చినుకు రాలదు.. చింత తీరదు..
ABN , Publish Date - Jun 29 , 2025 | 01:15 AM
వరుణుడు ముఖం చాటేయడంతో జిల్లాలో వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. వర్షాకాలం ఆరంభమై నెల రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసి న దాఖలాలు లేవు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
వరుణుడు ముఖం చాటేయడంతో జిల్లాలో వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. వర్షాకాలం ఆరంభమై నెల రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసి న దాఖలాలు లేవు. ఇప్పటి వరకు జిల్లా సాధారణ వర్షపాతం 148.1 మిల్లీ మీటర్లు కాగా, కేవలం 70.7 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదయ్యింది. సాధారణానికి 52 శాతం లోటు వర్షపాతం ఉంది. ఏ ఒక్క మండలంలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. దీంతో ఈ ఏడాది ఆశించిన మేరకు వర్షాలు పడతాయా, లేదా అని ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ముందే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించినప్పటికీ, ఒక్క వాన కూడా పడడం లేదు. దుక్కులు దున్ని, వరి నార్లు పోసుకుని, వేసిన ఆరుతడి విత్తనాలు మొలకెత్తడానికి రైతులు దిగు లుతో ఆకాశం వైపు చూస్తున్నారు. మురిపిస్తున్న మబ్బులు.. కదులుతున్న మేఘాలతో రైతులు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారు. వర్షాలు పడక నేలలో వేసిన విత్తనాలు నేలలోనే మాడి పోయే ప్రమాదమేర్పడింది. జిల్లాలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి, వ్యవసాయ బావులు, బోరు బావులు, చెరువులు, కుంటల కింద 2,76,076 ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేయనున్నారని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. గత ఏడాది వానాకాలంలో 2,72,678 ఎకరాల్లో సాగు కాగా, ఈ ఏడాది అదనంగా 3,368 ఎకరాల్లో సాగు పెరగనున్నట్లు అధికారులు అంచనా వేశారు. జిల్లాలో అత్యధికంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలనే సాగు చేస్తున్నారు. వానాకాలంలో 2,12,500 ఎకరాల్లో వరి, 705 ఎకరాల్లో మొక్కజొన్న, 5 ఎకరాల్లో పెసర, 5 ఎకరాల్లో మినుము, 250 ఎకరాల్లో కంది, 10 ఎకరాల్లో వేరుశెనగ, 5 ఎకరాల్లో నువ్వులు, 52,500 ఎకరాల్లో పత్తి, 10,086 ఎకరాల్లో మిర్చి, పసుపు, ఆయిల్ ఫామ్, కూరగాయల పంటలు సాగు కానున్నాయని అధికారులు అంచనా వేశారు. ఈ పంటల సాగుకు గాను 32,447 మెట్రిక్ టన్నుల యూరియా, 7,900 టన్నుల డీఏపీ, 23,453 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 6,331 పొటాష్ ఎరువులు, 600 టన్నుల సూపర్ సల్ఫేట్ ఎరువులు, మొత్తం 70,731 టన్నుల వివిధ రకాల ఎరువులు అవసరం అవుతాయని అంచనా వేశారు.
ఫ ముదురుతున్న వరి నార్లు.. మొలకెత్తని విత్తనాలు
వానాకాలం సీజన్‌కు రైతులు దుక్కులు దున్ని ఆరుతడి విత్తనాలు వేశారు. వర్షాలు పడక ఆ విత్తనాలు కొన్ని నేలలోనే మాడిపోగా, మరికొన్ని మొలకలు ఎండి పోతున్నాయి. జిల్లాలో అత్యధికం గా వరి సాగు కానుండడంతో చాలా మంది రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు మే నెలాఖరులో కురిసిన అకాల వర్షాలకు పచ్చి రొట్ట విత్తనాలు పొలాల్లో చల్లారు. సన్న రకం వరి ధాన్యం పంటను సాగు చేసే రైతులకు క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇస్తుండడంతో చాలా మంది రైతులు సన్నాల సాగు వైపు మొగ్గు చూపారు. 60 నుంచి 70 శాతం వరకు సన్న రకం వరి పంటను పండించేందుకు వరి నార్లు పోశారు. వర్షాలు పడక పోవడంతో దుక్కులు ముందుకు సాగడం లేదు. చెరువులు, కుంటల్లో నీళ్లు అడు గంటి పోగా, వ్యవసాయ బావుల్లో కూడా నీళ్లు తగ్గు ముఖం పడుతున్నాయి. గత ఏడాది ఈ సమ యానికి వరి నార్లు ఊపందుకున్నాయి. 30 శాతానికి పైగా వరి నాట్లు పూర్తయ్యాయి. కానీ ఈ సీజన్‌లో 5 శాతం వరి నాట్లు కూడా పడని పరిస్థితి నెలకొన్నది. వరి తర్వాత అత్యధికంగా పత్తి పంటను సాగు చేస్తుండగా, కొందరు రైతులు ఇప్పటి వరకు కూడా దుక్కిలో విత్తనాలు వేయ లేదు. ఒక చినుకు పడితే విత్తనాలు విత్తాలని చూస్తున్నారు.
ఫ లోటు వర్షపాతం నమోదు
జిల్లాలో సాధారణానికంటే అత్యధికంగా లోటు వర్షపాతం ఓదెల మండలంలో 71 శాతం, సుల్తానా బాద్ మండలంలో 68 శాతం, ఎలిగేడు మండ లంలో 63 శాతం, మంథని మండలంలో 61 శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది. అలాగే ఽజూల పల్లి మండలంలో 59 శాతం, పెద్దపల్లి మండలంలో 57 శాతం, రామగిరి మండలంలో 55 శాతం, రామగుండంలో 54 శాతం, ధర్మారం మండలంలో 51 శాతం, కమాన్‌పూర్ మండలంలో 47 శాతం, కాల్వశ్రీరాంపూర్ మండలంలో 47 శాతం, అంతర్గాం మండలంలో 43 శాతం, ముత్తారం మండలంలో 29 శాతం, పాలకుర్తి మండలంలో 27 శాతం లోటు వర్షపాతం నమోదయ్యింది. వర్షాల కోసం రైతులు గ్రామాల్లో కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు. వరద పాశం కార్యక్రమాలు నిర్వహిస్తూ దేవాలయాల్లో జలాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరో వారంలో వర్షాలు కురియకుంటే పంటల సాగు కష్టమేనని రైతులు అంటున్నారు.
ఫ జిల్లాలో ఇప్పటి వరకు వర్షపాతం వివరాలు (మిల్లీ మీటర్లలో)..
-------------------------------------------------------క్ర.సం. మండలం సాధారణం కురిసింది
-------------------------------------------------------
1. ధర్మారం 139.2 68.8
2. పాలకుర్తి 141.4 103.8
3. అంతర్గాం 147.0 84.1
4. రామగుండం 150.9 68.8
5. రామగిరి 151.2 67.6
6. కమాన్‌పూర్ 164.3 87.5
7. పెద్దపల్లి 150.6 64.4
8. జూలపల్లి 133.8 54.6
9. ఎలిగేడు 149.8 55.5
10. సుల్తానాబాద్ 152.0 68.0
11. ఓదెల 132.2 38.3
12. కాల్వశ్రీరాంపూర్ 152.5 80.4
13. ముత్తారం 165.6 65.2
14. మంథని 165.6 65.2
-------------------------------------------------------
మొత్తం 148.1 70.7
-------------------------------------------------------