Share News

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి

ABN , Publish Date - Jun 28 , 2025 | 01:01 AM

జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగులకు తగినసేవలు అందించాలని, ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు.

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

- కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లిటౌన్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగులకు తగినసేవలు అందించాలని, ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లా ఆసుపత్రి పనితీరుపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రికి ప్రజాప్రతినిధులు, ప్రజల్లో మంచిపేరు వచ్చిందని, విశ్వాసం నిలబెట్టుకునేలా పనిచేయాలని కలెక్టర్‌ సూచించారు. టిఫా స్కానింగ్‌ సౌకర్యం ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉందని గర్భిణులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని, గర్భిణుల ను మొదటి నుంచీ సాధారణ ప్రసవాల వైపు ప్రోత్సహించాలన్నారు. చిన్నపిల్లల వైద్య విభాగంలో అందుతున్న వైద్య సేవల గురించి చర్చించి కలెక్టర్‌ పలు సూచనలు చేశారు. డయాగ్నొస్టిక్‌ హబ్‌ వద్ద శాంపిల్‌ తీసుకున్న తర్వాత గంట లోపు రిపోర్ట్‌ అందించేలా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేశారు. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో ఆర్‌బీఎస్‌కే వైద్య బృందం విద్యార్థుల ఆరోగ్యం నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఔట్‌ పేషెంట్‌ సంఖ్య పెరిగేందుకు కృషిచేయాలన్నారు. 24 గంటల పాటు పేషెంట్‌ కేర్‌ సరిగ్గా ఉండేలా చూడాలని, ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ ఫైల్‌ క్లియర్‌ చేయాలని కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో డీసీహెచ్‌వో డాక్టర్‌ శ్రీధర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ అన్నప్రసన్న కుమారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సీఆర్‌పీ విధులను పకడ్బందీగా నిర్వహించాలి

పెద్దపల్లి కల్చరల్‌: సీఆర్‌పీ విధులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత విద్యాశాఖ అధికారులు, సీఆర్‌పీలతో విద్యాశాఖ వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌, పాఠశాలల నిర్వహణపై శుక్రవారం సమీక్షించారు. సమావేశంలో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయుల వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ పారదర్శకంగా జరగాలని ఎటువంటి పైరవీలకు ఆస్కారం లేకుండా పూర్తిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు అందుబాటులో ఉండాలని, ఉన్నత పాఠశాలలో అన్ని సబ్జెక్టుల టీచర్లు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం ద్వారా పెరిగిన విద్యార్థుల సంఖ్య అనుగుణంగా అదనపు తరగతుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు అందించాలని కలెక్టర్‌ సూచించారు. క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్‌(సీఆర్‌పీ)నిబంధనల ప్రకారం వారి విధులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు లోటు ఉంటే జాబితా అందించాలన్నారు. వారానికి ఒకరోజు విద్యార్థులతో కలిసి భోజనం చేసి, భోజన నాణ్యతను పరిశీలించాలని సూచించారు. మండల కేంద్రాల్లోని భవిత కేంద్రాలను సైతం సీఆర్‌పీలు తనిఖీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో జీసీడీవో కవిత, ఎస్‌వో మల్లేష్‌, పీఎం షేక్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2025 | 01:01 AM