Share News

నామమాత్రంగా సీసీఐ కొనుగోళ్లు

ABN , Publish Date - Nov 10 , 2025 | 12:09 AM

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) నామమాత్రంగా పత్తి కొనుగోళ్లు చేపడుతోంది. అక్టోబరు 24న మార్కెట్‌ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఎనిమిది జిన్నింగ్‌ మిల్లులను ఎల్‌-1, ఎల్‌-2 కేటగిరీల్లో సీసీఐ నోటిఫై చేసింది. 15 రోజుల వ్యవదిలో 280 క్వింటాళ్ల పత్తి మాత్రమే సేకరించింది. దీంతో పత్తి రైతులకు మద్దతు ధర 8,110 రూపాయలు అందని ద్రాక్షగా మారింది.

నామమాత్రంగా సీసీఐ కొనుగోళ్లు
జిన్నింగ్‌ మిల్లులో పత్తి అన్‌లోడ్‌ చేస్తున్న కూలీలు

జమ్మికుంట రూరల్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) నామమాత్రంగా పత్తి కొనుగోళ్లు చేపడుతోంది. అక్టోబరు 24న మార్కెట్‌ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఎనిమిది జిన్నింగ్‌ మిల్లులను ఎల్‌-1, ఎల్‌-2 కేటగిరీల్లో సీసీఐ నోటిఫై చేసింది. 15 రోజుల వ్యవదిలో 280 క్వింటాళ్ల పత్తి మాత్రమే సేకరించింది. దీంతో పత్తి రైతులకు మద్దతు ధర 8,110 రూపాయలు అందని ద్రాక్షగా మారింది. 8 నుంచి 12 శాతం లోపు తేమ ఉన్న పత్తిని మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తుంది. తేమ ఒక శాతం ఎక్కువ ఉన్నా తిరస్కరిస్తున్నారు. దీంతో ప్రైవేట్‌ ట్రేడర్స్‌ క్వింటాల్‌కు 5,500 నుచి ఏడు వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. క్వింటాల్‌కు 2,610 నుంచి 1,110 చొప్పున పత్తి రైతులు నష్టపోవాల్సి వస్తోంది. నిత్యం వెయ్యి క్వింటాళ్ల పత్తి విక్రయానికి వస్తున్నప్పటికి అందులో వంద క్వింటాళ్లు కూడా సీసీఐ కొనుగోలు చేయకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ యేడు అధిక వర్షాలతో పత్తి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎకరాకు ఏడు క్వింటాళ్ల దిగుబడి రావడం కష్టతరంగా మారింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కనీస మద్ధతు ధర కూడా దక్కక పోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ సవాలక్ష కొర్రీలు పెడుతుండడంతో రైతులు తక్కువ ధరకు ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయించాల్సి వస్తోంది. పత్తి నాణ్యంా ఉన్నప్పటికి కపాస్‌ కిసాన్‌ యాప్‌పై చాల మంది రైతులకు అవగాహాన లేక ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయిస్తూ నష్టపోతున్నారు. రైతులందరి వద్ద స్మార్ట్‌ ఫోన్లు లేకపోవడం, ఉన్నా యాప్‌ను ఏ విధంగా ఉపయోగించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. కిందటి ఏడాది మాదిరిగానే సీసీఐ పత్తి కొనుగోళ్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Nov 10 , 2025 | 12:09 AM