మద్యం దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్
ABN , Publish Date - Sep 27 , 2025 | 01:52 AM
మద్యం దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్, గెజిట్ విడుదలైంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రెండు నెలల ముందే మద్యం షాపుల టెండర్లకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పూనుకుంది. 2025-27 సంవత్సరానికి సంబంధించి మద్యం దుకాణాల కేటాయింపునకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
జగిత్యాల, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మద్యం దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్, గెజిట్ విడుదలైంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రెండు నెలల ముందే మద్యం షాపుల టెండర్లకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పూనుకుంది. 2025-27 సంవత్సరానికి సంబంధించి మద్యం దుకాణాల కేటాయింపునకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. గతంలో రూ.2 లక్షలు ఉన్న టెండర్ ఫీజు (నాన్ రిఫండబుల్)ను ఈసారి రూ.3 లక్షలకు పెంచింది. ఈ క్రమంలో 2025-2027 పాలసీని అమలు చేసేందుకు జిల్లాలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు కార్యాచరణను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వైన్ షాపులకు నవంబరు 30వ తేదీ వరకు నిర్వహించుకునే అవకాశం ఉంది. కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్యప్రసాద్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణలు డ్రా తీసి గౌడ కులస్థులకు, ఎస్సీలకు దుకాణాల కేటాయింపును పూర్తి చేశారు. దీంతో జిల్లాలోని మద్యం వ్యాపారులు టెండర్లలో పాల్గొని మద్యం దుకాణాలను దక్కించుకోవడానికి సమాయత్తమవుతున్నారు. జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంపులో గల ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో అధికారులు మద్యం దుకాణాల టెండర్లను స్వీకరిస్తున్నారు.
ఫజిల్లాలో 71 మద్యం దుకాణాలు..
జిల్లాలో జగిత్యాల, ధర్మపురి, మెట్‌పల్లి ఎక్సైజ్ సర్కిళ్లు ఉన్నాయి. జగిత్యాల సర్కిల్ పరిధిలో 28 దుకాణాలు, ధర్మపురి సర్కిల్ పరిధిలో 18 దుకాణాలు, మెట్‌పల్లి సర్కిల్ పరిధిలో 25 దుకాణాలున్నాయి. జిల్లా వ్యాప్తంగా 71 వైన్స్ దుకాణాలకు గాను గౌడ కులస్థులకు 14 దుకాణాలు, ఎస్సీ సామాజిక వర్గానికి 8 దుకాణాలను, 49 దుకాణాలను జనరల్‌కు కేటాయించారు. 2019 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 64 దుకాణాలకు టెండర్లు నిర్వహించగా 1,285 దరఖాస్తులు రాగా, ఎక్సైజ్ శాఖకు రూ. 25.70 కోట్ల ఆదాయం లభించింది. 2023 సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 71 దుకాణాలకు టెండర్లు నిర్వహించగా 2,636 దరఖాస్తులు రాగా, ఎక్సైజ్ శాఖకు రూ.52 కోట్ల ఆదాయం లభించింది. జిల్లాలో సగటున నెలకు రూ.62 కోట్ల విలువ గల లిక్కర్ క్రయ విక్రయాల టర్నోవర్ ఉంటోంది. యేడాదికి సుమారు రూ.751 కోట్ల లిక్కర్ అమ్మకాల టర్నోవర్ ఉంటుందన్న అంచనాలున్నాయి. గీత వృత్తిపై ఆధారపడ్డ కుటుంబాలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా దుకాణాలు కేటాయించారు. టెండర్ల ప్రక్రియలో పాల్గొనడానికి ఒక్కో దుకాణానికి ఎన్ని దరఖాస్తులైనా వేసుకోవడానికి వీలు కల్పించారు. అయితే ప్రతి దరఖాస్తుకు గతంలో రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉండగా, ప్రస్తుతం పెంపుదల చేసి రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
ఫరిటైల్ దుకాణాలకు ఎక్సైజ్ ట్యాక్స్..
జనాభా ప్రాతిపదికన లిక్కర్ దుకాణాలకు ఎక్సైజ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 5వేల జనాభా కలిగిన గ్రామాలకు రూ.50 లక్షలు, 5 వేల నుంచి 50 వేల వరకు రూ. 55 లక్షలు, 50 వేల నుంచి లక్ష వరకు జనాభా కలిగిన గ్రామాలకు రూ.60 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 2025-27 రెండేళ్ల కాల పరిమితి సమయంలో ఆరు సమాన వాయిదాలతో ఎక్సైజ్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఫలక్కు కిక్కు ఎవరికో..
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మద్యం దుకాణాలను దక్కించుకోవడానికి భారీఎత్తున వ్యాపారులు పోటీ పడే అవకాశాలున్నట్లు ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. జిల్లాలో వైన్స్ దుకాణాలను చేజిక్కించుకొని లక్కు కిక్కును ఎవరు పొందుతారోనన్న చర్చలు జోరుగా జరుగుతున్నాయి. జగిత్యాల, ధర్మపురి, మెట్‌పల్లి ఎక్సైజ్ సర్కిల్ స్టేషన్ల వారీగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంపులో గల జగిత్యాల ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో స్టేషన్ల వారీగా ఏర్పాట్లు చేశారు. నోటిఫికేషన్, గెజిట్‌లో ఉన్న ప్రతీ అంశాన్ని దరఖాస్తు దాఖలు చేసే సమయంలో టెండర్‌దారుడికి వివరించేందుకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేశారు.
పకడ్బందీగా దరఖాస్తుల స్వీకరణ
-సత్యనారాయణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్, జగిత్యాల
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో పకడ్బందీగా వైన్స్ దుకాణాల కేటాయింపు నిర్వహించాం. దరఖాస్తుల స్వీకరణను సైతం నిబంధనల ప్రకారం పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి ప్రక్రియను ప్రారంభించాం. గతంలో కంటే ప్రస్తుతం దరఖాస్తుదారులు పెరిగే అవకాశాలున్నాయి.