేందుకు పీపుల్స్ వార్ సీపీఐఎంఎల్ పార్టీ పుట్టుకు వచ్చింది. ఈపార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొండపల్లి సీతారామయ్య ఆధ్వర్యంలో నడుస్తూ వచ్చింది. ప్రజలను చైతన్యవంతులను చేస్తూ, భూస్వాముల పెత్తనాలను అణిచివేస్తూ దున్నేవాడికే భూమి ఇవ్వాలి, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్దిస్తుంది అనే నినాదాలతో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. పీపుల్స్‌వారితో పాటు దేశ వ్యాప్తంగా సీపీఐఎంఎల్ గ్రూపులు విప్లవ ఉద్యమాలను కొనసాగిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో అంతా ఒకే గొడుగు కింద పనిచేస్తే ఫలితాలు ఉంటాయని భావించిన నక్సలైట్లు తమ పార్టీలను విలీనం చేసి సీపీఐ ఎంఎల్ మావోయిస్టు పార్టీగా 2004లో ఏర్పాటు చేశారు. అప్పటివరకు పీపుల్స్ వారి పార్టీకి ప్రధానకార్యదర్శిగా కొనసాగుతున్న ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి నూత నంగా ఆవిర్భవించిన మావోయిస్టు పార్టీకి కూడా ఆయనను ప్రధాన కార్యదర్శిగా 30మంది పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్రకమిటీ సభ్యులు కలిసి ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పటి నుంచి ఆయన 15 ఏళ్లపాటు పార్టీని వివిధ రాష్ర్టాలకు విస్తరించి విప్లవోద్యమాన్ని కొనసాగించారు. అనారోగ్య కారణాల వల్ల గణపతి ప్రదానకార్యదర్శి పదవి నుంచి తప్పుకోవడంతో ఆ పదవి నంబాల కేశవరావును వరించింది. ముప్పాలతోపాటు పెద్దపల్లి జిల్లాకు చెందిన మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్ కిషన్ జీ, మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ సోనూ, పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, జగిత్యాల జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, శీలం నరేష్, కరీంనగర్ జిల్లాకు చెందిన నల్ల ఆదిరెడ్డి అలియాస్ శ్యామ్, కట్ట రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి తదితరులు దళ సభ్యుడు నుంచి కేంద్రకమిటీ స్థాయికి ఎదిగారు. మే నెలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పార్టీ ప్రధానకార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్‌కౌంటర్‌లో నేలకొరగడంతో ఆ పదవి తిప్పిరి తిరుపతిని వరించింది. ఆ పదవిలో ఆయన కుదురుకోక ముందే కగార్ ఆపరేషన్ రూపంలో పార్టీ కోలుకోకుండా దెబ్బతింటూ వస్తున్నది.
ఆపరేషన్ కగార్‌తో కకావికలం..
2026మార్చి నెలఖారు నాటికి దేశంలో మావోయిస్టు పార్టీని లేకుండా చేయాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వంరెండు సంవత్సరఆల క్రితం కగార్ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టింది. ఆదునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి డ్రోన్లు, పలు రకాల ఆయుధాలతో కేంద్ర బలగాలు దండకారణ్యంతోపాటు కర్రిగుట్టలను జల్లెడ పట్టి పలువురు మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టింది. అందులో కట్ట రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి సెప్టెంబర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందారు. దీంతో కేంద్రకమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌రావు, అలియాస్ సోనూ గడ్చిరోలిలో 70మంది నక్సలైట్లతో కలిపి ఆయుధాలతో సహా మహరాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవిస్ ఎదుట లొంగిపోయారు. అలాగ మరో కేంద్రకమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న హైదరాబాద్‌లో డీజీపీ ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. మావోయిస్టు పార్టీలో ఏర్పడిన విబేధాల వల్లనే పలు ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కగార్ ఆపరేషన్ ఆపి శాంతి చర్చలు చేపట్టాలని మావోయిస్తుపార్టీ, ప్రజాసంఘాలు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఆపరేషన్‌లు కొనసాగిస్తూ వస్తున్నది. మార్చినెలలగా మవోయిస్టు పార్టీని మొత్తం లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించిన మేరకు మావోయిస్టు పార్టీకి దెబ్బమీదదెబ్బ తగులుతున్నది. పార్టీలోనే మోస్ట్‌వాంటెడ్ మాడ్వి హిడ్మా మారేడుమిల్లిలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందడంతో పార్టీలో మరింత అలజడి మొదలైంది. హిడ్మాను అంతమొందించడంలో భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించినట్లుగా చెప్పుకుంటున్నారు. దీంతో నిర్ణీత గడువు కంటే ముందే మావోయిస్టుపార్టీ మొత్తం ఖాళీ అవుతుందనే ప్రచారం జరుగుతున్న ఈ నేపథ్యంలో ఉమ్మడిజిల్లాకు చెందిన లక్ష్మణరావు, తిప్పిరి తిరుపతి, మల్ల రాజిరెడ్డి ఎక్కడ ఉన్నారు?. వారి పరిస్థితి ఏమిటని చర్చ సాగుతున్నది. అలాగే పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన డివిజన్‌సభ్యుడు అప్పాసి నారాయణ, కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు చెందిన రాష్ట్రకమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోనున్నారని వార్తలు వస్తున్నాయి.