సమయం లేదు మిత్రమా..!
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:50 AM
పల్లె పోరు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రసవత్తరంగా సాగుతోంది. సమయం లేదు మిత్రమా.. అంటూ బరిలో ఉన్న అభ్యర్థులు తమ అనుచరులను పరుగులు పెట్టిస్తున్నారు. తొలి పంచాయతీ ఎన్నికల్లో తొలి అంకం ముగిసింది. ఐదు మండలాల్లో 79.57 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని తొలి విడతలో వేములవాడ, వేములవాడ రూరల్, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట ఐదు మండలాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేశారు.
- జిల్లాలో పంచాయతీ పోరు రసవత్తరం
- ముగిసిన మలివిడత ప్రచారం
- మొదలైన ప్రలోభాల పర్వం
- రేపు రెండో దశలో 77 సర్పంచ్, 530 వార్డు స్థానాలకు ఎన్నికలు
- సర్పంచ్ అభ్యర్థులు 279 మంది, 530 వార్డుల్లో అభ్యర్థులు 1342 మంది
- తొలి విడతలో కాంగ్రెస్ హవా..
- 79.57 శాతం ఓటు హక్కు వినియోగం
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
పల్లె పోరు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రసవత్తరంగా సాగుతోంది. సమయం లేదు మిత్రమా.. అంటూ బరిలో ఉన్న అభ్యర్థులు తమ అనుచరులను పరుగులు పెట్టిస్తున్నారు. తొలి పంచాయతీ ఎన్నికల్లో తొలి అంకం ముగిసింది. ఐదు మండలాల్లో 79.57 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని తొలి విడతలో వేములవాడ, వేములవాడ రూరల్, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట ఐదు మండలాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేశారు. ఫలితాల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థుల హవా నడిచింది. బీఆర్‌ఎస్ కూడా బలంగా పోటీనిచ్చింది. తొలి విడతలో ఏకగ్రీవాలు కలిపి కాంగ్రెస్ మద్దతుదారులు 42 మంది గెలిస్తే, బీఆర్‌ఎస్ మద్దతుదారులు 30 మంది బీజేపీ మద్దతుదారులు ఏడు మంది, ఇతరులు ఆరుగురు గెలిచారు. రెండో విడతకు రంగం సిద్ధమైంది. తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, బోయిన్‌పల్లి మండలాలకు సంబంధించిన మలి విడత ప్రచారానికి శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు తెరపడింది. రెండో విడత ఎన్నికలు ఆదివారం నిర్వహించడానికి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుండగా, పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను తమవైపు ఉండే విధంగా ప్రలోభాలకు గురిచేయడం మొదలెట్టారు. మలి విడతలో ఉన్న మండలాల్లో ఇల్లంతకుంట, బోయినపల్లి మండలాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, తంగళ్ళపల్లికి బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు కే తారకరామారావులు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో మూడు మండలాల్లో సర్పంచ్ అభ్యర్థుల గెలుపుపై ఆసక్తి నెలకొంది.
మలి విడతలో 1621 మంది అభ్యర్థులు..
జిల్లాలోని పంచాయతీ ఎన్నికల్లో రెండో విడతలో బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్ళపల్లి మండలాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు 1621 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజెపీ, వామపక్ష పార్టీల మద్దతుదారులు విస్తృతంగా ప్రచారం చేశారు. మూడు మండలాల్లో 88 సర్పంచ్, 758 వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి. 11 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 77 గ్రామసర్పంచులకు 279 మంది అభ్యర్థులు, 228 వార్డుల్లో ఏకగ్రీవంగా 530 వార్డుల్లో 1342 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో బోయిన్‌పల్లి మండలంలో 23 సర్పంచ్ స్థానాల్లో 90 మంది, 166 వార్డుల్లో 437 మంది, తంగళ్ళపల్లిలో 27 సర్పంచ్ స్థానాల్లో 110 మంది, 174 వార్డుల్లో 451మంది, ఇల్లంతకుంటలో 27సర్పంచ్ స్థానాల్లో 79 మంది, 190 వార్డుల్లో 454 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో పోటీ చేశారు.
ఓటరుకు వల..
పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత ప్రచారానికి శుక్రవారం ముగిసిపోవడంతో ఓటుకు రేటు కడుతూ గంపగుత్తగా ఓట్లు కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండడంతో తంగళ్ళపల్లి, ఇల్లంతకుంట బోయిన్‌పల్లి మండలాల్లో ఓటుకు రూ 1500 నుంచి రూ 2 వేల వరకు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఓటర్లను ఎలాగైనా ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ఇంటింటికి మద్యం కూడా పంపిణీ చేస్తున్నారు. భారీగా మద్యం, డబ్బుల ప్రవాహం ఓట్లను తమ ఒడ్డుకు చేర్చుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు. రెండో విడతలోని గ్రామాల నుంచి ఉద్యోగాలు, చదువులు, ఉపాధి రీత్యా హైదరాబాద్, బెంగళూర్, పూణే, ముంబాయి, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లిన వారిని రప్పిస్తున్నారు. గ్రామాల్లో ఉన్న తమ బంధువుల ద్వారా రవాణా ఖర్చులు పంపిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్నవారికి ఓటింగ్‌కు వచ్చే విధంగా వాహనాలను ఏర్పాటు చేశారు. గెలుపోటములను ప్రభావితం చేసే వలస ఓట్లను రప్పించడానికి ప్రత్యేకంగా బృందాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు.