‘సర్దుబాటు’పై అభ్యంతరాలు
ABN , Publish Date - Oct 05 , 2025 | 01:19 AM
విద్యార్థుల సంఖ్య మేరకు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ నిర్వహించాలని విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
- 109 మంది టీచర్లకు డిప్యూటేషన్
- 6న కొత్త పాఠశాలల్లో చేరాలని డీఈవో ఆదేశాలు
- ఇష్టారాజ్యంగా బదిలీలు చేశారని ఉపాధ్యాయ సంఘాల విమర్శలు
కరీంనగర్ టౌన్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల సంఖ్య మేరకు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ నిర్వహించాలని విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతులతో, పదవీ విరమణతో ఏర్పడ్డ ఖాళీలను సర్దుబాటు ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ మేరకు ఇన్‌చార్జి విద్యాశాఖ అధికారి ఎస్ మొండయ్య జిల్లాలోని 109 మంది ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై బదిలీలు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన ఉపాద్యాయులను శనివారం రిలీవ్ చేయాలని ఎంఈవోలకు, స్కూల్ కాంప్లెక్సు హెచ్‌ఎంలకు ఆదేశాలు జారీ చేస్తూ బదిలీ అయిన ఉపాధ్యాయులు 6న ఆయా పాఠశాలల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు.
ఫ నిబంధనలకు విరుద్ధంగా..
సర్దుబాటు బదిలీల్లో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చిన నిబంధనలను పట్టించుకోలేదని, కొంత మంది ఎంఈవోలు వారికి నచ్చిన ఉపాధ్యాయులను సర్దుబాటులో నచ్చిన ప్రాంతాలకు బదిలీలు చేయించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్దుబాటు ఉపాధ్యాయుల బదిలీల్లో జరిగిన లోపాలను ఎత్తిచూపుతూ ఉపాధ్యాయ సంఘాలు డీఈవోకు అభ్యంతరాలతో కూడిన వినతిపత్రాలను అందజేసినట్లు తెలిసింది.
- కరీంనగర్‌లోని ఓల్డ్ హైస్కూల్‌లో పనిచేస్తున్న ఇద్దరు తెలుగు పండిట్‌లను వేర్వేరు పాఠశాలలకు సర్దుబాటు చేసి, సప్తగిరికాలనీలో పనిచేస్తున్న మరో తెలుగు పండిట్‌కు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారు. ఇద్దరిలో ఒకరిని బదిలీ చేయకుండా ఇద్దరిని బదిలీ చేసి వారి స్థానంలో మరొకరికి ఎందుకు అవకాశమిచ్చారో జిల్లా అధికారులకే తెలియాలి.
- జిల్లా స్పోర్ట్స్ పాఠశాలకు ఒక సోషల్ స్టడీస్ ఉపాధ్యాయుడికి బదులుగా ఇద్దరికి పోస్టింగ్ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- గన్నేరువరం మండలంలో మోత్కుపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులుండగా అక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు ఉండే వారు. వారిలో ఒక టీచర్ వేరొక చోటికి వెళ్లగా ఒక్కరే పనిచేస్తున్నారు. ఆ ఒక్క ఉపాధ్యాయుడు ఇటీవల చేపట్టిన పదోన్నతుల్లో వేరొక స్కూల్‌కు వెళ్లారు. ఈ ఇద్దరు విద్యార్థులను గునుకుల కొండాపూర్ యూపీఎస్‌లో విలీనం చేశారు. ఈ యూపీఎస్‌లో ప్రస్తుతం ఐదుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇద్దరు విద్యార్థులతో మూతపడ్డ పాఠశాలకు జంగపల్లిలో పని చేస్తున్న ఉపాధ్యాయుడిని సర్దుబాటు బదిలీ చేశారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
- జమ్మికుంట మండలంలో మాచనపల్లి యూపీఎస్ నుంచి ఒక ఎస్జీటీని తక్కువ విద్యార్థులు ఉన్న ధర్మారం యూపీఎస్‌కు సర్దుబాటు చేశారు. ధర్మారం యూపీఎస్‌లో ఇప్పటికే 18 మంది విద్యార్థులకు ఇద్దరు ఎస్జీటీలు విద్యాబోధన చేస్తుండగా మరొకరిని అదనంగా నియమించారు.
- జడ్పీహెచ్‌ఎస్ ఇల్లందకుంటలో 189 మంది విద్యార్థులుండగా ఇంగ్లీష్, తెలుగు మీడియంలో తరగతులను నిర్వహిస్తున్నారు. ఇందులో పని చేస్తున్న ఒక తెలుగు టీచర్‌ను 17 మంది ఉన్న లక్ష్మాజిపల్లి యూపీఎస్‌కు బదిలీ చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
సర్దుబాటు బదిలీల్లో కొంత మంది ఎంఈవోలు, హెడ్మాస్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారి సర్దుబాటు ప్రక్రియలో జరిగిన లోపాలు, అభ్యంతరాలను మరోసారి పరిశీలించి, బదిలీ చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
14కెఎన్‌ఆర్-4
----------------
ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి సరఫరా చేయాలి
- మున్సిపల్ కమిషనర్ ఫ్రఫుల్‌దేశాయ్
కరీంనగర్ టౌన్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): నగర ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి సరఫరా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ఫ్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన మున్సిపల్ సమావేశమందిరంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌లో చేపట్టిన పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నగరంలో వివిధ గ్రాంట్లతో పనులు ప్రారంభించి పెండింగ్‌లో ఉన్న అన్ని అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభివృద్ధి పనులను ఇంజనీరింగ్ అధికారులు తప్పనిసరిగా పర్యవేక్షించాలని, పనులన్నీ టైమ్‌లైన్ ప్రకారం, టెండర్ అగ్రిమెంట్ ప్రకారం కాంట్రాక్టర్లు పూర్తి చేచేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. సమయం ప్రకారం ప్రతిరోజు నల్లానీటిని సరఫరా చేయాలని, నీటి సరఫరా సమయంలో ఇంజనీరింగ్ అధికారులు, లైన్‌మెన్లు, ఫిట్టర్లు పర్యవేక్షణ తప్పకుండా చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా లీకేజీలుంటే వెంటనే వాటికి మరమ్మత్తులు చేయాలని, నీరు కలుషితం కాకుండా చూడాలని అన్నారు. ఈసమావేశంలో ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఈఈలు సంజీవ్‌కుమార్, రొడ్డ యాదగిరి, డీఈ ఓం ప్రకాశ్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.